Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Pulse polio: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో

AP Pulse polio: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ చుక్కల మందు

ఈనెల 3వ తేది ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు మీ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన ఫేజ్-3 భూముల రీసర్వే, ఈనాం మరియు అసైన్డ్ భూములు,ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్, కరువు మండలాల్లో ఉపాధి హామీ పనులు, తాగునీరు, ఎంఎస్ఎంఇ క్లస్టర్లు, పరిశ్రమలకు భూములు కేటాయింపు,పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్ సేకరణ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 3వ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జాతీయ ఇమ్యునైజేషన్ డే-పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 3వ తేదీన బూత్ లో వారీగా పోలియో చుక్కలు వేశాక ఇంకా ఎవరైనా పోలియో చుక్కలు వేయించక పోతే పరిశీలించి వేసేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో 4, 5 తేదీల్లోను, పట్టణ ప్రాంతాల్లో 4, 5, 6 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

- Advertisement -

ముఖ్యంగా పట్టణాల్లోని మురికివాడలు, సంచార జాతులు నివసించే ప్రాంతాలు,ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఐదేళ్ళ లోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. అదే విధంగా రైల్వే స్టేషన్లు,బస్ స్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టీంల ద్వారా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యా,స్త్రీ శిశు సంక్షేమ, మున్సిపల్,పిఆర్ అండ్ ఆర్డి, ఆర్టీసి తదితర శాఖలు విభాగాలు సమన్వయంతో పని చేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అనంతరం కరవు మండలాల్లో ఉపాధి హామీ పనులు, తాగునీటి పరిస్థితులపై మాట్లాడుతూ కరువు మండలాల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం కింద 100 రోజులు పని దినాలను తప్పని సరిగా కల్పిం చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా తాగునీటి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తాగునీరు, ఉపాధికి సంబంధించి రానున్న మూడు మాసాలు అత్యంత కీలకమని కావున జిల్లా కలెక్టర్లు ఈఅంశంపై ప్రత్యేక శ్రద్ద, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. పప్పు దినుసులు మరియు ఆయిల్ సీడ్స్ సేకరణపై మాట్లాడుతూ కనీసం మద్దతు ధరకు రైతుల నుండి మినుములు,పెసలు,వేరుశెనగ వంటి పంటలు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని ధరలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం పరిశ్రమలు, ఎంఎస్ఎంఇ క్లస్టర్లకు భూములు కేటాయింపు అంశంపై మాట్లాడుతూ వివిధ పరిశ్రమలు కంపెనీలు సకాలం లో ఏర్పాటు అయ్యేందుకు భూములు కేటాయింపు జరగాలన్నారు. ఇంకా మూడవ విడత భూముల రీసర్వే,ఈనాం మరియు అసైన్డ్ భూములు, ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్, జగనన్న ఆరోగ్య సురక్షపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర సర్వే అండ్ రీసెటిల్మెంట్ శాఖ కమీషనర్ సిద్ధార్థ జైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి రామకృష్ణ,వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మ నాధ్ తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్, పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, సహకార శాఖ కమీషనర్ బాబు ఏ,పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News