ఒక ప్రసిద్ధ తెలుగు నటుడిగానే కాదు, రచనా వ్యాసంగంలోనూ పత్రికా రచనలోనూ, వ్యాఖ్యాత గానూ తన ప్రత్యేకతను నిరూపించుకున్న విలక్షణ సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు. ఆయన ఏ సినిమాకైనా, నాటకానికైనా, కథకైనా స్క్రిప్టును రాశారంటే దానికి తిరుగుండేది కాదు. 1939 ఏప్రిల్ 16న విజయనగరంలో పుట్టి పెరిగి 2019 డిసెంబర్‌లో చెన్నైలో తుది శ్వాస వదిలిన గొల్లపూడి దాదాపు అయిదు దశాబ్దాల పాటు సాహితీ రంగాన్ని ఒక ఊపు ఊపారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. తెలుగు సాహిత్య రంగంలో తన నవలలు, కథలతో సంచలనాలు సృష్టించడంతో పాటు చలన చిత్ర రంగంలో కూడా తన స్క్రిప్టులతో ఒక కొత్త ఒరవడిని తీసుకు వచ్చారాయన. తెలుగు దిన పత్రిక ‘ఆంధ్రప్రభ’లో ఉప సంపాదకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన గొల్లపూడి వార్తలతో పాటు తన ప్రత్యేక వ్యాసాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఆకాశవాణిలో చేరిన గొల్లపూడి అందులో అనేక నాటకాలకు స్క్రిప్టును తయారుచేసి, స్వయంగా నాటకాలు రాసి, ప్రదర్శించి, పాల్గొని అతి చిన్న వయసులోనే ఎనలేని కీర్తి ప్రతిష్ఠల్ని మూటగట్టుకున్నారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, చెన్నై, సంబల్పూర్, నాగపూర్, కడప కేంద్రాలలో పని చేస్తూనే ఆయన అనేక నాటకాలు రచించి, ప్రదర్శించడం జరిగింది. పత్రికల్లో ఉన్నా, ఆకాశవాణిలో పనిచేస్తున్నా తన ప్రత్యేక వ్యాసాలతో, కథలు, నాటకాలతో ఆయన జనాదరణ పొందుతూనే ఉండేవారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనలోని సృజనాత్మకత బయటకు వెల్లడవుతూనే ఉండేది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డాక్టర్ చక్రవర్తి అనే సినిమాకు సంభాషణలు రాసింది గొల్లపూడే. ఆ తర్వాత అనేక సినిమాలకు సంభాషణలు, ఇతివృత్తాలు, కథలు రాసిన గొల్ల పూడి, స్వయంగా కూడా నటించడం ప్రారంభించారు. ఆయన తన జీవిత కాలంలో సుమారు 250 తెలుగు సినిమాల్లో నటించడం జరిగింది. చలన చిత్ర రంగంతోనూ, సాహితీ రంగంతోనూ తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆయన రాసిన ‘అమ్మ కడుపు చల్లగా’ అనే గ్రంథంలో ఆయన సృజనాత్మకత, వ్యక్తిత్వానికి సంబంధించి మరెన్నో కోణాలను స్పృశించడం జరిగింది. ఆయన తన జీవితంలోని అనుభవాలు, జ్ఞాపకాలు, ఇతర ఘట్టాలను ఈ గ్రంథంలో నెమరువేసుకోవడం జరిగింది.
సాహితీ రంగంలో ఆ గ్రంథం చెరగని ముద్ర వేసింది. ప్రేమ పుస్తకం పేరుతో నిర్మిస్తున్న ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూ ప్రమాద వశాత్తూ మరణించిన తన చిన్న కుమారుడు శ్రీనివాస్ పేరున ఆయన ప్రతి ఏటా ఉత్తమ చలన చిత్రానికి పురస్కారం అందజేస్తూ ఉండేవారు. ఆయన అనేక నాటకాలు రాశారు. 1961లో చైనా యుద్ధం తర్వాత ఆయన రాసిన ‘వందే మాతరం’ అనే నాటకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన ఆ నాటకాన్ని చిత్తూరు, నగరి, మదనపల్లె వంటి ప్రాంతాల్లో ప్రదర్శించి, దాని వల్ల వసూలయిన 50,000 రూపాయల సొమ్మును ప్రధాని సహాయ నిధికి ఇచ్చేయడం జరిగింది.
ఈ నాటకానికి అప్పటి విదేశాంగ మంత్రి పి.వి. నరసింహారావు ముందు మాట రాశారు. 1959లో ఆయన తాను రాసిన రాగరాగిణి నాటకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు ప్రదర్శించారు. ఆయన రాసిన ‘సాయంకాలమైంది’ నవలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఈ గ్రంథాన్ని తమిళం, కన్నడ భాషల్లోకి అనువాదం చేశారు. ఆయన ఏది రాసినా పాఠకాదరణ పొందేది. ఈ నాటకం రాసినా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఏ ప్రసంగం చేసినా హర్ష ధ్వానాలు మిన్ను ముట్టేవి. అనేక సంవత్సరాల పాటు విశాఖపట్నంలో నివసించిన గొల్లపూడి మారుతీ రావు, తన కుటుంబంతో వచ్చి చెన్నైలో స్థిరపడడం జరిగింది. కన్నుమూసే వరకు రచనా వ్యాసాంగంలోనే గడిపిన మారుతీరావు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, తమిళనాడులో సైతం ఒక సంచలన రచయితగా, ఒక విలక్షణ సాహితీవేత్తగా చిరస్మరణీయుడయ్యారు.
Sahithi Vanam: సాహితీ కిరీటంలో కలికితురాయి గొల్లపూడి
ఏది రాసినా పాఠకాదరణ పొందేది