Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: 175కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు రావాల్సిందే

Jagan: 175కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు రావాల్సిందే

మేం రెడీ, మా పోలింగ్ బూత్ రెడీ

2024 ఎన్నికల సమరానికి సిద్ధమై, మమేకమై ఈ 45 రోజులపాటు ఏ రకంగా పార్టీని గ్రామస్ధాయినుంచి బూత్‌ స్ధాయి వరకు బలపర్చుకుంటూ పోవాలన్న కార్యక్రమంపై అవగాహన పెంచుకుంటూ.. మనం ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం.

- Advertisement -

కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన రీజినల్‌ కో–ఆర్డినేటర్లకు, డిప్యూటీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, జేసీఎస్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్లకు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలకు, అసెంబ్లీ అబ్జర్వర్లకు, జేసీఎస్‌ జిల్లా కో–ఆర్డినేటర్లకు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులకు, జేసీఎస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు, ఎలక్షన్‌ ఆఫీసు హెడ్‌లకు, మండలపార్టీ అధ్యక్షులకు, జేసీఎస్‌ మండల ఇన్‌ఛార్జిలకు, నగర పార్టీ అధ్యక్షులకు.. ఇలా పార్టీ ఆర్గనైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర స్ధాయి నుంచి మండల స్ధాయి వరకు ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నా మాటల కన్నా ముందు ఇవాళ ఉదయం నుంచి చాలామంది మన పార్టీసీనియర్‌ నాయకులు, వక్తలు మీ అందరికీ పార్టీబలోపేతానికి రానున్న 45 రోజులకు సంబంధించి ఏ రకంగా అడుగులు మందుకు వేయాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ పోవాలి, బూత్‌ కమిటీలు ఎంత ముఖ్యం అన్న విషయాల మీద సుదీర్ఘంగా మీకు చెప్పారు.

కార్యకర్త తన నాయకుడ్ని చూసి కాలర్ ఎగరేయాలి
చివరిగా… మీ అందరికీ నేను కొన్ని విషయాలు క్లుప్తంగా చెబుతాను. ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. ఎప్పుడైనా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తా… రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు తమ నాయకుడ్ని చూపించి అదిగో అతడే మా నాయకుడు అని కాలర్‌ ఎగరేసి చెప్పే విధంగా ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా ఆ పార్టీకి గౌరవంగా ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకుని ఉన్న కేడర్‌ గ్రామస్ధాయిలో ఇంటింటికీ వెళ్లినప్పుడు వారికి కూడా ఆ గౌరవం లభిస్తుంది. పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి. పార్టీ నాయకుడు కూడా ఆ మాదిరిగానే వ్యవహరించాలి.

విశ్వసనీయత- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం
ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇందులో మరీ ముఖ్యమైన అడుగు….విశ్వసనీయత. ఇవాళ నేను గర్వంగా చెబుతున్నాను.. బహుశా దేశ రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటి మాత్రమే.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే అన్న మాట వినపడుతుంది. ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి చాలా చాలా అవసరమైన మాట ఇది.

2019కు ముందు 5 సంవత్సరాల కాలంలో టీడీపీ హయాంలో చంద్రబాబు పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకునివచ్చారు. 650 పేజీల మేనిఫెస్టో.. ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజీ కేటాయిస్తూ.. తాను అధికారంలోకివస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెబుతూ.. ముఖ్యమైన వాగ్ధానాలు కూడా చేశాడు.

హామీలిచ్చి అమలు చేయని బాబు
రైతన్నలకు రుణమాఫీ రూ.87,612 కోట్లు అని తెలిసినా, సాధ్యపడదని తెలిసినా కూడా…. మొట్టమొదట సంతకంలోనే మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. అంతటితో ఆగలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. పొదుపుసంఘాల రుణాలు అప్పట్లో దాదాపు రూ.15వేల కోట్ల ఉంటే ఆ రుణాలనూ మాఫీ చేస్తానన్నానడు.
అంతటితో ఆగలేదు…ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పడమే కాకుండా … గ్రామ గ్రామానికి, ఇంటింటికీ కార్యకర్తలను పంపి ప్రచారం ఇప్పించాడు. టీవీలలో విపరీతంగా యాడ్స్‌ వచ్చాయి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే.. బాబు రావాలని అడ్వర్టైజ్‌మెంట్లు. నాకు ఇప్పటికీ గుర్తుంది.

