Monday, November 25, 2024
Homeపాలిటిక్స్Vemulavada Cong politics: వేములవాడ కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు

Vemulavada Cong politics: వేములవాడ కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు

కొత్తవారి రాకతో ప్రశ్నార్థకంగా పాత నాయకుల భవిష్యత్

వేములవాడ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిన్నమొన్నటి వరకు వేములవాడ రాజకీయాలు అంతా బాగున్నట్లే కనిపించాయి. కానీ ఎప్పుడైతే వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవ్వడం ఓ వైపు, అదే సమయంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల నియామకానికి కసరత్తు జరుగుతుండటం మరోవైపు, ఈ రెండు పరిణామాలు హస్తం నేతల్లో అసంతృప్తికి ప్రధాన కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కొనసాగుతున్న చేరికల జాతర

ముఖ్యంగా నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే వేములవాడ పట్టణంలో ఈ అసంతృప్తి సెగలు అధికమవుతున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం గతంలో బి.ఆర్.ఎస్, బీజేపీ పార్టీల నుండి గెలిచిన కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం, వీరితో పాటు మరికొంత మంది పట్టణానికి చెందిన నాయకులు ఇతర పార్టీలను వీడి హస్తం గూటిలో చేరడం, వచ్చినా వారిని వచ్చినట్లు పార్టీలో చేర్చుకోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే జరిగిపోతున్నాయి. ఇవన్నీ పరిణామాలతో అధికార పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రెట్టింపు అవువుతున్నట్లు సమాచారం.

ప్రశ్నార్థకంగా పాత నాయకుల భవిష్యత్

ఇక అధికార పార్టీలో ఓ వైపు చేరికల జోరు కొనసాగుతుంటే మరోవైపు అంతకంటే రెట్టింపు స్థాయిలో అసంతృప్తి సెగలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి ఆయనతో ఉన్న అనుచరులతో పాటు గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా పార్టీలోనే ఉంటూ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు తమ భవిష్యత్ ఏంటో అనే రసకందాయంలో పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పార్టీలో పెరుగుతున్న చేరికలు. ఒకనాడు అవతలి పార్టీల్లో ఉండి, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇష్టం వచ్చిన రీతిలో విమర్శించిన వారు నేడు వారి వ్యక్తిగత అవసరాలు, ఇతర వ్యవహారాలన్ని చక్కబెట్టుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే ఉద్దేశ్యంతో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని, అలాంటి వారిని అడ్డుకోవాల్సిన ముఖ్య నాయకులే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానిస్తున్నారని, ఇలా అయితే గత కొన్నేళ్లుగా పార్టీ కొరకు శ్రమించిన తమ పరిస్థితి ఏంటని, తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటూ ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రశ్నించే శక్తి లేక పార్టీని వీడ లేక..

మరోవైపు గత కొన్నేళ్లుగా రాత్రనక, పగలనక కష్టపడి పని చేసి, పార్టీ అధికారంలోకి రావడానికి, అదే సమయంలో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యేందుకు కృషి చేసిన తమను నూతన చేరికలు కలవరపెడుతున్నాయని, తమ నాయకుడి గెలుపు కోసం సర్వం త్యాగం చేసి, ఆయన్ను గెలుపు తీరాలకు చేర్చిన తమకు ప్రశ్నించే తత్వం తెలియదని, ఒకవేళ దైర్యంగా ఒకడుగు ముందుకు వేసి ప్రశ్నించిన, దాని ఫలితం, పర్యవసానం ఎలా ఉంటుందనేది ఊహించలేనిదని భయం ఓ వైపు, పోనీ పార్టీ మారితేనైనా తమకు మంచి ఫలితం దక్కుతుందా అంటే అది లేదని, అంతకుమించి ఇన్ని రోజులు కష్టపడి పని చేసిన పార్టీని విడిచి వెళ్లలేమని మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేమని, పుట్టింది కాంగ్రెస్ లోనే చచ్చేది కాంగ్రెస్ లోనే అనే భావనతో మరోవైపు ఇటు ప్రశ్నించలేక, అటు పార్టీని వీడలేక అంతర్మథనంతో జెండాలు మోసిన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తల్లడిల్లుతున్నట్లు పలువురు పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.

ఆసక్తి కలిగిస్తున్న వేములవాడ రాజకీయాలు

ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఎంపీ ఎన్నికలకు ముందు వేములవాడ రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బి.ఆర్.ఎస్, బీజేపీ పార్టీలు ఖాళీ అవుతుండటం, అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓవర్ లోడ్ అవుతూ, స్వంత పార్టీలొనే అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వేములవాడ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇదే క్రమంలో అధికార పార్టీలో చేరికల జోరు ఇలానే కొనసాగితే రాబోయే ఎంపీ ఎన్నికల వరకు స్వంత పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, అదే సమయంలో వేరే పార్టీలో నుండి కాంగ్రెస్ లోకి వస్తున్న అవకాశవాదులు వారి పని పూర్తి చేసుకొని వెళ్లిపోవడం లేదా పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ అభ్యున్నతికి పూర్తిస్థాయిలో పని చేయకపోవడం, లేదా వారు ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అట్లాగే ఆది తన ఏకపక్ష నిర్ణయాలతో వచ్చిన వారిని వచ్చినట్లు కొత్తవారిని పార్టీలో చేర్చుకొని, పాత వారిని పక్కన పెడితే అధికార పార్టీకి త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని, అదే గనక జరిగితే పార్టీ అదిష్టానం ముందు ఆది శ్రీనివాస్ కు భంగపాటు తప్పదనే చర్చ కొనసాగుతోంది. అదే సమయంలో ఆది తీరును వ్యతిరేకించేలా, గత బి.ఆర్.ఎస్ పాలనే బాగుండేనేమో, అప్పుడే తమకు పూర్తి గౌరవ, మర్యాదలు దక్కుతుండేవని, సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమను, తమ నిర్ణయాలను స్వీకరించే నాథులే లేరని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులే చర్చించుకోవడం ఇక్కడ కొసమెరుపు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News