Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్World Wildlife day: నేడే ‘ప్రపంచ వణ్యప్రాణి దినం’

World Wildlife day: నేడే ‘ప్రపంచ వణ్యప్రాణి దినం’

వన్యప్రాణులతో పర్యావరణ సమతుల్యత

మనిషికి ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమో భూగోళ పర్యావరణానికి అటవీ సంపద అంతే ప్రధానం. అటవీ సంపదలో దట్టమైన హరిత వనాలు, అందులో అంతర్భాగమైన జీవజాతులు లేదా వన్యప్రాణులు వస్తాయి. అడవుల్లో ఉండే జంతు, వృక్షజాలం మానవాళికి వెలకట్టలేని మేలును చేస్తున్నది. మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా అడవులలో జీవించే వృక్ష, జంతుజాలాన్ని వన్యప్రాణులుగా పిలుస్తారు. వన్యప్రాణుల్లో భారీ ఏనుగులు, జిరాఫీలు, రైనోలతో మెుదలు పక్షులు, క్రిమికీటకాలు, సూక్మజీవులు వస్తాయి. దేశవ్యాప్తంగా వన్యప్రాణులను అటవీ సంపదగా కాపాడుకుంటూ, జీవ వైవిధ్యాన్ని పదిలపరుచుకోవాలనే అవగాహన సమాజంలో కల్పించడానికి ప్రభుత్వాలు, పభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంధ కార్యకర్తలు కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వన్యప్రాణులను ఆహారంగానే కాకుండా జంతు అవయవాలు, కలప అక్రమ వ్యాపారం కోసం చట్టాలను ఉల్లంఘించి వేటాడడం/నరకడం జరుగుతోందనేది కఠిన వాస్తవం.

- Advertisement -

ప్రపంచ వన్యప్రాణుల దినం-2024 నినాదం:
వన్యప్రాణి ప్రాముఖ్యతను గుర్తించిన ఐరాస తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 15వ అంశంగా జీవవైవిధ్య పరిరక్షణను తీసుకొని వన్యప్రాణుల మనుగడ ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తూ, సభ్యదేశాలకు దిశ నిర్దేశనం చేస్తున్నది. ఇదే క్రమంలో వన్యప్రాణుల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే సదుద్దేశంతో 1973లో “సిఐటిఈయస్ (కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎండేన్‌జర్డ్‌ స్పీసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫానా అండ్‌ ఫ్లోరా)‌” వ్యవస్థాపన దినం గుర్తుగా తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి మార్చి 03న “ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాల”ను ప్రతిష్టాత్మకంగా చేబడుతున్నది. ఈ ఏడాది వన్యప్రాణి పరిరక్షణ సంస్థ “సిఐటిఈయస్‌” 50వ పుట్టిన రోజును (స్వర్ణోత్సవాలు) కూడా జరుపుకోవడం విశేషం. అడవుల నరికివేతను కట్టడి చేస్తూ, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ నిల్వలు, వన్యప్రాణి అభయారణ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా జీవ వైవిధ్యం కాపాడబడి, పర్యావరణ పరిరక్షణకు ఊతం ఇస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ వన్యప్రాణి దినం-2024 నినాదంగా “వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్‌ ఆవిష్కరణ ప్రమేయం : ప్రజలను భూగోళంతో కలపడం (కనెక్టింగ్‌ పీపుల్‌ అండ్‌ ప్లానెట్‌ : ఎక్స్‌ప్లోరింగ్‌ డిజిటల్‌ ఇన్నొవేషన్ ఇన్‌ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌‌‌)” అనబడే అంశం తీసుకోబడింది.

