దక్షిణాది రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో సంగమ నదీ తీరాన ప్రసిద్ది గాంచిన శైవ క్షేత్రం సంగమేశ్వరం. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుండి సంగమేశ్వర స్వామి గంగా జలముతో సంపూర్ణంగా నిండిపోయి.. జలదీక్షలో ఉంటున్నాడు సంగమేశ్వరుడు. గత నాలుగు సంవత్సరంల నుంచి తపస్సులో నిమగ్నం అవుతూ, భక్తులకు దర్శనం ఇవ్వకుండా ఇలా అంతర్ధానం అయి, తిరిగి మాఘమాస శుక్ల ఏకాదశి రోజున గంగా జలసమాధి నుంచి బయటికి వచ్చి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తున్నాడు ఇక్కడి సంగమేశ్వర స్వామి. స్వామి దర్శనం కోసం భక్తులు, శివ స్వాములు ఈ ఏడాది కూడా భారీగా తరలి వచ్చారు. భీష్మ ఏకాదశి పర్వదినం రోజున గంగా స్నానం చేసి పితృ దేవతలకు సంతర్పణ గావించి, సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న వారికి సంతాన, సౌభాగ్య ఫలములు, శుభములు కలుగుతాయని గొప్ప నమ్మకంతో భక్తులు సంగమేశ్వర దర్శనం కోసం వస్తారు.
కానీ ఈ సంవత్సరం తెలంగాణా, సిద్దేశ్వర నదీ తీరం నుండి సంగమేశ్వర సన్నిధికి బోట్లు నిషేధించడం వలన తెలంగాణా నుండి వచ్చే భక్తులు, శివ స్వాములు సంగమేశ్వర స్వామి దర్శనానికి రాలేని పరిస్థితి నెలకొనడంతో, సంగమేశ్వరం భక్తుల రద్దీ తగ్గు ముఖం పట్టింది. దీంతో గత ఏడాదితో పోల్చితే సంగమేశ్వర తీర్థం వెలవెల పోతున్నది.