సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 18 వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని, ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. అహింసా మార్గాన్ని అవలంభించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని, సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా జిల్లా లో సేవాలాల్ మహరాజ్ భవన నిర్మాణం కోసం గతంలో కేటాయించిన స్థల పరిశీలన చేసి 15 రోజులలో శంకుస్థాపన చేయించుట కు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బంజారా జాతి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి 22 సూత్రాలను అందించారని అన్నారు. భాష వేషము కట్టుబొట్టు సాంప్రదాయాలు పద్ధతులు కూడా కాపాడుకుంటేనే ఒక లంబాడి గా గుర్తిపు ఉంటుందని అన్నారు. ఏదైనా మారాలంటే మననుండే మారాలని, దానికోసం వారు చూపిన బాటలో నడవాలని సూచించారు. సామాజికంగా గిరిజనులు ఇంకా ఎదగాలని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపి సీతారం నాయక్, మాజీ గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవిందనాయక్, గిరిజన సంక్షేమ శాఖ డి డి పోషం, డి ఎస్ పి రవీందర్, బంజారా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.