మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వరస్వామి దర్శనానికి భక్తజనం పోటెత్తింది. ఆలయ గోపురం రంగురంగుల విద్యుత్ బల్బులతో దేదీప్యమానంగా భక్తులను ఆకట్టుకుంది తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఉదయం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు అభిషేకాలను జరిపించారు ఆలయ అధికారులు. 9 గంటల నుండి పాలాభిషేకం, 11 గంటలకు ఘనంగా రుద్రహోమం, మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామివారికి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్నాథ గట్టు పైకి జాగరణ కోసం వచ్చే భక్తులకు రాత్రి 8 గంటల నుండి కర్నూలు నాట్య వేద కూచిపూడి కళానిలయం, జ్ఞానపీఠం పాఠశాల, దేవస్థానం వారిచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించే లింగోద్భవ కార్యక్రమాన్ని, తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించే స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు కొండపైకి లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. ఇంతమంది భక్తులు ఒకేసారి కొండపైకి రావడంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసు వారు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ ప్రధాన అధికారి, కర్నూలు వైఎస్ఆర్సిపి అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ భాషా, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆయన సతీమణి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయ మనోహరి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు, పలువురు ఎమ్మార్వోలు, జిల్లా అధికారులు స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి నీరు, క్యూ లైన్లను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, అధికారులు ఏర్పాటు చేశారు. జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి ప్రెసిడెంట్ పి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు స్వామివారి లడ్డు ప్రసాదాలను పంపిణీ చేశారు.
మహాశివరాత్రి పర్వదినం రోజున జాగరణకు వచ్చిన లక్షలాదిమంది భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలానే దిన్నె దేవరపాడుకు చెందిన దాత, మాజీ కౌన్సిలర్ పెరుగు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేపట్టారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కొండపైకి వచ్చేందుకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తాలూకా సిఐ ఎం శ్రీధర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.