బెంగళూరు బ్రూక్ ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగి రెండు రోజులు కావస్తున్నప్పటికీ ఈ పేలుడు పదార్థాలను లేదా పరికరాలను ఉంచిన వ్యక్తి ఎవరనేది ఇంత వరకూ తెలియలేదు. ఎవరు ఎందుకు చేశారనేది వెల్లడి కాకపోయినా, రకరకాల ఊహా గానాలు మాత్రం రెక్కలు విప్పు కున్నాయి. ఇది తీవ్రస్థాయి పేలుడుగానే కనిపిస్తోంది. జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతంలో జరిగింది కాబట్టి, దీని ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటనలో మొత్తం పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలయ్యారు. ఇందులో ఒక వ్యక్తికి శరీరం చాలా భాగం కాలి పోయింది. ఒక వ్యక్తికి కన్నుపోయింది. అన్నిటికన్నా మించి దేశంలోనే అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరున్న బెంగళూరులో ప్రశాంతత పూర్తిగా దెబ్బతింది. జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాల్లో పేలుడు పరికరాన్ని అమర్చడం వెనుక దుండగుల ఉద్దేశం ఏమిటన్నది అర్థమైపోతూనే ఉంది. మొదట్లో ఈ దుర్ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందనో, వ్యాపార కక్షల వల్ల జరిగిందనో భావించారు. కొద్దిపాటి దర్యాప్తు అనంతరం దుండగుల అసలు ఉద్దేశం అర్థమైపోయింది.
ఈ పేలుడుకూ, 2022లో మంగళూరులో జరిగిన కుక్కర్ పేలుడుకూ సంబంధం ఉందని నగర పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుడు ఉపయోగించిన పేలుడు పరికరాన్ని, పేలుడు పదార్థాన్ని, టైమర్ నే ఇప్పుడు కూడా ఉపయోగించడం జరిగింది. మంగళూరు శివార్లలో కుక్కర్ బాంబు ప్రమాదవశాత్తూ పేలడం జరిగింది. బెంగళూరు ఘటన తర్వాత రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోయంబత్తూరు పేలుళ్లకు, బెంగళూరు, మంగళూరు పేలుళ్లకు సంబంధం ఉందని, పేలుడు జరిగిన తీరును బట్టి ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్) వ్యవహారంగా కనిపిస్తోందని వెల్లడించింది. నగర పోలీసులు మాత్రం ఇది ఐ.ఎస్ వ్యవహారమన్న అభిప్రాయానికి రాలేమని, తాము అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరులో పేలుడు జరిపిన తర్వాత ప్రధాన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని, అనుమానం మీద కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నామని కూడా పోలీసులు తెలియజేశారు.
సాధారణంగా ఇటువంటి సంఘటనల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానాలే నిజం అవుతుంటాయి. ఈ సంస్థలో దర్యాప్తు చేసే నిపుణులు ఇటువంటి విషయాల్లో ఆరితేరినవారే అవుతారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన వ్యక్తిని కడపలో అరెస్టు చేసినట్టు, అతని విచారిస్తున్నట్టు వార్తలు బయటికి వచ్చాయి. అతను పి.ఎఫ్.ఐకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని, పి.ఎఫ్.ఐకి, ఐ.ఎస్ కి సన్నిహిత సంబంధాలున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ సంఘటనకు ఐ.ఎస్ తో సంబంధం ఉందని వెల్లడించడం గమనించాల్సిన విషయం.
నిజానికి, ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండానే అనుమానించడం, అతిగా ఊహించడం సమంజసం కాదు. ఊహాగానాల వల్ల ప్రజల మనసుల్లో లేనిపోని భయాందోళనలు ప్రారంభం కావడం మినహా మరే ఉపయోగమూ ఉండదు. బయటికి వెళ్లడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడకూడదు. పోలీసులు కూడా ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి భయమూ లేదని ధైర్యమివ్వాలి. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతి త్వరలో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలపై ఒక కన్ను వేసి ఉండడం మంచిది. దీన్ని రాజకీయం చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని ఎవరు రాజకీయం చేసినా, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. నిజ నిర్ధారణ జరిగే వరకూ దీన్ని దర్యాప్తు సంస్థలకు వదిలేయడం మంచిది.
Bangalore blast: బెంగళూరు ఘటనలో ప్రమాద సంకేతాలు
రామేశ్వరం కెఫే పేలుళ్ల వెనుక ఐఎస్?