నేర్పుకు, ఓదార్పుకు అమ్మగా, అలిగా, అక్కగా, చెల్లి గా ఆత్మీయత అనురాగాన్ని పంచే అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయతను పంచే ఓ మహిళా మూర్తి నీకు వందనం మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం… అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇది నిజంగా వేడు కలు చేసుకునే రోజా..? లేక నిరసన తెలిపే రోజా..? అంతర్జాతీయ మహిళా దినోత్సవం లాగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉందా! దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రచంపవ్యాప్తంగా ప్రజలు మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజును గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది దీనిని ఐక్యరాజ్యసమితి గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తుంది దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15000 మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను ఆలోచనను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909 వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్‌కి అనే ఒక మహిళది. కోపెన్ హోగేన్ నగరంలో 1910లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరు కాబడిన 100 మంది మహిళలు క్లారా జెట్ కి ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ దేశాల్లో నిర్వహించారు 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. స్త్రీ ప్రాముఖ్యతను ఒకసారి మరోసారి తెలుసుకుందాం. స్త్రీ లేనిదే మానవ జన్మ లేదు. ఇది సత్యం అయిన నానుడి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి మనిషికి ఎల్లవేళలా ఒక స్త్రీ తోడుగా ఉంటుంది. అది దేవాలయంలో రాముడికి సీత, కృష్ణుడికి రాధ, శంకరుడికి పార్వతి, మంత్ర పఠనంలో కానివ్వండి గాయత్రీ మాతను, గ్రంథ పఠనంలో గీత, ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయం అయితే ఉష, సాయంత్రమైతే సంధ్య, రాత్రి మత్తులో నిషా, కలలో స్వప్నం నిత్య జీవితంలో చేసే పనిలో శ్రద్ధ, చూసి చూపులలో నయన వినేటప్పుడు శ్రావణి, మాట్లాడుతున్నప్పుడు వాణి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి మరెన్నో ఉన్నాయి.
స్త్రీ తన జననం ఒక చోట.. తన మరణం మరో చోట ‘భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టు కుని ఆలోచిస్తే స్త్రీ తన బాల్యం నుండి వివాహం వరకు ఒకచోట, వివాహం తర్వాత నుండి మరోచోట తన జీవిత ప్రస్థానం కొనసాగుతున్న కథనం మనకు తెలిసినదే.. ఒక్కసారిగా తను పుట్టిపెరిగిన ప్రాంతం నుండి వివాహం అనే అనుబంధం ద్వారా మరో ప్రాంతంలో తన జీవన గమనం కొనసాగుతుంది. పుట్టింటి నుంచి మెట్టినింట్లో తన కొత్త జీవితాన్ని మళ్లీ మొదటి నుండి ప్రారంభం చేస్తుంది. ఇంతటి మార్పును ఎదిరిస్తూ కూడా మరో ప్రక్క సమాజంలో కొన్ని దుశ్చర్యలు అయినటువంటి టీజింగ్, గృహ హింస, వరకట్న వేధింపులు, విడాకులు, కుటుంబ బాధ్యతలు అంటూ రకరకాల సమస్యలను నేటికీ ఎదుర్కొంటుంది. నేటికీ స్త్రీ అణచివేయబడతుంది. మరెన్నో సంఘటనలు మనం పత్రికలలో సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూనే ఉన్నాము. దీనికి కావలసిన మార్పు సమాజం నుండి రావాల్సిందే.
స్త్రీలు ఎదుర్కొంటున్న అత్యాచారాలను నిర్మూలించాలంటే నా చర్యకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా పబ్లిక్ గా నిందితులను శిక్షిస్తే బాధితులకు కొంతవరకు ఉపశమనం జరుగుతుందని చెప్పవచ్చు. ఒక ఆడపిల్ల మాయమైనపుడు విదేశాల్లో మాదిరిగా పోలీసు వ్యవస్థతో పాటు ఇతర కొన్ని గ్రూపులు సంఘటన జరిగినప్పుడు ముంద డుగు వేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుండి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మరో విషయం ఏమిటంటే మనదేశంలో సెక్స్ అంటే పిల్లలకు చిన్నప్పటి నుండే ఒక నిషిద్ధ భావాన్ని ఏర్పాటు చేసి దూరం పెడుతున్నాము. ఎప్పుడైనా ఏదైనా నిషేధం అన్నా నిషిద్ధం అన్నా తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఎవరిలోనైనా, ఎవరికైనా పెరుగుతుంది. అందుచేత వాళ్ళు నేడు అంతర్జాలంలో సామాజిక మాధ్యమాలలో సెక్స్‌కు సంబంధించిన వీడియోలు చూసి ప్రేరేపితమై ఎన్నో దురాగతాలకు పాల్పడుతున్నారు.. ఈ విషయమై ఇప్పుడిప్పుడే సమాజం మార్పు కోసం పరిణితి చెందుతున్నారు.
విదేశాల్లో అక్కడి సంస్కృతి కారణంగా చిన్న చిన్న దుస్తులు వేసుకుని మహిళలు బహిరంగంగా తిరిగినప్పటికీ కూడా పురుషులు కనీసం చూడకపోవడం గమనార్హం. కానీ మన దేశంలో నిండైన దుస్తులు వేషధారణతో ఉన్నప్పటికీ ఇంకా ఏ చోటునుండి ఏం కనబడుతుందో అని చూసే సమాజం మనకు తారసపడుతుంది.
