దాయాది దేశం చితికిపోయింది. ఆర్థికంగా బక్క చిక్కిపోయిన పాకిస్థాన్ కు అప్పులు పుట్టక, సాయం అందక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో దిగజారి పోయింది. ఓవైపు పాకిస్థాన్ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే మరోవైపు డబ్బున్నవారు దేశం విడిచి విదేశాలకు పారిపోతున్నారు. ఇదంతా చాలదన్నట్టు ప్రకృతి విలయతాండవం చేస్తోంది. మూడొంతుల పాక్ భూభాగంలో వరదలు ముంచెత్తాయి.
ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా చిక్కుకున్న పాక్ కు కనీసం ఆహార ధాన్యాల సాయం చేసేందుకు కూడా ప్రపంచ దేశాలు ముందుకు రావటం లేదు. పెషావర్ మసీదులో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడి వంటి మిలిటెన్సీ చర్యలు వికృత రూపం దాల్చుతుంటే శాంతి భద్రతలు పునరుద్ధరించ లేని అధ్వాన్న స్థితిలో పాక్ సర్కారు చేష్టలుడికి కూర్చుంది.
పాక్ పార్టీలన్నీ పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకోవటంలో పూర్తిగా నిమగ్నమవ్వగా, వచ్చే అక్టోబర్ లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఆకలితో అల్లాడుతున్న పాక్ కు సాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు ఈరోజు పాక్ లో ఐఎంఎఫ్ బృందం పర్యటించనుంది. పాక్ లో ప్రస్తుతం అచ్చు శ్రీలంక పరిస్థితులే నెలకొన్నాయి.
విదేశీ మారక నిల్వలు కేవలం అడుగంటి.. 3.7 బిలియన్ల డాలర్లు మాత్రమే ఉండగా కేవలం 3 వారాలపాటు దిగుమతులకు మాత్రమే ఇవి సరిపోతాయని పాక్ గగ్గోలు పెడుతోంది. ఆకలి కేకలు వేస్తున్న జనానికి ఉపాధి పనులు లేక రోడ్డున పడ్డారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి దేశమంతా చీకట్లో మగ్గుతోంది.