కర్ణాటకలో ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల మీద అందరి దృష్టీ ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. తర తమ బేధం లేకుండా దాదాపు ప్రతి రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా వాగ్దానాలు గుప్పిస్తున్నాయి. హామీలు ఇస్తున్నాయి. ఈ వాగ్దానాలు, హామీలు పూర్తిగా ఉచితాలకు సంబంధించినవే. ఎంతో ముందుగానే ప్రారంభమైన ఎన్నికల ప్రచారాల్లో అలవి కాని వాగ్దానాలు చేయడంలో పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక వేలం పాట మాదిరిగా ఉచితాలను పోటీ పోటీగా పెంచుతూ పోతున్నాయి. మహిళలు తమ ఇంటి వ్యవహారాలను నిర్వర్తించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అలవెన్స్ ఇస్తుందని, దీన్ని ఫిబ్రవరి 17న సమర్పించే బడ్జెట్‌లో చేర్చడం జరుగుతుంది దాని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ప్రకటించారు. ఇంకా లెక్కలు వేయాల్సింది ఉంది కానీ, ఈ మొత్తం సుమారు 3,000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. ఇందుకు కావాల్సిన నిధులను ఎలా సమీకరించాలా అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకబడి లేదు. తాము గనుక ఈ ఎన్నికల్లో అధికారానికి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించింది. ఒకటి రెండు రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చి పార్టీ ఏర్పాటు చేసిన ‘నా నాయకి’ అనే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వధ్రా తాము అధికారంలోకి వచ్చే పక్షంలో ప్రతి మహిళకూ 2,000 రూపాయల చొప్పున కుటుంబ నిర్వహణ భత్యం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెలా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా చేసినా, మహిళలందరికీ కుటుంబ నిర్వహణ భత్యం కింద నెలకు 2,000 రూపాయల చొప్పున చెల్లించినా రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి అదనంగా రూ. 45,000 కోట్ల భారం పడుతుంది. విచిత్రమేమిటంటే, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ సరఫరా సంస్థలు ఇప్పటికే పీకల లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాయి. ఈ 45,000 కో ట్ల రూపాయల్లో 21,000 కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరొక 13,000 కోట్ల రూపాయలకు పూచీకత్తులు కూడా సంపాదిస్తుంది. అయినప్పటికీ విద్యుత్ సంస్థలకు మిగిలిన డబ్బు కూడా పెను భారమే అవుతుంది.
ఇక, బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే పక్షంలో రాష్ట్ర ఖజానా మీద అదనంగా 54,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇది వరకే అమలులో ఉన్న కొన్ని ముఖ్యమైన పథకాలకు ఈ అదనపు భారం వల్ల దెబ్బ తగులుతుంది. ఆ పథకాలు దారి తప్పడం ఖాయమనే చెప్పవచ్చు. అంతేకాక, గతం లో వాగ్దానం చేసిన కొన్ని సంక్షేమ పథకాలు నిధుల కొరత కారణంగా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కొత్త వాగ్దానాలను నెరవేరిస్తే పాత పథకాల సంగతి ఏమ వుతుందనేది అర్థం కావడం లేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విధంగ ఇష్టా రాజ్యంగా వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ తీరే చాలా పార్టీలకు మార్గదర్శనం అవుతోంది. మొదటిసారి ఈ విధంగా వాగ్దానాలు చేసినందువల్లే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అమర్చడం సాధ్యం కాక విలవిల్లాడుతోంది. కర్ణాటకలో వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపిస్తున్న పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అర్థమైనట్టు కనిపించడం లేదు.
ఇంకా ఎన్నికల తేదీలను ప్రకటించక ముందు నుంచే పార్టీలు తమకు తోచినట్టు వాగ్దానాలు చేయ డం విచిత్రంగా కనిపిస్తోంది. ఇవన్నీ ఆ పార్టీల మేనిఫె స్టోల్లో కనిపిస్తాయో లేదో తెలియదు కానీ, ఏదో విధంగా మళ్లీ అధికారం చేపట్టా లనే తహతహలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించిన కాంగ్రెస్ దక్షిణాదిలో ఏదో విధంగా ఒక్క రాష్ట్రంలోనైనా అధికారానికి రావాలని తపించిపోతున్నట్టుంది. ఈ రెండు పార్టీలు అలవికాని వాగ్దానాలు చేయ డానికి ఇదే ప్రధాన కారణమని భా వించవచ్చు. నిజానికి, ఈ ఉచితాల వాగ్దానా లను నెరవేర్చడం ప్రారంభించినప్పటికీ, ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదు. ఈ విధంగా వాగ్దానాలు చేసే బదులు, హామీలు ఇచ్చే బదులు స్థానిక సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కార మార్గాలు ప్రకటించడం సమంజసంగా ఉంటుంది. నిరుద్యోగం, చదువులు, వ్యవసాయం, పర్యావరణం, మహిళలు, ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించిన సమస్యలకు తమ పరిష్కారాలేమిటో తెలియ జేయడం మంచిది. కనీసం మేనిఫెస్టోలలోనైనా వీటి గురించి ప్రస్తావిస్తాయని ఆశించాలి.
– జి. రాజశుక