Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Senior citizens problems: వృద్ధులంటే పాలకులకు కూడా చులకనేనా?

Senior citizens problems: వృద్ధులంటే పాలకులకు కూడా చులకనేనా?

ఆర్థిక భద్రత పథకాలెక్కువ వర్తింపజేయాలి

దేశంలో జనాభాపరంగా వడివడిగా చోటు చేసుకుంటున్న మార్పులు, వాటికి సంబంధిం చిన సవాళ్లపై నీతి ఆయోగ్‌ తన తాజా నివేదికలో విస్తారంగా ప్రస్తావించింది. ‘సీనియర్‌ కేర్‌ రిఫారమ్స్‌ ఇన్‌ ఇండియా పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశ జనాభాలో 8.6 శాతం ఉన్న వయోజనుల సంఖ్య 2023 నాటికి 13 శాతానికి, 2050 నాటికి 20 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అంటే వయోజనుల సంరక్షణ విషయంలో విధా నాల తీరుతెన్నులు మార్పు చెందాల్సిన అవసరం ఉంది. వారి సంక్షేమం కొత్త కార్యక్రమాలు రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ దిశలో ఇంతవరకూ ఒక్క కార్య క్రమం కూడా చేపట్టడం జరగలేదు. పైగా, దేశంలో వయో జనుల స్థితిగతులకు సంబంధించిన వివరాలేవీ ప్రభుత్వాల వద్ద లేవనే చెప్పాలి. వృద్ధుల జీవన విధానం మీద ప్రత్యే కంగా అధ్యయనమేదీ జరగలేదు. ఇప్పటి వరకూ అందు బాటులో ఉన్న సమా చారం ప్రకారం దేశంలో అత్యధిక సంఖ్యాక వయోజనులు దుర్భర జీవితాలను అనుభవిస్తు న్నారు. ఇక సుమారు 71 శాతం మంది వృద్ధులు గ్రామీణ భారతంలోనే నివసిస్తు న్నారు. నగరాలు, పట్టణాలతో పోలిస్తే అక్కడ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఆర్థిక కార్య క్రమాలు, సంక్షేమ పథకాలు అతి తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశాలలోనే వృద్ధులకు గరిష్ఠ స్థాయిలో భద్రత అవసరం.
దేశంలో వృద్ధులను వారి పిల్లలు, సమాజమే కాదు, ప్రభుత్వాలు సైతం పట్టించుకోవడం లేదు. దేశంలో మత పరమైన, కుల సంబంధమైన ఓటు బ్యాంకులున్నాయి కానీ, వృద్ధుల ఓటు బ్యాంకు మాత్రం అభివృద్ది చెందడం లేదు. నిజానికి, భారతదేశ జనాభా క్రమంగా పెరగడమే కాదు, వయసులోనూ వృద్ధి చెందుతోంది. దీర్ఘాయుర్దాయా నికి అవకాశాలు పెరుగుతున్నాయి. శిశు మరణాల సంఖ్య ఆయేటికాయేడు గణనీయంగా తగ్గిపోతోంది. 2050 వచ్చే నాటికి దేశంలో యువకుల సంఖ్య కంటే వృద్ధుల సంఖ్య బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2022 నాటికే దేశంలో 60 ఏళ్ల పైబడినవారి సంఖ్య 14.90 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తం దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య సుమారు 10 శాతం ఉంది. 2050 నాటికి దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 20 శాతం మించిపోయే అవకాశం ఉందని జనాభా లెక్కల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 34.70 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. అంతే కాదు, 2036 నాటికే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి అయిదు మందిలో ఒకరు వృద్ధులు అయ్యే అవకాశం ఉంది.
పెరుగుతున్న వృద్ధ జనాభా గత ఏడాది ఇంటర్నేష నల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ విడుదల చేసిన భారతీయ వృద్ధాప్య నివేదిక, ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ వంటి ఇతర సంస్థలు విడుదల చేసిన నివేదికలను బట్టి, దేశంలో వృద్ధుల జనాభా ఏ స్థాయిలో పెరుగు తున్నదీ, దీని ప్రభావం ఎలా ఉండబోతోందీ అర్థం చేసుకో వచ్చు. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఆరోగ్య సంర క్షణ, ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితిగతులను కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు రూపొందించ వలసిన పథకాలు, విధానాలు, కార్యక్రమాల గురించి ఈ నివేదికల్లో ప్రముఖంగా సూచనలు చేయడం జరిగింది.
ఇప్పటి తరం వృద్ధులకే కాకుండా, భావి తరాల వృద్ధుల సంక్షేమం కోసం కూడా ఇప్పటి నుంచే చేపట్టా ల్సిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించడం జరి గింది. అత్యధిక శాతం వృద్ధులు కుటుంబ సభ్యుల మీదా, ఇతరుల మీదా ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో మున్ముందు వారి పరిస్థితిని, దుస్థితిని పరిగణనలోకి తీసు కుని వారి ఆర్థిక, సామాజిక అవసరాలకు ఊతం ఇవ్వా ల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బహుళ జాతులు, బహుళ సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఆచార సంప్రదాయాలకు, విలువలకు, ప్రమాణాలకు తగ్గట్టుగా వృద్ధుల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉంది.