ప్రపంచ వన్యప్రాణ సంపద:
ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 5,500 రకాలైన జీవజాతులను పలు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమంగా విక్రయిస్తున్నారని తేలింది. వన్యప్రాణుల పరిరక్షణతోనే జీవ వైవిధ్యం నెలకొంటూ, కాలుష్యం తగ్గించబడి, పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుంది. వన్యప్రాణి దినోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ నేతృత్వంలో సదస్సులు, సమావేశాలు, కార్యశాలలు, పలు రకాలైన పోటీలు, గోడ పత్రికల విడుదల, వీధి నాటికలు, జంతు మరియు పక్షుల ప్రదర్శనశాల (జూలు) సందర్శనలు, వన సందర్శనలు, వనమహోత్సవాలు, వన్యప్రాణి పుస్తక పఠనం, వన్యప్రాణుల వీడియోలు చూపించడం, స్వచ్ఛ ప్రపంచం‌, పర్యవరణ వేత్తలతో ముఖాముఖి లాంటి వేదికల ద్వారా ప్రజలకు మరియు విద్యార్థి లోకానికి వన్యప్రాణుల పరిరక్షణ అవసరాన్ని వివరిస్తారు. ఈ దినోత్సవాలలో వన్యప్రాణి పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు, చట్టాల అమలులో పటిష్టత, అవసరమైన నూతన చట్టాల రూపకల్పన, జీవ సంరక్షణ అవసరం, అభాయారణ్యాల ఏర్పాటు, జాతీయ ఉద్యానవనాల స్థాపన, అడవుల నరివేతను వ్యతిరేకించడం వంటి అంశాలలో లోతైన చర్చలు జరపాలి.

భారత వన్యప్రాణుల సంపద:
1952లో ఏర్పాటు చేసిన భారత “జాతీయ వన్యప్రాణుల మండలి” చొరవతో వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 తీసుకువచ్చి దేశవ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయి. ఇండియాలోని అడవుల్లో 91,797 రకాలైన జంతుజాతులు మరియు 46,340 రకాల వృక్షజాతులు ఉన్నది. వీటికి తోడుగా 2,634 రకాల చేపల జలజాతుల సంపద మన దేశంలో ఉన్నది. ప్రపంచంలోని జీవజాతుల్లో 80 శాతం వరకు జీనవైవిధ్యం కలిగిన జంతు సంపద మన దేశంలోనే ఉంది. వీటిలో క్షీరదాలు, పక్షులు, సరిసృపాలు, ఉభయచరాలు లాంటి జీవుల అపారసంపద మన అడవులకు, మానవాళికి ఎనలేని సేవలందిస్తున్నాయి. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కేరళ అడవుల వరకు అపార జీవ వైవిధ్యంతో అటవీ గొర్రెలు, మేకలు, పులులు, చిరుతలు, అడమి దున్నలు, గేదెలు, అటవీ పిల్లులు, జింకలు, లంగూర్స్, కోతులు, గాడిదలు, ముళ్ళ పందులు, దుప్పులు, కుందేళ్లు, నక్కలు, ముంగీసలు, హైనాలు, గబ్బిలాలు, కుక్కలు, పలు రకాల పాములు, మెుసళ్లు, ఒంటెలు, ఏనుగులు, సింహాలు, తాబేళ్లు, బల్లలు, వైవిధ్యభరిత 2000 రకాల పక్షులు, ఖడ్గమృగాలు, అపార క్రిమికీటకాలు లాంటి అసంఖ్యాక జంతుజాలం మన అడవుల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. మన జాతీయ జంతువుగా టైగర్‌, జాతీయ పక్షిగా నెమలి గుర్తించబడినవి. మన దేశంలో అనేక అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జంతు నిల్వల అడవులు ఉన్నాయి. టైగర్‌ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా 21 టైగర్‌ రిజర్వులు నిర్వహించబడుతున్నాయి. అతి పెద్ద జీవ వైవిధ్యం కలిగిన 12 దేశాలలో భారత్‌ ఒకటిగా పేరు తెచ్చుకుంది. మన దేశంలోని ఈస్టర్న్ హిమాలయాలు మరియు వెస్టర్న్ ఘాట్స్ అంతర్భాగంలో ప్రపంచపు 20 శాతం జంతుజాలం ఉంది. ఇండియాలో 3.64 శాతం భారత భూభాగంలో 1.2 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో 553 అభయారణ్యాలు ఉన్నాయి.