ఒక అక్కచెల్లెమ్మ మెడలో నుంచి తాళిబొట్టును ఎవరో లాగుతుంటారు. వెంటనే ఒక చేయి వచ్చి ఆపేస్తుంది. ఆ తర్వత వెనుక నుంచి మాటలు వినిపిస్తాయి. బాబు వస్తాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుందని మాటలు వినిపిస్తాయి.

రకరకాలుగా ఇలాంటి వాగ్ధా్నాలు. 2014లో చంద్రబాబునాయుడు గారు లాంటి మాటలు చెప్పినప్పుడు.. మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు నాక్కూడా చెప్పారు.సాధ్యం కాదని తెలిసినా ఆయన చెబుతున్నాడు. మనం కూడా చెబుదామన్నారు. పోయేదేముంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దాం అని మన పార్టీలో ఉన్నవాళ్లే అన్నారు. వాళ్లను తప్పు అని నేను అనను. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఒకవైపు అబద్దాలు ఆడుతున్నాడు. సాధ్యం కాదని తెలిసినా మోసం చేస్తూ ఉన్నాడు. మనం నీతిగా, నిజాయితీ యుద్ధం చేయాలని అంటున్నాం. ఈ మాదిరిగా యుద్దం చేయడం కుదరదని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నేను అన్నాను. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్ధం చెప్పాను. చేయగలిగిందే మనం చెప్పాలి. చేయలేం అని తెలిసినప్పుడు మన నోటిలోనుంచి ఆ మాట రాకూడదని చెప్పాను.

ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం. చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడు దత్తపుత్రుడి, అప్పట్లో కేంద్రంలో మోడీ గారి గాలి వీస్తుంది. ఆయన కూడా వీళ్లతో భాగస్వామ్యుడయ్యాడు.

అందరూ కలిసి ప్రజలను మొత్తానికి గొప్పగా మోసం చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత… మేనిఫెస్టో అన్నది కనిపించకుండా చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. మేనిఫెస్టో ఎక్కడుందని వెబ్‌సైట్లలో వెదికితే… అక్కడ కూడా కనిపించకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేం ఇది చెప్పాం… ఇలా చెప్పినాం కాబట్టి ఇది చేస్తున్నామని అని చేయలేకపోగా.. కేడర్‌ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్లి కూడా చెప్పుకోలేని పరిస్థితి. చివరకి ఏం జరిగింది. మోసం ఎప్పుడూ నిలబడదు.

చివరికి ప్రజలు ఎంత దారుణమైన తీర్పు ఇచ్చారంటే.. చంద్రబాబు నాయుడు పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడానికి చంద్రబాబునాయుడు గారి కేడర్‌ కూడా గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయింది.

కేడర్‌ అంటే తమ ఫలానా నాయుకుడు మా వాడు అని కాలర్‌ ఎగరేసుకుని చెప్పాల్సిన పరిస్థితి నుంచి… ఫలానా నాయకుడు మా వాడు అంటూ చెప్పడానికి భయపడి, గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి చెప్పడానికి భయపడే పరిస్ధితుల్లోకి క్యాడర్‌ వెళ్లిపోయింది. 2019లో ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడుని నమ్మిన ప్రజలందరూ మోసపోయిన పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగి… మల్లీ మేనిఫెస్టో అన్న అంశం మీదే వచ్చింది.

మన రెండు పేజీల మేనిఫెస్టో- ఒక బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌తో సమానంగా.. 2019లో మనం కేవలం రెండే రెండు పేజీలతో మన మేనిఫెస్టోను తీసుకొచ్చాం. రెండే రెండుపేజీలు ఎందుకంటే… ఆ మేనిఫోస్టో ప్రజలకు గుర్తుండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు కూడా గుర్తుండాలి.
ఆ మేనిఫెస్టోను మనం తీసుకొచ్చేటప్పుడు కూడా.. నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్నవాళ్లు కూడా కొంతమంది నన్ను అడిగారు. ఆ మాటలు నాకు ఈరోజుకూ గుర్తు ఉంది.

మేనిఫెస్టోలో ప్రతి మాట నెరవేరుస్తామని..
విజయనగరం జిల్లాలో అప్పలనర్శయ్య నాతో అన్నారు. ఇవన్నీ సాధ్యమేనా.. అన్నారు. ఆప్పుడు నేను అప్పలనర్శయ్యతో అన్నాను. ఇవన్నీ కచ్చితంగా చేసి తీరుతామని అన్నాను. అన్నీ ఆలోచన చేసిన తర్వాతనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. అన్నీ ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తున్నాను. ఇందులో చెప్పిన ప్రతిమాట కచ్చితంగా నెరవేరుస్తానని చెప్పాను.

2019లో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా 175 స్ధానాలకు 151 స్ధానాలతో అధికారంలోకి వచ్చాం. 25కి 22 ఎంపీ స్ధానాలు గెల్చుకున్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో మనం చెప్పిన రెండు పేజీల మేనిఫెస్టోని ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ చిత్తశుద్ధితో అడుగులు వేశాం.

ఇవాళ 5 సంవత్సరాల తర్వాత గర్వంగా కేడర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ.. రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామస్దాయి వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా వెళ్లి .. అక్కా, ఎన్నికలు ముందు ఇవి చెప్పాం… చెప్పినవన్నీ చేశాం. ఏకంగా 99శాతం హామీలన్నీ నెరవేర్చాం అని మేనిఫెస్టో తీసుకునివెళ్లి.. మీరే టిక్కు పెట్టిండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉంది. విశ్వసనీయతకు అంతటి ప్రాధాన్యతనిస్తూ ప్రతి అడుగూ వేయడం జరిగింది.

ప్రతి నియోజకవర్గంలోనూ 87శాతం ఇళ్లకు లబ్ధి..
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం తీసుకున్నా 87 శాతం పై చిలుకు ఇళ్లకు ప్రతి పథకం, ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. నిన్ననే కుప్పంలో చెప్పాను. కుప్పం గ్రామీణ నియోజవర్గం కాబట్టి అక్కడ 93.29శాతం ఇళ్లకు మంచి చేయగలిగిన పరిస్థితులు.

నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి..
ఎవరైనా నేను కుప్పంలో చెప్పిన మాటలు వినకపోతే కచ్చితంగా యూట్యూబ్‌లో డౌన్లోడ్‌ చేసుకుని వినండి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాను అంటే… కుప్పంలో నేను ప్రస్తావించిన అంశాలు.. ప్రతి నియోజకవర్గంలోకూ అవే మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. కుప్పంలో 87వేల పైచిలుకు ఇళ్లు ఉంటే.. ఏకంగా 83వేల ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. ఆ మాట ప్రస్తావిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్‌ బటన్‌ నొక్కడం ద్వారా, ఎలాంటి లంచాలు, వివక్షకు ఆస్కారం లేకుండా ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేశాం.

ఈ రూ.2.55 లక్షల కోట్లకు సంబంధించి… ఇందులో రూ.1400 కోట్లు కేవలం కుప్పం నియోజకవర్గంలో ఈ 83వేల ఇళ్లకు ఇవ్వగలిగాం. ఆ మాట చెబుతూ… అడుగులు ముందుకు వేశాం. 45వేల కుటుంబాలకు గతంలో అరకొరగా పెన్షన్‌ రూ.1000 అందేది. మీ జగన్‌ వచ్చిన తర్వాత దాన్ని రూ.3000 చేశాడు. గతంలో 30వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్‌ను వస్తున్న పరిస్థితిని మార్చి, 45వేల కుటుంబాలకు మీ జగన్‌ వచ్చిన తర్వాతే ఇచ్చాం. ఈ ఒక్క పెన్షన్‌ కార్యక్రమానికి ఈ 57 నెలల కాలంలో ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే 45వేల కుటుంబాలకు రూ. 507 కోట్లు ఇచ్చాం.

ఇదే మాదిరిగా చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి గురించి చెప్పాం. ఎక్కడ చూసినా ఇదే. ఇళ్ల స్ధలాలు 30వేల కుటుంబాలకు ఇచ్చాం. ఏ స్కీం చూసినా వేలాది కుటుంబాలకు మేలు చేశాం. మొత్తంగా 83వేల కుటుంబాలకు ఏకంగా రూ.1400 కోట్లు ఈ 57 నెలల కాలంలో బటన్‌ నొక్కి నవరత్నాల ద్వారా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది. ఇందులో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాల గురించి ప్రస్తావన లేదు. అది కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఎక్కువ మొత్తం అవుతుంది.

ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే… ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు, ఈ స్కీంలో ఇన్ని కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్తుంటే.. అటువైపు ప్రత్యర్ధికి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్ధాయి నుంచి, మండల స్ధాయి నుంచి, సచివాలయస్ధాయి వరకూ మీ అందరికీ అందుబాటులోకి ఉంది.

