Loan waiver: బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం, ఎగ్గొట్టడం.. బ్యాంకర్లు ఆస్తులను జప్తు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బడా వ్యాపార వేత్తలు కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి లోన్‌ల రూపంలో తీసుకొని కట్టేందుకు మొఖం చాటేస్తుంటారు. అలాంటి సమయంలో బ్యాంకులుసైతం చేసేదేమీ లేక మొండి బాకాయిల కింద వాటిని మాఫీ చేస్తుంటాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఇలాంటి మొండి బకాయిలను మాఫీ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా దేశంలో బ్యాంకుల వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించే కీలకమైన ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఓ జాతీయ దినపత్రిక సమాచారం కోరగా ఈ మేరకు ఆర్బీఐ వివరాలను వెల్లడించింది.
దేశంలో గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 10లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు మాఫీ చేశాయంట. రూ. 10,09,510 కోట్లు మేర రద్దు చేయడం బ్యాంకుల ఎన్‌పీఏలు తగ్గుదలకు కారణమైంది. ఇక ఇచ్చిన రుణాల్లో 13శాతం మాత్రమే బ్యాంకులు రికవరీ చేశాయి. అంటే రూ.1,32,036 కోట్లు రికవరీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల తగ్గుదలకు రుణ మాఫీనే కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. గత ఐదేళ్లకు సంబంధించి ఎస్‌బీఐ రూ.2,04,486 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.67,214 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 66,711 కోట్లమేర మొండి బకాయిలను మాఫీ చేశాయి.
రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే అత్యధికంగా రుణమాఫీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. సుమారు 7,34,738 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయంట. అయితే, బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో మాఫీ పొందిన వారి వివరాలను మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు.