Friday, September 20, 2024
Homeహెల్త్Hair wash: తలస్నానం చేస్తుంటే ఇవి మరవొద్దు...

Hair wash: తలస్నానం చేస్తుంటే ఇవి మరవొద్దు…

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల బారిన పడము. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే తల రుద్దుకునేటప్పుడు చాలామంది కొన్ని పొరబాట్లు చేస్తుంటారు. వాటితో వెంట్రుకల ద్రుఢత్వం, మెరుపు దెబ్బతింటాయి. జుట్టు రాలుతుంది. మాడు దురద పెడుతుంది. శిరోజాలు పట్టులా కాకుండా బిరుసుగా తయారవుతాయి. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు చాలామంది పొడి జుట్టుపై షాంపును వాడుతుంటారు. సగం తడిసిన వెంట్రుకలకు షాంపు పెట్టేస్తుంటారు. తలపై షాంపును అప్లై చేసేముందు నీళ్లతో వెంట్రుకలను బాగా తడుపుకోవాలి. అప్పుడే వెంట్రుకల మీద షాంపు బాగా పనిచేస్తుంది. వెంట్రుకలు శుభ్రంగా ఉంటాయి.

- Advertisement -

పొడి జుట్టు మీద షాంపు వేసి రుద్దుకోవడం వల్ల వెంట్రుకల్లోని మురికి వచ్చి మాడుపై చేరుతుంది. షాంపు తాలూకా మిగులు పదార్థాలు వెంట్రుకలను అంటిపెట్టుకుంటాయి. అందుకే తలను నీళ్లతో బాగా కడిగి షాంపు పెట్టి ఒకటి రెండు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే వెంట్రుకల్లోకి షాంపు వెళ్లడమే కాకుండా తల శుభ్రంగా ఉంటుంది. చాలామంది చేసే మరో పొరబాటు ఏమిటంటే షాంపు, కండిషనర్లను తలకు ఎక్కువ పాళ్లల్లో పెడుతుంటారు. వీటిని ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వెంట్రుకలు, మాడు బాగా శుభ్రంగా ఉంటాయని భావిస్తారు. కానీ ఇది తప్పు.

తలను రుద్దుకునేటప్పుడు సరైన పరిమాణంలో మాత్రమే షాంపు, కండిషనర్లను తలకు రాసుకోవాలి. షాంపు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల తలలో ఉండే నేచురల్ మాయిశ్చరైజర్ గుణం పోతుంది. దీని వల్ల జుట్టు రాలిపోవడమే కాదు వెంట్రుకలు రేగిపోయినట్టుండి పీచులా కనబడతాయి. కండిషనర్ ని తలకు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు జిడ్డుగా, ఆయిలీగా కనిపిస్తాయి. మనం చేసే మరో తప్పేమిటంటే చిక్కుగా ఉన్న జుట్టుకు షాంపు పట్టించి తలస్నానం చేస్తుంటాం. అలా చేయకూడదు.

తలస్నానం చేసే ముందు జుట్టు చిక్కుతీసుకుని, వెంట్రుకలను నీళ్లతో బాగా తడిపి అప్పుడు షాంపును పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడదు. చిక్కు జుట్టుకు షాంపు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు చిట్లిపోతుంది. చిక్కులేని జుట్టు మీద షాంపు బాగా పనిచేస్తుంది. వెంట్రుకల్ని సులువుగా వాష్ చేసుకోగలం. అందుకే తలస్నానం చేసే ముందు మీ వెంట్రుకలను హెయిర్ బ్రష్ తో బాగా దువ్కుంటే వెంట్రుకలు చిక్కులేకుండా ఉంటాయి. రోజూ తలస్నానం చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి..బాగా పెరుగుతాయనే భ్రమలో చాలామంది ఉంటారు. కానీ ఇది తప్పు.