57 నెలల కాలంలో ఊహకందని సంస్కరణలు
మీరే ప్రతి సచివాలయం దగ్గరకి వెళ్లి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో డిస్‌ప్లే బోర్డులు ఆవిష్కరించారు. ఏ యే స్కీం పరిధిలో ఎన్నివేల మందికి లబ్ది చేకూరుందో మీరే చెప్పారు. నియోజకవర్గస్ధాయి, మండల, సచివాలయ స్ధాయి డేటా మీ దగ్గర ఉంది. ఇదొక్కటే కాకుండా మీరు ఏ ఇంటికి వెళ్లినా.. ఆ ఇంటికే రాసిన లెటర్, డేటా కూడా మీ దగ్గర ఉంది. ఇది అంతా మీకు అందుబాటులో ఉంది. ఎప్పుడూ జరగని విధంగా ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చాం. మార్పులు వచ్చాయి. గతంలో ఎప్పుడూ ఊహకు కూడా అందలేదు.

నిజంగా ఇది సాధ్యమేనా? ఎన్నికలకు మందు మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇన్ని వందలకోట్లు, ఇన్ని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు, వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? అని అడిగితే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వి వదిలేస్తారు.

కానీ ఈ 57 నెలల కాలంలో ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మలఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోయే విధంగా చేయడం సాధ్యమే అని చేసి చూపించాం. ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా గొప్ప విప్లవాత్మకమార్పు పరిపాలనలో తీసుకునిరాగలిగాం.

గ్రామాలలో స్కూళ్లు మారాయి. ఊహకు కూడా అందలేదు. డబ్బులు పెట్టుకోగలిగిన వారికి మాత్రమే ఇంగ్లిషుమీడియం చదువులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్‌రూమ్‌లలో డిజిటల్‌ బోధన అన్నది గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగింది. ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ ప్రతిపేదవాడికి నాణ్యతతో కూడిన విద్య అన్నది ఎంత అవసరమో అన్నది గుర్తించాం.
బడులు, మంచి చదువులు, ట్యాబులు అందించడంతో పాటు 57నెలల్లో నాణ్యమైన విద్య అన్నది ఎంత అవసరమో గుర్తించి.. ప్రతి పేదవాడు వెళ్లే బడిలో ఆ మాదిరిగా నాణ్యమైన విద్య తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే.

ఇవాళ జరుగున్నది కేవలం కులాల మధ్య యుద్ధం కాదు. నా నా నా అని ఎందుకుంటానంటే… వాళ్లు అట్టడుగన ఉన్న పేదవర్గాలు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూనే నా నిరుపేదలు అని కూడా నేను ఎందుకు అంటానంటే… ఓసీలలో కూడా నిరుపేదలున్నారు.

జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్‌.
ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇవాళ జరుగుతున్నది క్లాస్‌ వార్‌ అని గుర్తుపెట్టుకొండి. పేదవాడు ఒకవైపున.. పెత్తందార్లు మరొకవైపున ఉండి యుద్ధం జరుగుతుంది. మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్‌ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పథకాలు కొనసాగుతాయి. ఇంటికే వాలంటీర్‌ వస్తాడు. చిక్కటి చిరునవ్వులతో అవ్వాతాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్‌ ఉంటేనే బడులు మారుతాయి. పేదవాడు వెళ్లే స్కూళ్లు ఇంగ్లిషు మీడియంలోకి మారుతాయి.

మీ జగన్ ఉంటేనే…
మీ జగన్‌ ఉంటేనే గ్రామాలలో విలేజ్‌ క్లినిక్‌లు పనిచేయడం మొదలుపెడతాయి. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం. విస్తరించిన ఆరోగ్యశ్రీ గొప్పగా పనిచేస్తుంది. ఏ పేదవాడు కూడా ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా.. ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగేలంటే కేవలం జగన్‌ ఉంటేనే జరుగుతుంది.

ప్రతి అడుగులోనూ, ప్రతి అంశంలోనూ విశ్వసనీయత అనే పదానికి అర్ధం చెబుతూ… మొట్టమొదటిసారిగా రైతన్నలకు కనీవినీ ఎరుగని విధంగా గ్రామస్ధాయిలో ఆర్బీకే వ్యవస్ధ, ఇ–క్రాప్, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ఆర్బీకే లో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తున్నాడు. ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయం దాటిపోకమునుపే ఆ రైతన్నను చేయిపట్టుకుని గ్రామస్ధాయి నుంచే నడిపించే వ్యవస్ధలు గొప్పగా పనిచేస్తున్నాయి. పాలనా సంస్కరణలు జరిగాయి.

