మేడారం జాతర సందర్భంగా దొంగ నోట్లను చాలామణి చేసే వ్యక్తులు పలుచోట్ల 500, 200 నోట్లను లక్షల రూపాయలలో చలామణి చేసినట్లు తెలిసింది. జాతరలో మద్యం, బెల్లం, కోళ్లు, పలు వ్యాపార దుకాణాలలో అందజేశారు. దొంగ నోట్ల చలామణి చేసే వ్యక్తులు కొందరిని ఏజెంట్లు గానీ నియమించుకొని అసలు నోటుకు ఐదు దొంగ నోట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఒకేసారి అధిక మొత్తంలో భక్తులు రావడం, జాతరలో కోట్లాది రూపాయల వ్యాపారం జరగడంతో అసలు నోట్లతో పాటు నకిలీ నోట్లను వ్యాపారులకు ఇచ్చారు. పెద్ద మొత్తంలో వ్యాపారాలు కొనసాగడంతో వ్యాపారులు తమ నగదును బ్యాంకులలో జమ చేయడానికి వెళ్ళగా ఈ విషయం బయటపడింది.
గోవిందరావుపేట మండలం పసర గ్రామంలోని ఒక మద్యం దుకాణంలో నకిలీ 200 రూపాయల నోట్లు రావడంతో వ్యాపారి ఆందోళన చెందారు. ఈ విషయం ‘తెలుగుప్రభ’కు తెలియడంతో సంబంధిత వ్యాపారిని వివరణ కోరగా మద్యం కొనుగోలు చేయడానికి మద్యం ప్రియులు పెద్ద ఎత్తున రావడంతో తాము నకలి నోట్లను గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో పలుచోట్ల నకిలీ నోట్ల చలామణి జరిగినట్లు సమాచారం.