ఇక నీతి ఆయోగ్‌ నివేదికలో వృద్ధుల జీవితాలకు సంబంధించి అనేక విషాదకర, ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో దాదాపు 75 మంది వయో జనులు దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు మానసిక కుంగుబాటు, దిగుళ్లతో ఇబ్బంది పడడం జరుగుతోంది. వయోజనులకు సంబం ధించినంత వరకూ ఆరోగ్య సంరక్షణ అనేది ఒక ఎండ మావిగానే ఉంటోంది. దేశంలో ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించిన ఔషధాలు ఎక్కడా లభ్యం కావడం లేదు. అసలు మౌలికమైన మందులే వారికి అందని మావిపళ్లుగా ఉంటున్నాయి. ఇక దేశంలో 78 శాతం మంది వృద్ధులకు పింఛన్‌ సౌకర్యం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేశం లో 18 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తోంది. దాదాపు 90 శాతం మంది వయోజనులకు ఆర్థిక భద్రతకు అవకాశమే లేదు. చాలామందికి రోజువారీ మనుగడ కూడా దుర్భరంగా ఉంటోందని, వారికి సామాజిక భద్రత అందుబాటులో లేకుండా పోవడమో, అసలు లేకపోవ డమో జరుగుతోంది. దేశంలో చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందువల్ల ఎక్కువ శాతం మంది వృద్ధులు ఒం టరి తనంతో నిస్సహాయంగా కాలం గడపడం జరుగు తోంది. మరొక ఆందోళనకర విషయమేమిటంటే, 54 శాతం మంది వృద్ధ మహిళలు వితంతువులే. వీరిలో 9 శాతం మంది మహిళలు ఒంటరిగా ఉండడం జరుగు తోంది. ఆందోళనకర విషయమేమిటంటే, దేశంలో వృద్ధుల సమస్యలతో పాటు, వృద్ధుల జనాభాతో పాటు, వితంతు వుల జనాభా, సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
ఒంటరి జీవితాలు అంతేకాదు, వృద్ధులు, వితంతు వుల సగటు ఆయుఃప్రమాణం కూడా పెరుగుతోంది. 2036 నాటికి దేశంలో వందేళ్లు దాటిన వారి సంఖ్య లక్షలకు చేరుకోబోతోందని అంచనా. దేశంలో 60 ఏళ్లు పైబడిన మహిళల్లో సగానికి సగం మంది వితంతువులే. వయసు పెరుగుతున్న కొద్దీ వితంతువుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోవడం వల్ల ఎక్కువగా కష్టనష్టాల పాలవుతున్నది మహిళలే. వీరు ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తోంది. వృద్ధాప్యంలో వీరు నాణ్యమైన జీవనశైలిని అనుభవించడానికి అవకాశాలు ఉండడం లేదు. వృద్ధులకు సంబంధించి దేశంలో అక్కడక్కడా కొన్ని సంక్షేమ కేంద్రాలు పనిచేస్తున్నప్పటికీ, వృద్ధులకు ఇవి అందని మానిపండ్లే అవుతున్నాయి. నిజానికి కొన్ని ప్రభుత్వాలు తమ కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వృద్ధులకు అవగాహన లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.
రానున్న కాలంలో జనాభాపరంగా మరిన్ని మార్పు లు, చేర్పులు చోటుచేసుకోబోతున్నందువల్ల వృద్ధుల పరి స్థితి మరింత దయనీయంగా, దుర్భరంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలన్న పక్షం లో ఇప్పటి నుంచి వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రణా ళికలు అమలు జరగాల్సి ఉంటుంది. ప్రణాళికలేవీ రూపుదిద్దుకోని పక్షంలో వృద్ధ జనాభా దేశానికి ఒక పెను భారంగా మారే ప్రమాదం ఉంది. వృద్ధుల కోసం మానసిక, శారీరక ఆరోగ్య సేవలను పెంపొందించడం వల్ల దేశానికి వృద్ధుల సేవలు కూడా అందుతాయని, దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తప్పకుండా పడుతుందని నీతి ఆయోగ్‌ నివేదిక సూచించింది. వారి కోసం ప్రత్యేకంగా అత్యవసర సేవలను కూడా పెంపొందించాల్సి ఉంటుందని కూడా అది సూచించింది. ఆర్థిక భద్రతకు సంబంధించిన పథకాలను వారికి ఎక్కువగా వర్తింపజేయాల్సి ఉంటుంది. పింఛన్‌, బీమా, పన్నుల సంస్కరణలు, ఇతర పథకాలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని కూడా నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుందని కూడా అది సూచించింది.

  • ఎస్‌. కోదండరాం,
    విశ్రాంత ఆచార్యుడు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News