ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని, ఇచ్చిన హామీలలో నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క )అన్నారు. జిల్లా కేంద్రంలోని సఫాయివాడలో అర్హులైన గృహ జ్యోతి లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్లులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల వరకు పెరిగిందని అన్నారు. మరో రెండు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని 200 యూనిట్ల వరకు గృహ వినియోగానికి ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలును ప్రారంభించామని వివరించారు. గత ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక విధానం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని, దానిని సరిచేస్తూ ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చుర్, డి ఈ నాగేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.