రకరకాల వంటకాల్లో మనం వాడే మసాలా దినుసులు శీతాకాలంలో ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయట. నిత్యం మనం వాడే మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. యాలకుల్లోవిటమిన్ సి పుష్కలంగా ఉండడంతో శరీరంలో రోగనిరోధక శక్తిని ఇవి బాగా పెంపొందిస్తాయంటున్నారు పోషకాహారనిపుణులు. శీతాకాలంలో వీటి వినియోగం ఎంతో మంచిదని చెప్తున్నారు.
ఇవి జలుబును తగ్గిస్తాయి. జీర్ణక్రియ సరిగా జరిగేట్టు చేస్తాయి. శీతాకాలంలో అల్లం వాడకం ఆరోగ్యానికి ఇంకా మంచిదిట. వంటకాలకు అల్లం మంచి సువాసనలను చేర్చడమే కాదు గాస్ట్రోఇంటస్టైనల్ సమస్యలపై కూడా ఇది బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఎక్కువమంది ఎదుర్కొనే గొంతునొప్పిపై అల్లం బాగా పనిచేస్తుంది. అంతేకాదు వికారం లాంటి వాటిని తగ్గిస్తుంది.
మరో మసాలా దినుసు దాల్చిన చెక్క. శీతాకాలంలో కాఫీ నుంచి వంటకాల వరకూ అన్నింటిలో దీన్ని వాడొచ్చు. బ్లడ్ షుగర్ ను ఇది నియంత్రిస్తుంది. మసాలా దినుసైన పసుపును చలికాలంలో వాడడం వల్ల శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. కుంకుమపువ్వు వినియోగం కూడా శీతాకాలంలో ఎంతో మంచిది. ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి రక్షణకవచంలా పనిచేస్తుంది. మిరియాలు, లవంగాలనూ మనం రకరకాల వంటకాలల్లో వాడుతుంటాం. లవంగాల్లో యాంటాక్సిడెంట్లు బాగా ఉన్నాయి. చలికాలంలో మనల్ని వేధించే కీళ్లనొప్పులకు, జలుబు, దగ్గు వంటి సమస్యల నివారణకు లవంగాలు బాగా పనిచేస్తాయి.