వైద్యం, చదువులు, వ్యవసాయం విషయంలోనూ ఎప్పుడూ ఊహకు కూడా అందని విధంగా మార్పులు చేశాం. ఫోన్‌లలో దిశ యాప్‌ను పెట్టగలుగుతామని.. 5 సార్లు ఫోన్‌ను అటూ ఇటూ ఊపినా, దిశ యాప్‌ను ప్రెస్‌ చేసినా వెంటనే పోలీస్‌ సోదరుడు పదినిమిషాల్లో ఫోనే చేస్తున్నాడు. వెంటనే వస్తున్నాడు. మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఒక మహిళా పోలీస్‌ నియమించాం. ఇలా ఎప్పుడూ పడని విధంగా అడుగులు పడ్డాయి. ఇవన్నీ ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ ప్రతి పేదవాడి ఇంటికి తీసుకుని పోవాలి.
ఇవన్నీ కొనసాగాలంటే మళ్లీ జగన్‌ అయితేనే మళ్లీ కొనసాగుతాయి అన్న మెసేజ్‌ తీసుకుని వెళ్లాలి.

జగన్‌కూ, వైఎస్సార్ కాంగ్రెస్‌కూ ఓటు వేయకపోతే…
పొరపాటున మనం జగన్‌కు కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కానీ ఓటు వేయకపోతే.. అది జరిగితే వాలంటీర్లు వ్యవస్ధ మాకు వద్దు, మళ్లీ జన్మభూమి కమిటీలు కావాలని మనంతట మనమే సంతకం పెట్టినట్టే. మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావిస్తూ… ప్రతినెలా సంవత్సరం పొడువునా .. ఏ పథకం ఎప్పుడు వస్తుందో షెడ్యూల్‌ ఇచ్చి, క్యాలెండరు ఇచ్చి అమలు చేస్తున్న పథకాలన్నీ మనంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చినట్టే. మళ్లీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. మరలా ఎవ్వడూ పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదు. మళ్లీ పేదవాడి బ్రతుకు చిన్నాభిన్నమే అన్న సంకేతం ప్రతి
ప్రతిపేదవాడి ఇంట్లోనూ వెళ్లాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి.

జగన్ చెబితే చేస్తాడంతే…
అమ్మా జగన్‌ ఏదైనా చెబితే చేస్తాడు. చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెబుతాడు.

కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు అన్నది మన కళ్లెదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం. దానికన్నా మందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెబుతున్నాడు. ప్రతి ఇంటికి బెంజ్‌ కారు కొనిస్తానంటున్నాడు. కానీ మళ్లీ జరగబోయేది మాత్రం ఇదేనమ్మా అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. ఇవన్నీ చెప్పి ప్రతి ఇంటిని కన్విస్‌ చేయాలి.

ఇది జరగాలి అంటే ప్రతి గ్రామంలోనూ ఉన్న బూత్‌ స్ధాయిలో మన ఆర్గనైజేషన్‌ ఎలా ఉందన్నది ప్రతి ఎమ్మెల్యే అంచనా వేసుకోవాలి. ప్రతి అబ్జర్వర్‌ అసెస్‌ చేసుకోవాలి. నియోజకవర్గస్ధాయి, మండలస్ధాయి నుంచి అన్ని కమిటీలు అసెస్‌ చేసుకోవాలి. ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వారికి ఒక్కటే సలహా ఇస్తున్నాను. మీకు సూచనలు, సలహాలు ఇస్తూ.. మీ ప్రతి అడుగులో తోడుగా ఉంటూ నడిపించేందుకు పెట్టిన అబ్జర్వర్లకు కూడా నేను ఒక్కటే సలహా ఇస్తున్నాను.

ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొండి. ఆ సచివాలయంలో మీకు సంబంధించి, మీకు కళ్లు, చెవులుగా ఉంటే మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను గుర్తించి ఈ నెలన్నర రోజులు అక్కడే పెట్టండి. వాళ్లు ఆ సచివాలయం పరిధిలో కేడర్‌ను, అభిమానులను, వాలంటీర్‌లను అందరినీ మీకు దగ్గర చేయాలి. అది మీరు రెగ్యులర్‌గా మానిటరింగ్‌ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో 80 సచివాలయాలు ఉంటాయి. వాళ్లకు మీ ఫోన్‌ అందుబాటులో ఉండాలి. వాళ్లు ఏ సచివాలయంలో, ఎక్కడ గ్యాప్‌ కనిపిస్తున్నట్టు మనకు చెప్పినా.. ఎప్పుడు ఫోన్‌ చేసినా మీరంతా ఫోన్‌ ఎత్తే పరిస్థితుల్లో ఉండాలి. వినే పరిస్థితుల్లో ఉండాలి. ఆ సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్, కేడర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే అభ్యర్ధికి దగ్గర కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు సచివాలయంలో పెట్టిన వ్యక్తి ద్వారా బూత్‌ కమిటీల మీద ధ్యాస పెట్టండి. గతంలోనే మనం నియమించాం. వాలంటీర్‌తో పాటు గృహసారధులను వేశాం. ప్రతి వాలంటీర్‌కు అనుసంధానంగా గృహసారధులతో కలిసి బూత్‌ కమిటీ సభ్యులుగా వేశాం. ఈ వ్యవస్ధను మానిటర్‌ చేసేందుకు నలుగురు మనుషులు(ఒక బూత్‌ ఇన్‌ఛార్జి, ముగ్గురు కన్వీనర్లు) ఆ బూత్‌ కింద ఉన్న క్లస్టర్‌ను పర్యవేక్షించాలి. ఈ ఆర్గనైజేషన్‌ అన్నది చాలా ముఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకొండి.

45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకొండి. మన పార్టీలో దాదాపు టిక్కెట్లన్నీ కరారు అయ్యాయి. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశాం. ఏదైనా ఇంకా ఒకటి అరా ఉంటాయి. కచ్చితంగా ఆర్గనైజైషన్‌ మీద ధ్యాస పెట్టండి. ఇందులో మీరు కనుక ఫెయిల్‌ అయితే మిమ్నల్ని ఎవరూ కాపాడలేరు. కారణం ఏమిటంటే.. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంటిలో మంచి జరిగిందని ఏకంగా లెటర్లు రూపంలోఇచ్చి, జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇచ్చిన పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు ఆర్గనైజేషన్‌ మీద ధ్యాస పెట్టిండి.

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మంచి చేశాం.
నేను ఒక్కటే చెబుతున్నాను. ప్రతి నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా.. అందులో 93 శాతమో, 87శాతమో ఇళ్లకు మనం మంచి చేశాం. నగరాలలో అయితే దాదాపు 80శాతం మంచి చేశాం. ఎక్కడ చూసినా ఈ స్ధాయిలో మంచి జరిగింది. మరి 87 శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గమైనా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏదైనా కావచ్చు. ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో 87 శాతం ఇళ్లకు మంచి చేయగలిగాం. ఏ ఇంట్లో ఎంత మంచి జరిగిందని లెటర్‌ తీసుకుని పోయి అక్కా మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగిందని చెప్పగలుగుతున్నాం. ప్రతి ఇంటికి ఇంత మంచి జరిగినప్పుడు.. ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజార్జీ రాకూడదు. ఆ గ్రామంలో వచ్చిన మెజార్టీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు. ప్రతి నియోజకవర్గంలో ఎందుకు రాకూడదు?. అది కుప్పమైనా? ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు.

మన ప్రత్యర్ధులు కుల ప్రస్తావనలు తీసుకొస్తారు. కానీ ఇక్కడ జరిగేది క్యాస్ట్‌ వార్‌ కాదు. క్లాస్‌ వార్‌. పేదవాడు బ్రతకాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రావాలి. పేదవాడు బాగుపడాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రావాలి. పేదవాడి భవిష్యత్‌ ఉండాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రావాలి. ఈ అంశం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పగలిగాలి.
నేను చేయగలిగింది అంతా నేను చేశాను. ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ, మీ చేతుల్లోకి ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు, ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టాను.
ఇక ముందుకు తీసుకునిపోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్‌ స్ట్రెంగ్త్‌ మీద మాత్రమే మాత్రమే ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో వెళ్లండి. మంచి చేశాం. మంచి చేసి ఓటు అడుగుతున్నామన్న ఒక గొప్ప సంతృప్తితో వెళ్లండి.

గతంలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు వచ్చాయి. ఈ సారి మాత్రం 175కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగా అంతే నమ్మకంతో అడుగులు వేయమని మీ అందరికి ఆల్‌ ది బెస్ట్‌ విషెష్‌ తెలియజేస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News