రోజూ స్నానం చేయడం వల్ల వెంట్రుకలు హెల్దీగా కనపడవు. ఎందుకంటే మన శిరోజాల్లో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. అవి వెంట్రుకలను సంరక్షిస్తాయి. వెంట్రుకల్లోని తేమగుణాన్ని పోగొట్టవు. జుట్టు చిట్లకుండా, రాలకుండా కాపాడడమే కాకుండా వెంట్రుకలను నిగ నిగలాడేలా చేస్తాయి. రోజూ షాంపు వాడడం వల్ల వెంట్రుకల్లోని ఆ సహజ మాయిశ్చరైజర్ గుణం దెబ్బతింటుంది. జట్టు పొడారినట్టు తయారవుతుంది. వెంట్రుకలు కాంతివిహీనంగా ఉంటాయి. మైల్డ్ షాంపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలస్నానం చేస్తే చాలు మంచి ఫలితాలు కనపడతాయి.

అలాగే తలస్నానం చేసేటప్పుడు మాడు మీద వెంట్రుకలపై ఎక్కువ ఒత్తిడి పెట్టి రుద్దుతుంటారు. ఇలా చేయడం వల్ల తల, జుట్టు బాగా శుభ్రంగా ఉంటాయనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లడంతో పాటు రాలిపోవడం జరుగుతుంది. అందుకే మాడును, వెంట్రుకలను షాంపుతో సున్నితంగా రుద్దుకోవాలి. మాడుపై షాంపును అప్లై చేసి రుద్దుకుంటే చాలు. వెంట్రుకల చివర్ల వరకూ షాంపును పట్టించనవసరం లేదు. ఎక్కువ ప్రెషర్ పెట్టి వెంట్రుకల చివర వరకూ రుద్దడం వల్ల వెంట్రుకల కొసలు చిట్లడంతో పాటు శిరోజాలు పొడారినట్టవుతాయి. తలను షాంపుతో రుద్దుకునేటప్పుడు మునివేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ శుభ్రంచేసుకోవాలని మరవొద్దు. మనం చేసే మరొక తప్పేంటేమిటంటే తలస్నానం చేసేటప్పుడు బాగా వేడిగా ఉండే నీటిని వాడుతుంటాం. ఇందువల్ల వెంట్రులు దెబ్బతింటాయి.

అంతేకాదు శిరోజాలు చిట్లినట్లవడంతో పాటు జుట్టు ఊడుతుంది. బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడారినట్టవుతుంది. బాగా వేడిగా ఉన్న నీళ్లను మాడుమీద పోసుకోవడం వల్ల జుట్టు బాగా ఊడుతుంది. అందుకే తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లను మాత్రమే వాడాలి. తడి తలను టవల్ తో తుడుచుకుంటాం. అలా చేయొద్దు. అలా చేస్తే జుట్టు యొక్క సున్నితమైన కుదుళ్లు దెబ్బతింటాయి. వెంట్రుకలు కూడా రేగినట్టయి పీచులా కనపడతాయి. కాబట్టి తడి తలను ఫ్యాను గాలి కింద ఆరబెట్టుకోవడం ఉత్తమం. లేదా పాత మెత్తటి టీ షర్టుతో తడి తలను సున్నితంగా తుడుచుకుని వెంట్రుకలకు చుట్టబెట్టుకుంటే సరి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే షాంపు, కండిషనర్ల బ్రాండ్లను చాలామంది తరచూ మారుస్తుంటారు. అలా చేయొద్దు. ఈ అలవాటు వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. అందుకే మీకు సంత్రుప్తి కలిగించిన ఏదో ఒక షాంపు, కండిషనర్లకు పరిమితమవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీ శిరోజాల స్వభావానికి తగ్గట్టు, సీజన్లకనుగుణంగా శిరోజాల సంరక్షణకు పూనుకోవాలి. ఇందుకు నిపుణుల సలహా, సూచనలను తీసుకుని వాటిని పాటిస్తే మంచిది. అలాగే తడి జుట్టును హెయిర్ బ్రష్ తో దువ్వుకుంటే వెంట్రుకలు దెబ్బతినవు. వెంట్రుకల చిక్కు బాగా పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News