మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మహానంది క్షేత్రంలో ఈనెల 6 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పర్శ దర్శనాలతో పాటు 6 వతేదీ నుండి 11వ తేదీ వరకు క్షేత్రంలోని రుద్రగుండం కోనేరులో పుణ్యస్నానాలు అనుమతి లేదని, బయట ఉన్న రెండు చిన్న కోనేరులలో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర పరిధిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను ప్రత్యేక టికెట్ కౌంటర్లు, క్యూలైన్లను సిద్ధం చేసినట్టు తెలిపారు.
క్యూలైన్లలో భక్తులకు కావాల్సిన త్రాగునీరు , బిస్కెట్ లను దాతల సహకారంతో అందించనున్నట్లు తెలిపారు. భక్తులు వాహనాలు నిలుపు స్థలాల్లో, ప్రధాన కూడళ్లలో భక్తులకు అవసరమగు త్రాగునీటితో పాటు మజ్జిగ కూడా దాతల సహకారంతో వితరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. 8 వతేదీ రాత్రి మహా లింగోద్భవం సందర్భంగా ప్రతి భక్తుడికి లింగోద్భవ కాల మహా రుద్రాభిషేకం తిలకించే భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అదే రోజు భక్తుల కాలక్షేపం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, చెక్కభజన, తోలుబొమ్మలాట తదితర సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లింగోద్భవ కార్యక్రమం అనంతరం 9వ తేదీ తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రథోత్సవం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్, రెవిన్యూ, దేవస్థానం ఇతర శాఖల సమన్వయంతో దిగ్విజయంగా పూర్తి చేయడానికి సిద్ధం చేసినట్టు తెలిపారు.