వన్యప్రాణి పరిరక్షణ చర్యలు:
స్వార్థపూరిత మానవుడు వన్యప్రాణుల అక్రమ వ్యాపారం పేరుతో పలు రకాలైన క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, చేపలను వేటాడుతూ, జీవ వైవిధ్యానికి ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాడు. జీవ సమతుల్యతకు, పర్యావరణ పరిరక్షణకు, ఆహార చక్ర గమనానికి, జీవ వైవిధ్య పరిపుష్టికి, వృక్షరాజ్య విస్తరణకు, పర్యావరణ శుద్ధికి, వన్య జంతువు సంతాన స్థిరాభివృద్ధికి, పలు రకాలైన కాలుష్యాల కట్టడికి, వృక్షజంతుజాలల వైవిధ్యానికి కాపాడటానికి, పర్యాటకరంగ అభివృద్ధికి, క్రీడలు(ఫిషింగ్‌, వేట) పరిశోధనలు మెుదలగు అంశాలకు వన్యప్రాణుల సంరక్షణ అత్యంత అవసరమని గమనించాలి. వన్యప్రాణుల పరిరక్షణతో పలు అటవీ ఉత్పత్తులైన ఔషధాలు, తేనె, పట్టు, వెంట్రుకలు, ఈకలు, తోలు, చర్మాలు, దంతాలు (చనిపోయిన తరువాత) వంటివి లభిస్తాయి. వన్యప్రాణుల నుండి వంట చెరుకు, కలప, పండ్లు, కాయలు, పువ్వులు, జిగురు లాంటి ఉత్పత్తులు కూడా ప్రత్యేక్షంగా లభిస్తాయి. మన సంస్కృతితో భాగంగా ఏనుగు శిక్ష రస్సుగల గణపతి వెంట ఎలుక, దుర్గమాత వెంట పులి, సరస్వతి వెంట నెమలి, శ్రీరాముని వెంట వానరులు మరియు ధైర్యసాహసాలకు ప్రతీకగా సింహం, శివుని మెుడలో నాగుపాము వంటి జంతువుల సాహచర్యంతో వన్యప్రాణి ప్రాముఖ్యతలను ఆధ్యాత్మిక పాఠంగా బోధిస్తున్నాయి.

ప్రమాదంలో వన్యప్రాణుల మనుగడ:
వన్యప్రాణులతో మానవాళికి ప్రాణభయం, వాహనాల ధ్వంసం, సాధుజంతులపై దాడి, పంటచేను విధ్వంసం, క్రిమికీటకాలతో పంట తెగుళ్ళు వంటి నష్టాలు కూడా ఉన్నాయి. అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలు (అడవులు కాలిపోవడం, భూకంపాలు, వరదలు, తీవ్ర కరువు లాంటి), పారిశ్రామికీకరణ, డ్యాముల నిర్మాణం, రోడ్లు వేయడం, రైలు మార్గాలు, జలాశయాల రూపకల్పన, అక్రమ సంపాదనకు జంతు వేట, అటవీ సంపద దుర్వినియోగం, పర్యావరణ కాలుష్యం, భూతాపం, ఓజోన్‌ పొర పలుచబడడం లాంటి కారణాలతో అటవీ జంతుజాలానికి ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణ జాతులు, విపత్తులో ఉన్న జాతులు, హానికర స్థితిలో ఉన్న జాతులు, అరుదైన జాతులు, అంతరించి పోయిన జాతులు వంటి పలు రకాలైన వన్యప్రాణులు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నాయి. అంతరించి పోయిన వర్గంలో తెలుపు హెరోన్‌, స్యాండ్‌పైపర్‌, సైబేరియన్‌ క్రేన్‌, తెలుపు వల్చర్‌, సాఫిష్‌, రెడ్‌ టర్టిల్‌, రాక్‌ ర్యాట్‌, పాండిచ్చెరి షార్క్, రీనోసీరోస్‌, చేపలు తినే మెుసళ్ళు మెుదలగు పలు జీవజాతులు ఉన్నాయి.

