Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Pak shock: పాకిస్థాన్‌తో చర్చలకు నో

Pak shock: పాకిస్థాన్‌తో చర్చలకు నో

భారత్‌తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు, అనేకానేక పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్థాన్‌ ప్రస్తుతం దాదాపు కాళ్లబేరానికి వచ్చింది. తమకు బుద్ధి వచ్చిందని, తాము తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహజా షరీఫ్‌ ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. తాము భారత్‌ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటనలో కొంత నిస్సహాయత ఉంది. ఎప్పటిలాగానే కొంత నయవంచన ఉంది. ఇందులో సందేహమేమీ లేదు. ఆయన అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది. అయితే, పాకిస్థాన్‌ నేతలది అలా ఊరుకుండే తత్వం కాదు. కాశ్మీర్‌తో సహా వివిధ కీలక సమస్యల మీద ‘నిజాయతీ’గా చర్చలు జరిపి, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కూడా షరీఫ్‌ సూచించారు. కాశ్మీర్‌ మీద ఇక చర్చించడానికి ఏమీ లేదన్న వాస్తవాన్ని ఆయన ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. కాశ్మీర్‌ భారత్‌లోని భాగమని, ఆర్టికల్‌ 370 రద్దుతో ఇది మరింత ధృవపడిందని, కాశ్మీర్‌ మొదటి నుంచి భారతదేశ అంతర్గత భూభాగమని ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఆర్టికల్‌ 370 రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని ఆయన తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది.
ఒక అత్యుత్తమ పాకిస్థాన్‌ పౌరుడుగా ఆయన చేయాల్సిందేమిటంటే, భారత్‌కు ఉగ్రవాదులను పంపించడాన్ని వెంటనే ఆపాలి. భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం మానాలి. వాస్తవమేమిటంటే, ఈ విషయాలన్నీ ఆయన చేతుల్లో లేవు. అసలు కాశ్మీర్‌ కారణంగానే అక్కడి సైన్యాధికారులకు ప్రమోషన్లు వస్తుంటాయి. కాశ్మీర్‌ సమస్యను రావణ కాష్టం లాగా మార్చడం మీదే వారి జీవితాలు, వారి భవితవ్యాలు ఆధారపడి ఉంటాయి. పాక్‌ ప్రధాని భారత్ తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించు కోవడం మీద దృష్టి కేంద్రీకరించడం చాలా మంచిది. నిజానికి, భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌తో చర్చలకు ససేమిరా అనేసింది. మీతో చర్చించడానికి ఏమీ లేదు. మీతో ఎటువంటి పరిస్థితుల్లోనూ చర్చలు జరపం అని భారతదేశ విదేశాంగ శాఖాధికారులు ఎప్పుడో తెగేసి చెప్పేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతోనే భారత్‌ కాశ్మీర్‌ సమస్యను చాలా వరకు పరిష్కరించేసింది. ఇప్పుడు భారత్‌ దృష్టిలో కాశ్మీర్‌ ఒక సమస్య కానే కాదు.
ఆర్థిక వ్యవస్థ కకావికలం
ఇక, ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉంది. గోధుమ పిండిని కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదివరకటి మాదిరిగా యూరోపియన్‌ దేశాల నుంచి ఆ దేశానికి ఎటువంటి ఎగుమతులూ జరగడం లేదు. ఇతరత్రా కూడా ఏవిధమైన సహాయమూ అందడం లేదు. అమెరికా నుంచి కూడా సహాయం చాలావరకు తగ్గింది. జనవరి 6వ తేదీ వరకు అందిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్‌ స్టేట్‌ బ్యాంక్‌లో విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగుకు చేరిపోయాయి. ప్రస్తుతం ఆ బ్యాంకులో ఉన్న విదేశీ మారక నిల్వలు 4.34 బిలియన్‌ డాలర్లు. మరో మూడు వారాల తర్వాత ఆ దేశం దిగుమతులు జరుపుకునే అవకాశం ఉండదు. గత ఏడాది చివర్లో వచ్చిన వరదలు, తుపానులు సగం దేశాన్ని ముంచేశాయి. సుమారు 80 లక్షల మంది నిరాశ్రయులై, ప్రభుత్వం పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోని వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 60 శాతం పెరిగిపోయాయి. గోధుమలు, పెట్రోల్‌, డీజల్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. దవ్యోల్బణం 23 శాతానికి పెరిగిపోయింది.
చైనా, యు.ఏ.ఇ, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్థాను సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే, అవి వాగ్దానం చేసిన సహాయం అందడానికి ఎంత లేదన్నా అయిదేళ్లు పడుతుందని అంచనా. ఈ సమస్యలు చాలవన్నట్టు, దేశంలో అనేక ప్రాంతాలలో తాలిబన్ల దాడులు ఎక్కువ య్యాయి. ఆఫ్ఘనిస్థాన్‌ చెందిన తాలిబన్లతో పాకిస్థాన్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పోయాయి. డురాండ్‌ రేఖ దగ్గర సమస్యలు ఎదురవుతున్నందు వల్లే పాకిస్థాన్‌ ప్రస్తుతం భారత్‌ వైపు చూస్తోంది. భారత్‌ గనక సహాయం చేస్తే ఆఫ్ఘనిస్థాన్‌ బారినుంచి తప్పించుకోవచ్చని పాక్‌ భావిస్తోంది. పాక్‌ విన్నపాలు, విజ్ఞప్తులను భారత్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భారత్‌ తమను పట్టించుకోకపోవడం పాకిస్థాన్‌కు మరింత పెద్ద సమస్యగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముందు దేశ ప్రజల కడుపు నింపడం పాకిస్థాన్‌కు గగనమై పోతోంది. ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల సహాయం కూడా అందడం లేదు.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News