చార్ ధాం యాత్రపై నీలి నీడలు ముసురుకుంటున్నాయి. జోషిమఠ్ అంతకంతకూ కుంగి పోతుండటం దీనికి ప్రధాన కారణం. చార్ ధాం వెళ్లాలంటే జోషిమఠ్ దాటుకునే వెళ్లాలి. కానీ ఇక్కడి రోడ్లు, భవనాలు, హోటళ్లు ఏమాత్రం సురక్షితం అన్న విషయాలను నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ కు వెళ్లే రహదారికి చీలికలు వచ్చాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే కుంచించుకు పోతోందికూడా. ఇక్కడ కొండచరియలు విరిగిపడుతుండటంతో రోడ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహెబ్, బద్రీనాథ్ ధాం, గోవింద్ ఘాట్, మనా పాస్ కు వెళ్లాలంటే జోషిమఠ్ మీదనే చేరుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో ఏటా జరిగే చార్ ధాం యాత్ర కోసం పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఈ రహదారి వెంట ప్రయాణిస్తుండటంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. మరి ఇంత ట్రాఫిక్ ను ఇప్పుడు జోషిమఠ్ రహదారులు భరించగలవా అన్నది సందేహంగానే ఉంది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, నివేదిక సిద్ధం చేస్తున్నారు. హేలంగ్-మర్వారీ బైపాస్ ద్వారా చార్ ధాం యాత్రకు వెళ్లే ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా ఈ టన్నెల్ ఇంకా నిర్మాణం పూర్తి చేసుకోలేదు. దీంతో ఈ ఏడాది చార్ ధాం యాత్రపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
Char Dham: ఈ ఏడాది చార్ ధాం యాత్ర సాగేనా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES