ఎమ్మిగనూరులో విషాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఎమ్మిగనూరు పట్టణం ఆదోనికి వెళ్ళే రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏడాది వయసు కలిగిన చిరుత పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పులి మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత పులి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోనికి తరలించారు.
ఈ సందర్భంగా అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తో పాటు తుగ్గలి,హొలగుంద, అస్పరి , ఆదోని , కోసిగిలలో గుట్టలు, కొండలు, అటవీ ప్రాంతం ఉంది. అక్కడ చిరుత పులులు సంచారం ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరికైనా చిరుత పులులు, కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే చిరుత పిల్లలు దొరికితే అడవిలో వదలాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతాలలో చిరుత పులుల సంచారంతో ప్రజలు ప్రాణ భయంతో జీవిస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.