కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ముగిసింది. అయితే, గత అయిదు నెలల కాలంలో 14 రాష్ట్రాలలో కాలి నడకన పర్యటించిన రాహుల్ గాంధీ ఎంత వరకు రాజకీయంగా లబ్ధి పొందారన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఆయన ఈ పాదయాత్రలో ప్రజల దృష్టిని మాత్రం తప్పకుండా ఆకట్టుకుని ఉంటారు. ఇందులో సందేహం లేదు. ఆయన టీ షర్టును చూడడానికి, ఆయన గడ్డాన్ని చూడడానికి వచ్చి ఉంటారు. ఆయన రోజుకు 20 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకతో పూర్తి చేయడం కూడా ఆకట్టుకుని ఉంటుంది. ఇక వేలాది మంది పురుషులు, మహిళలు, యువతీ యువకుల మాటలను, సమస్యలను వినడం నిస్సందేహంగా చిన్న విషయమేమీ కాదు. మధ్య మధ్య పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ప్రసంగాలు చేయడం వగైరాలన్నీ జనంలో ఆసక్తిని పెంచి ఉంటాయి.
అయితే, ఈ పాదయాత్ర సమయంలోనే ఆ పార్టీ గుజరాత్లో పరాజయం పొందడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో విజయం సాధించడం కూడా ఆ పార్టీ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే గొప్ప విషయమేమీ కాదు. ఈ పాదయాత్ర వల్ల తేలిందేమిటంటే, నిర్వహణ సామర్థ్యంలో కాంగ్రెస్ ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఈ విషయం పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సోషల్ మీడియా కూడా ఈ సామర్థ్యాన్ని గుర్తించింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల, ప్రజలకు చేరువ కావడం వల్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన మరింత పెరిగి ఉంటుంది. అంతేకాదు, ఈ యాత్ర ద్వారా ఆయనకు ప్రజల పట్ల ఉన్న సానుభూతి, ఆదరణ, అవగాహన బాగా వ్యక్తమయ్యాయి. ప్రజలు కూడా ఆయనలోని మెతక మనిషిని అర్ధం చేసుకున్నారు. అయితే, ఆయనలోని మెతక మనిషి, ఆయనలోని సానుభూతి ధోరణి ఎంత వరకూ ఓట్లను రాబట్టుకుంటాయన్నది ఎన్నికల వరకూ ఆగితే కానీ తెలియకపోవచ్చు. 2024 మేలో లోక్‌సభ ఎన్నికలు, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని ఎంత వరకూ మళ్లీ వెలుగులోకి తీసుకు వస్తుందన్నది అంతుబట్టని విషయంగా కనిపిస్తోంది.
మొత్తం మీద ఈ ఎన్నికలతో రాహుల్ గాంధీ కుటుంబ సామర్థ్యం గురించే కాక, కాంగ్రెస్ పార్టీని ఈ యాత్ర పునరుజ్జీవింప చేయగలదా అన్నది కూడా తేలిపోతుంది. నిజానికి, పాదయాత్ర కంటే పోరాటాలే ముఖ్యమనే అభిప్రాయం కాంగ్రెస్ నాయకుల నుంచి సైతం వ్యక్తమవుతోంది. దేశంలో అనేక సమస్యలున్నాయనే విషయం అందరికీ తెలుసు. ఆ సమస్యల్లో ఒక్క సమస్య పైన కూడా కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో పోరాటాలు జరపలేదు. ఈ సమస్యపైనా ప్రజలను సమీకరించడం జరగలేదు. ఫలితంగా అటు పత్రికలు, ఇటు ప్రజలు ఈ పాదయాత్రను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు సైతం ఈ పాదయాత్రను పట్టించుకోవడం లేదు. ప్రజల్లో కొందరు బీజేపీ వ్యతిరేకుల దృష్టిని మాత్రం ఇది కొద్దిగా ఆకట్టుకోగలిగింది. రాజకీయ బాధ్యతలను నెత్తికెత్తుకోవడం సుతరమూ ఇష్టం లేని రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రజల సమస్యలను గురించి పట్టించుకుని ఉపయోగమేమిటనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఆయన చర్వితచర్వణంగా హిందుత్వ గురించి మాట్లాడడం కూడా ప్రజల మనసు లకు ఎక్కడం లేదు. దేశాన్ని కలిపి ఉంచడానికి తాను ఈ యాత్ర చేస్తున్నట్టు చెబుతున్న రాహుల్ గాంధీ దేశం ఏ విధంగా ఎక్కడ విభజనకు గురవుతోందో కూడా తార్కికంగా చెప్పలేకపోతున్నారు. అది రాజకీయంగా ఉపయోగపడుతుందా అన్నది వేరే విషయం.
ప్రధానంగా ఈ పార్టీ తాను అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యనే తమ ఖాతాలో చేరిన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా లోక్‌సభ అభ్యర్థులను గెలిపించుకోవాల్సి ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో భీకర పోరాటానికి సంసిద్ధులు కావాల్సి ఉంటుంది. యాత్ర సందర్భంగా ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం ప్రధానంగా జరగాల్సి ఉంది. బీజేపీకి ఒక గమ్యమంటూ లేదా ఒక లక్ష్యమంటూ ఏదీ లేదని రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా అన్న మాటలు కాంగ్రెస్కు వర్తించకుండా చూడడం ముఖ్యం. నిజానికి అందుకు తగ్గట్టుగానే రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే తమ వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇందుకోసమే ఎదురుచూస్తున్నాయి.