సమ్మక్క సారలమ్మ అందించిన పోరాట స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, గత సంవత్సరం ఫిబ్రవరి 6 న ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని, అమ్మవార్ల దయతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మేడారం మహా జాతరలో కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించారు.
మేడారం మహా జాతరలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించామని, మన రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కోరుకున్నామని అన్నారు.
మేడారం ప్రాంతం తనకు ముందు నుంచి వ్యక్తిగతంగా తనకు చాలా దగ్గరగా అనుబంధం ఉన్న ప్రాంతమని, సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో అనేక కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగిందని, గత సంవత్సరం ఫిబ్రవరి 6 న హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని, అమ్మవార్ల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పేదల పక్షంగా తల్లి కూతుర్లు సమ్మక్క సారలమ్మ వీరోచిత పోరాటం చేశారని, అదేవిధంగా గత పది సంవత్సరాల నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగిందని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేడారం మహా జాతర నిర్వహణకు 110 కోట్ల ప్రత్యేకంగా మంజూరు చేసి భక్తులకు ఇబ్బందులు కలక్కుండా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. దక్షిణ కుంభమేళాగా పేరు పొంది కోటి 50 లక్షలకు పైగా భక్తులు వచ్చే మేడారం మహా జాతరకు జాతీయ పండుగగా గుర్తించాలని, ఈ జాతరకు ప్రధానమంత్రి సైతం పాల్గొనాలని, ఆ దిశగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని సీఎం రేవంత్ కోరారు.
ఆడబిడ్డలకు ప్రయాణ ఖర్చులు ఉండకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు దాదాపు 18 కోట్ల జీరో టికెట్స్ మహిళలకు ఉచిత ప్రయాణం కింద అందించామని అన్నారు.
మేడారం మహా జాతర కోసం 6,000 బస్సులు ప్రత్యేకంగా వేయడం జరిగిందని, ఇందులో సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని అన్నారు. ప్రభుత్వ పాలన చేపట్టిన 60 రోజుల వ్యవధిలో 25 వేల మంది యువతకు నియామక పత్రాలు అందించామని, మార్చి రెండున లాల్ బహదూర్ స్టేడియంలో మరో 6 వేల మంది యువతకు నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ప్రైవేటు సెక్టార్లో మంచి ఉపాధి అవకాశాలు లభించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 ఐటిఐ లను రెండువేల కోట్ల ఖర్చుతో నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించలేక పోయినప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను వింటుంది వాటిని పరిష్కరిస్తుందని నమ్మకాన్ని ప్రజలలో కల్పించామని, ప్రజల ఎజెండా యే మా ఎజెండాగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్ అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఫిబ్రవరి 27న మరో రెండు గ్యారెంటీల అమలు ప్రారంభిస్తామని, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
మేడారం మహా జాతర తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంత్రుల చే కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇక్కడ ఉన్న ఆదివాసి గిరిజనులతో సంప్రదించి వారి సంప్రదాయాల ప్రకారం శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), టూరిజం , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మురళి నాయక్, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి , జాతర ప్రత్యేక అధికారులు శరత్ , ఆర్వి కర్ణన్,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్,ఎస్పీ శబరిష్, తదితరులు ఉన్నారు.