భారత్‌లో అభయారణ్యాలు/ఉద్యానవనాలు:
వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవనాలలో ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పులుల రక్షణ పార్క్, యూపీలోని దుద్వా కోతుల పార్క్, గుజరాత్‌లోని సింహాల ఘిర్‌ పార్క్, యంపీలోని కన్హా జింకల పార్కులు, శివపురి వోల్వ్ పార్కులు, ఒడిసాలోని సిమిలిపాల్‌ పులుల పార్క్, సుందర్‌భన్‌, మానస్‌ లాంటి అనేక జాతీయ ఉద్యానవనాలు జీన వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. వీటితో పాటు మన దేశంలో వన్యప్రాణి అభయారణ్యాలుగా డచిగమ్‌(జమ్ము-కాశ్మీర్‌), రాజాజీ (ఉత్తరాఖండ్),బన్‌బాస (అస్సాం), రాథంబోర్‌ మరియు సరిస్కా(రాజస్థాన్‌), కవల్‌(మహారాష్ట్ర), చండకా(ఒడిసా), పోచారం- ఏటూర్‌నాగారం(తెలంగాణ), బండీపూర్‌( కర్నాటక), గిండీ మరియు మధుమలై(తమిళనాడు), పెరియర్‌ (కేరళ) వంటివి పేరొందినవి. భారత్‌లో పులులు‌, ఏనుగులు‌, తాబేళ్ళు మరియు మెుసళ్ళను కాపాడేందుకు అటవీ ప్రాజెక్టులు ఉన్నాయి.

అంతరించే జంతుజాతులను రక్షించలేమా..!
అంతరించే ప్రమాదంలో ఉన్న జంతువుల ఆవాసాలను కాపాడడం, అక్రమ వేటను అరికట్టడం, పోడు వ్యవసాయానికి ప్రత్యామ్నాయాలు వెదకడం, జాతీయ ఉద్యానవనాల ఏర్పాటు, అభయారణ్యాల నిర్వహణ, ఫారెస్ట్ రిజర్వుల అజామాయిషీ, అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయడం, అక్రమ అడవుల నరికివేతను అడ్డుకోవడం, అడవుల్లో మానవ రవాణ వ్యవస్థలను చేపట్టకపోవడం, విపత్తులో ఉన్న జీవ జాతుల పునరుత్పత్తికి చర్యలు తీసుకోవడం, అడవుల్లో పెద్ద ఎత్తున మెుక్కలు నాటడం లాంటి చర్యలు చేపట్టడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు బీజాలు పడతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 37,000 జంతు వృక్ష జాతులను రక్షించే పటిష్ట చర్యలు తీసుకోవడం ముదావహం.
వనానికి అందాన్నిచ్చే దట్టమైన వృక్షాలు, అనేక రకాల జంతు జాతులు సకల మానవాళికి జీవవైవిధ్యం కల్పిస్తూ అపూర్వ సేవలు అందిస్తున్నాయి. జీవవైవిధ్యానికి విఘాతం కలిగితే కరోనా లాంటి విశ్వ మహమ్మారులు విజృంభిస్తాయని మన ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు తెలుపుతున్నాయి. భూమిని నివాసయోగ్యం గ్రహంగా కాపాడుకున్నపుడే భవిష్యత్‌ తరాలు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యకర వాతావరణంలో నివసించగలుగుతారు. జీవకోటి సమతుల్యత కోసం వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తించాలి.

             డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
                      9949700037
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News