ఒక దిశ, నిర్భయ లాంటి సంఘటనలు జరిగిన కొద్ది కాలానికే మళ్లీ అక్కడక్కడా వింటూనే ఉంటాం. దీనికి శాశ్వత పరిష్కారం జరగాలంటే చట్ట పరమైన మార్పులు ఎంతైనా అవసరం. ప్రతి మానవతా మనుగడకు స్త్రీ యొక్క పాత్ర ఎంతనో ఆ స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు నేటి ప్రపంచంలో అన్ని ఉన్నాయి… అని చెప్పడానికి ఇవే ప్రత్యక్ష సాక్ష్యాలు. నేటికీ సమాజంలో బయటకు వెళ్లి రావాలంటే రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నేటికీ అణిచి వేయబడుతుంది. కుల మత వర్ణ లింగ విచక్షణ లేకుండా మన భారత ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ అర్ధరాత్రి ఒంటరిగా ఒక స్త్రీ పూర్తిస్థాయిలో మనో నిబ్బరంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం. మనం సొంతం చేసుకున్నట్లు అని మహాత్మా గాంధీ చెప్పిన విషయం విదితమే.. కానీ ఎంత వరకు దాన్ని సాధించుకున్నాం అనేది మనకు తెలుస్తూనే ఉన్నది. ఒకవైపు పర్సనాలిటీ మోటివేషన్ కౌన్సిలింగ్ సెంటర్లు, మరోవైపు మహిళా సంఘములు, అంటూ ఎన్నో రకముల కొత్త కొత్త విషయాలతో, సూచనలతో వేదికలు ఏర్పడుచున్నవి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారం జరగటం లేదు.
సమాజంలో ప్రతి వ్యక్తి, ప్రతి యువత తన బాధ్యతగా స్త్రీని గౌరవించబడటం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. నేటి కాలంలో యాంత్రిక ప్రపంచం అయినప్పటికీ స్త్రీని గౌరవించబడుతున్నప్పటికీ అనేక మంది దుండగులు యాసిడ్ దాడులతో, ఇతర రకాల దాడులతో చర్యలకు పాల్పడుతున్నారు. ఇంకా సమాజంలో స్త్రీపై ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ పదిమందికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి యువత అందులో ఈ సమస్య పరిష్కార దిశలో భాగం కావాలి.
ఆత్మవిశ్వాసం విషయంలో పరిశీలిస్తే.. ముఖ్యంగా స్త్రీ తను పూర్తిస్థాయిలో స్థిరపడిన తరువాతనే అంటే ఆర్థికంగా తన కాళ్ళపై తాను బ్రతక గలిగే నమ్మకం వచ్చినప్పుడే… పెళ్లి అనే అనుబంధానికి చేరువ కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నేటి కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని విభాగాలలో తన విధి నిర్వహణలు చేస్తున్నారు. దీనికి అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలంటే పేద తరగతి స్త్రీ కుటుంబంలో తన పాత్ర అ నిర్వచనీయం.. నేటికీ కొన్ని సామాజిక వర్గాలలో స్త్రీని వంటింటికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఈ విషయంలో సమాజం ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇంకా చెప్పాలంటే వరకట్న దురాచారం ఇంకా పూర్తి స్థాయిలో పోలేదు. కొందరు ఉన్నత వర్గం చెందిన వారు తమ హోదాకు తగ్గట్టుగా కట్నాన్ని ఇచ్చుకుని తన హోదా అని చెప్పుకుంటున్నారు, మరికొందరు ఆర్థిక కారణాలతో తమకు తగిన వివాహ సంబంధాన్ని కుదుర్చుకొని పెళ్లి అనే అనుబంధంతో స్త్రీ కట్టుదిట్టంలో పడిపోతుంది. దీనికి ప్రధాన కారణం సమాజంలో ఇంకా వరకట్న దురాచారం రూపుమాపు లేదు. మరికొన్ని వివాహ సంబంధాలు చూసే సంస్థలు అనగా మ్యారేజి బ్యూరోలు కానివ్వండి.. మ్యాట్రిమోనీలు కానివ్వండి ఆర్థిక స్తోమతను బట్టి వివాహ సంబంధాలు చూస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు. అధి కారికంగా బయటకు చెప్పకపోయినా అనధికారికంగా ఇలాంటి తంతులు జరుగుతున్నాయి. ఈ విషయమై మేలుకోవలసింది మన సమాజమే, మార్పు చెందాల్సింది సమాజమే..
ఇంకా మరికొన్ని కుటుంబాలలో కొడుకుని చదివించిన విధంగా, కూతుర్ని చదివించ లేకపోవడం గమనార్హం వీటికి ఉదాహరణ కళ్లకు కట్టినట్లుగా ఎన్నో సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లు కూడా మన ముందు దర్శనమిస్తున్నాయి. ఈ విషయమై కూడా తమకు తామే పరిణతి చెందాల్సిన అవసరం ఉన్నది.
కొందరు బిడ్డ కడుపులో ఉండగానే అబార్షన్ల పేరిట తుంచివేస్తున్నారు. స్త్రీ యొక్క పాత్రలు చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా స్త్రీ పాత్ర మరువలేనిది. మన భారతదేశ సంస్కృతిలో చరిత్ర పుటలు తిరగేస్తే స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం కలిగినది.
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్
ప్రముఖ రచయిత/ విమర్శకులు
- 9490841284