వయసుపైబడిన వారికి తేనె ఇచ్చే అందం చాలా ఎక్కువ. చర్మాన్ని కాంతులీనేలా చేయడం దగ్గరి నుంచి వయసుపైబడిన వారి ముఖాలలో ముసలితనం ఛాయలు కనిపించకుండా చేయడంలో కూడా శక్తివంతమైన బ్యూటీ సాధనంగా తేనె పనిచేస్తుంది. ఇది అందరి వంటిళ్లల్లో అందుబాటులో ఉండే వస్తువు కూడా. తేనె సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. వయసు పైబడిన వాళ్లు తమ చర్మ సంరక్షణకు దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. తేనెలో ప్రక్రుతి సిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణం ఉంది. చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా తేనె అడ్డుకోవడమే కాదు ఇన్ఫెక్షన్ల బారిన పడినవారికి మంచి నివారణా సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. వయసు పెరుగుతున్న వాళ్లకి ఇది మంచి సౌందర్య సాధనం. చర్మానికి అతుక్కుపోయేలా చిక్కగా ఇది ఉంటుంది కాబట్టి స్నానం చేయడానికి కొన్ని గంటల ముందు ముడితేనెను ముఖానికి రాసుకోవాలి. చర్మంపై నూనె ఎక్కువగా చేరుతుంటుంది కాబట్టి ముఖానికి తేనె పట్టించి కాసేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల తేనెలోని యాంటి సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలతో చర్మం మంచి మెరుపును సంతరించుకుంటుంది.
చర్మ సంరక్షణకు, అందానికి అనుసరించే పలు స్కిన్ కేర్ రొటీన్లలో కూడా తేనె ముఖ్య పాత్ర వహిస్తోంది. ఇది మంచి ఎక్స్పొయిలేటర్. పెదాలపై నుండే చర్మం మ్రుదువుగా ఉండేందుకు తేనెను వాడతారు. చర్మంపై ఉన్న మ్రుతకణాలను కూడా ఇది పోగొడుతుంది. దీంతో చర్మం లోని డల్ నెస్ పోతుంది. మనుకా తేనె లేదా ముడి తేనెను ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం సున్నితంగా, కాంతివంతంగా ఉంటుంది. యాక్నేను కూడా తేనె పోగొడుతుంది. చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా అడ్డుకుంటుంది. తేనెతో యాంటి ఏజింగ్ ఫేస్ మాస్కులను ఇంట్లో చేసుకోవచ్చు.
టేబుల్ స్పూన్ తేనెలో అంతే పరిమాణంలో బొప్పాయి గుజ్జు, పెరుగు, పాలు వేసి కలిపి పేస్టులా చేయాలి. ఆ ఫేస్ మాస్కును ముఖానికి రాసుకుని అరగంట అలాగే ఉంచుకోవాలి. దీన్ని ముఖంపై మసాజ్ చేసుకున్నట్టు రాయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం బిగువుగా తయారవుతుంది. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని మెత్తటి గుడ్డతో ముఖాన్ని సున్నితంగా ఒత్తుతూ తుడుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా కనిపించడంతోపాటు చర్మంపై ఉన్న ముడతలు, గీతలు పోతాయి. ముఖం యంగ్ గా కనిపిస్తుంది. మరో హనీ ఫేస్ మాస్కు కూడా ఉంది.
స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో టేబుల్ స్పూన్ కోకో పొడి, టేబుల్ స్పూను తేనె వేసి కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకి ఆతర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా తయారవుతుంది. చర్మం పట్టులా మెరుస్తుండేందుకు ఫ్రోజెన్ ఫేషియల్ స్ర్కబ్ ను క్లీన్సర్ గా వాడాలి. కీరకాయను మెత్తగా చేసి అందులో నిమ్మరసం, ఒక టీస్పూను తేనె వేసి కలిపి దాన్ని ఐస్ ట్రేల్లో పోసి డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. అలా ఫ్రీజ్ అయిన ఐస్ ముక్కతో ముఖాన్ని ఐదు నుంచి పదినిమిషాలు బాగా రుద్దుకొన్నట్టు చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడుక్కోవాలి.
పొడి చర్మం ఉన్నవారు, దురదపెట్టే చర్మ ఉన్నవారు, పొడిచర్మం లేనివారికి కూడా ఉపయోగపడే తేనెతో చేసిన మరో ఫేస్ మాస్కు ఉంది. బాగా పండిన అరటిపండును తీసుకుని దాన్ని మెత్తగా చేయాలి. అందులో ఒక టీస్పూను శెనగపిండి, ఒక టీస్పూను తేనె వేసి కలిపి పేస్టులా చేసి గిన్నెలో కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని మెత్తటి గుడ్డతో ముఖాన్ని సున్నితంగా తుడుచుకోవాలి. ఈ మాస్కును వారానికి కనీసం రెండుసార్లు ముఖానికి పట్టించడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు మంచి మాయిశ్చరైజర్ లా చర్మంపై పనిచేస్తుంది.
చర్మం మరింత మెరిసేందుకు ఎండబెట్టిన యాపిల్ తొక్కలను గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక టీస్పూను తీసుకొని అందులో ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఫేస్ వాష్, గోరువెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడుక్కుని ఆ తర్వాత ఈ పేస్టును ముఖానికి రాసుకోవాలి. వారానికి ఒకసారి ఈ మాస్కును రాసుకోవడం వల్ల స్కిన్ టోన్ బాగా ఉంటుంది.
అలాగే చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొట్టడానికి ఎండిన కమలాపండు తొక్కలతో చేసిన పొడి ఒక టీస్పూను తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకున్న తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎలాంటి మలినాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.