భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో ప్రఖ్యాతి గాంచిన అతి పురాతనమైన సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ నల్ల వీరభద్రేశ్వర స్వామి, శివాలయం దేవాలయం శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ దేవాలయంలో శివాలయం, వీరభద్రుడు కొలువు ఉండడం విశేషం. అలాగే ఇక్కడ ద్విలింగాలు ద్వినందులు కలిగి ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత.
భారీగా అన్న ప్రసాద వితరణ
గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని గత 15 సంవత్సరాలుగా 101 యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజున గ్రామంలోని ప్రజలు తమ ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ముఖ్యంగా శివరాత్రి తరువాత రోజున నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
ద్విలింగాలు, ద్వినందులు ఒకే చోట
ఈ దేవాలయం ఎంతో ప్రత్యేకమైనదని ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయంలో ద్విలింగాలు, ద్వినందులు కొలువై ఉన్నారని ప్రభుత్వం వారు చొరవ చూపి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని 101 యువజన సంఘం అధ్యక్షుడు వంగూరి బాలకృష్ణ తెలిపారు.