Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్G 20: ప్రపంచ ఆదేశాలు తీసుకోవటం కాదు ప్రపంచాన్ని శాసించే స్టేజ్ లోకి భారత్ !

G 20: ప్రపంచ ఆదేశాలు తీసుకోవటం కాదు ప్రపంచాన్ని శాసించే స్టేజ్ లోకి భారత్ !

G 20

ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగిన జీ-20 అగ్ర నేతల సమావేశంలో ఆమోదించిన అజెండాను పరిశీలిస్తే, ఈ లక్ష్యాలను భారత్ చేరుకోగలుగుతుందా, భారత్ విజయం సాధించగలుగుతుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. వివిధ లక్ష్యాలకు సంబంధించి ఈ 20 దేశాల కూటమి తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే. అది ఒకరకంగా ఈ కూటమి సమావేశానికి ఘన విజయమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అసలు ఈ కూటమి సమావేశమే విఫలమవుతుందని అంతా భావించారు. వివిధ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులు, తదితర సమస్యలు విజృంభిస్తుండగా ఈ సమావేశం ఏవిధంగా తన లక్ష్యాలను రూపొందిస్తుంది? ఏవిధంగా వీటిని సాధిస్తుంది ? ఈ సమయంలో కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారు? అనే ఆందోళనకర ఆలోచనలు ప్రపంచ దేశాల బుర్రలను వేడెక్కించాయి. కనీవినీ ఎరుగని బహుకోణ సంక్షోభాలు ప్రపంచంలోని అనేక దేశాలను పట్టి పీడిస్తున్న సమయంలో తాము సమావేశమవుతున్న విషయాన్ని విస్మరించలేమని ఈ సమావేశంలో వక్తలంతా అంగీకరించారు. ఒకపక్క ఆర్థిక మాంద్యం చుట్టుముడుతోంది. మరొక పక్క అమెరికా వంటి అగ్రదేశాలతో సహా అనేక దేశాలలో పేదరికం కొత్త పుంతలు తొక్కుతోంది. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో అనేక దేశాలు విఫలం కావడం కూడా గమనించాల్సిన విషయమే.

- Advertisement -

ఉక్రెయిన్ సంక్షోభం

జీ-20 దేశాల సమావేశం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోకపోలేదు. అందుకనే దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని తన మొట్టమొదటి లక్ష్యంగా చేసుకుంది. బలహీన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలలో ఆహారోత్పత్తి, నాణ్యమైన ఎరువుల సరఫరా, ప్రతి ఒక్కరికీ ఇంధన భద్రత వంటివి సాధ్యమయ్యేలా చూడాలని ఈ కూటమి కంకణం కట్టుకుంది. వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడానికి కాలుష్యాన్ని నిర్మూలించాలని, పచ్చదనాన్ని విస్తరింపజేయాలని అది గట్టి నిర్ణయం తీసుకుంది. ఇందుకు గానూ ప్రప్రథమంగా వంద బిలియన్ డాలర్లను సమీకరించాలని కూడి నిర్ణయించింది. వర్ధమాన దేశాలు వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, మానవ నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు మరింతగా డిజిటలైజేషన్ ను విస్తరించాలని కూడా కూటమి సమావేశం భావించింది.

చివరగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ యుద్ధం మీద జీ-20 సమావేశ అభిప్రాయం కోసం ఇతర దేశాలు అనేకం చెవులు రిక్కించాయి. దీని స్పందన కోసం, అది సూచించే పరిష్కార మార్గం కోసం చివరి క్షణం వరకూ ఉత్కంఠగా ఎదురు చూశాయి. చివరగా ప్రస్తావించినా ఈ కీలక అంశానికి సమావేశం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, సుదీర్ఘంగా చర్చించింది. ఆఖరికి ఎంతో సమతూకంగా భారత్ చేసిన వ్యాఖ్య బాలీ శిఖరాగ్ర సమావేశ పరువును కాపాడింది. ఇక్కడే భారత్ లౌక్యం, దౌత్యనీతి ఎటువంటిదో వ్యక్తమయింది. “ఇది యుద్ధ శకం కాదు, ఇది అభివృద్ధి శకం, సహకార శకం” అంటూ భారత్ చేసిన వ్యాఖ్యలు ఉక్రెయిన్ యుద్ధంపై చర్చకు తెర తీసాయి. యుద్ధ విరమణ కోసం, ఉక్రెయిన్ లో శాంతి స్థాపన కోసం ఈ కూటమి విశేషంగా, ప్రత్యేకంగా అవిరళ కృషి జరపాలని తీర్మానం చేశాయి. ఇక్కడ శాంతి స్థాపనలో జాప్యం జరుగుతున్నకొద్దీ అనేక దేశాలు ప్రమాదంలోనూ, సంక్షోభంలోనూ పడిపోవటం జరుగుతుందని వివిధ దేశాలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశాయి.

ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ..”శాంతి భద్రత లేకుండా భావి తరాలు ఆర్థికాభివృద్ధి ఫలాలను, సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలను అనుభవించటం సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు. ఇప్పుడిక మోడీ రాజనీతిని, దౌత్య నీతిని ప్రపంచ దేశాలే కాదు, స్వదేశ ప్రజలు సైతం శ్రద్ధగా గమనిస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. విదేశీ విధానం విషయంలో మోడీ ఏమేరకు విజయం సాధిస్తారన్నది స్వదేశీయులు పరిశీలించటం, పరీక్షించడం ఖాయం. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ లో మోడీ జరుపబోయే రష్యా, ఉక్రెయిన్ పర్యటనలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News