FIFA World Cup: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఫిపా ప్రపంచకప్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ఫుట్‌బాల్ ప్రపంచకప్ కు ఎడారి దేశం ఖతార్ వేదికగా మారింది. ఆదివారం రాత్రి అట్టహాసంగా టో్ర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ వర్సెస్ ఖతార్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన పోరులో ఈక్వెడా జట్టు విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ మొత్తం 29 రోజులుగా సాగుతుంది. వచ్చే నెల 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 32 జట్లు పాల్గొంటుండగా 62 మ్యాచ్ లు జరగనున్నాయి.
ప్రపంచంలో 200 దేశాల్లో ఆదరణ ఉన్న ఆట ఫుట్ బాల్. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత ఖరీదైన టోర్నీకూడా ఇదే. దీనికోసం ఖతార్ దాదాపు 220 మిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేసిందని సమాచారం. ఇప్పటి వరకు 21 ప్రపంచ కప్‌లు జరగ్గా కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే కనీసం ఒక్కసారైనా విశ్వవిజేతగా నిలిచాయి. రికార్డు స్థాయిలో అత్యధికంగా అయిదు సార్లు బ్రెజిల్ కప్పు గెలుచుకుంది. ఇటీలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు చాంపియన్లుగా నిలిచాయి. ఉరుగ్వే, అర్జెంటీనా, ప్రాన్స్ తలా రెండు సార్లు, ఇంగ్లాండ్, స్పెయిన్ ఒక్కోసారి విశ్వవిజేతలుగా నిలిచాయి. ఈ ఏడాది ఫేవరెట్ జట్టుగా బ్రెజిల్ బరిలో ఉంది. ఈసారి కూడా బ్రెజిల్ విశ్వవిజేతగా నిలుస్తుందన్న అంచనాలో క్రీడాభిమానులు ఉన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పేరున్నఫుట్ బాల్ ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచే జట్టుకు ఫ్రైజ్ మనీకూడా భారీగా ఉంటుంది. విజేతగా నిలిచే జట్టు రూ. 344 కోట్లు సొంతం చేసుకుంటుంది. రన్నరప్‌కు రూ. 245 కోట్లు దక్కుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ. 220 కోట్లు, రూ. 204 కోట్లు సొంతం చేసుకోనున్నాయి.