Saturday, October 5, 2024
Homeహెల్త్Foot care: ట్యానింగ్ పోయి పాదాలు తెల్లగా మెరవాలంటే

Foot care: ట్యానింగ్ పోయి పాదాలు తెల్లగా మెరవాలంటే

పాదాలపై ట్యాన్ తో చాలామంది బాధపడుతుంటారు. దీనికి కొన్ని వంటింటి టిప్స్ ఉన్నాయి. అవి:

- Advertisement -

 ఒక టబ్బు తీసుకుని అందులో గోరువెచ్చని నీటిని పోయాలి. ఆ నీటిలో ఒక టీస్పూను రీతా పొడి, 200 ఎంఎల్ పాలు, గుప్పెడు గులాబీ రెక్కలు వేయాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. పాలు పాదాల స్కిన్ టెక్స్చెర్ కు మెరుపును తెస్తాయి. అంతేకాదు పాలకు ట్యాన్ ను పోగొట్టే సహజసిద్ధమైన గుణం ఉంది. ఆ తర్వాత కొబ్బరినూనెతో పాదాలకు మసాజ్ చేయాలి.

 పెరుగు, శెనగపిండి మిశ్రమం కూడా పాదాలపై ట్యాన్ ను పోగొడుతుంది. పెరుగు పాదాలకు కావలసిన నీటిని, తేమను అందిస్తుంది. శెనగపిండి పాదాలను మ్రుదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ఒక టేబుల్ స్పూను శెనగపిండి, అరకప్పు పెరుగు, అర టేబుల్ స్పూను నిమ్మరసం కలిపి పేస్టులా చేసి పాదాలకు రాసుకుని అరగంటపైగా అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కుని తేలికపాటి మాయిశ్చరైజర్ ని పాదాలకు రాసుకోవాలి. ఇలా చేస్తే కూడా పాదాలపై ఉండే ట్యాన్ పోతుంది.

 పాదాలపై ఉండే ట్యాన్ ను తొలగించేందుకు ఆయుర్వేదంలో కూడా ఒక పద్ధతి ఉంది. రెండు టీస్పూన్ల త్రిఫల చూర్ణం, చిటికెడు పసుపు, ఒక టీస్పూను శెనగపిండి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ తీసుకుని ఆ మిశ్రమాన్ని పేస్టులా చేయాలి. దాన్ని పాదంపై ట్యాన్ ఉన్న చోట పూసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పాదాలను నీళ్లతో కడుక్కోవాలి.

 చిన్న గిన్నెలో ఒక నిమ్మకాయ పిండి రసం తీయాలి. అందులో ఒక టేబుల్ స్పూను గరుకుగా ఉండే చక్కెర వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలపై ట్యాన్ ఉన్న చోట పూసి పదిహేను నిమిషాలు స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో పాదాలను కడుక్కోవాలి.

 ఒక టేబుల్ స్పూను మక్కపిండి, టీస్పూను పసుపు, టీస్పూను తేనె మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. పాదాలు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత వాటిపై ఈ పేస్టును రాసుకుని అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో పాదాలను కడుక్కోవాలి.

 కాఫీ స్క్రబ్ తో కూడా పాదాలపై ట్యాన్ పోతుంది. ఒక టేబుల్ స్పూను ఫిల్టర్ కాఫీ పొడి, రెండు టీస్పూన్ల బాదం నూనె లేదా కొబ్బరినూనె, అరటేబుల్ స్పూను చక్కెర , నిమ్మరసం కొన్ని చుక్కలు అన్నింటినీ బాగా కలిపి దాంతో పాదాలను సున్నితంగా మసాజ్ చేయాలి.

 సముద్ర ఉప్పుతో చేసే స్క్రబ్ కూడా ఉంది. ఇది పాదాల చర్మాన్ని మచ్చలు లేకుండా కాంతివంతంగా చేస్తుంది. ఒక బౌల్ లో చింతపండు రసం తీసి అందులో అర టీస్పూను బెల్లం, రెండు టీస్పూన్ల కొబ్బరినూనె లేదా బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని కాలుకి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.

 కమలాపండు కూడా పాదాలను మెరిసేలా చేస్తుంది. రెండు టీస్పూన్ల కమలాపండు తొక్కలు, ఒక టీస్పూను సముద్రంపు ఉఫ్పు, ఒక టీస్పూను కొబ్బరినూనె మూడింటినీ బాగా కలిపి దానితో పాదాలను సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో పాదాలను కడిగేసుకోవాలి.

 బొప్పాయిలోని ఎంజైములు కూడా చర్మాన్ని కాంతివంతం చేయడంతోపాటు ట్యాన్ ను పోగొడతాయి. సగం పండిన బొప్పాయి ముక్క గుజ్జులో ఒక టేబుల్ స్పూను తేనె కలిపి పేస్టులా చేయాలి. దాన్ని రెండు పాదాలకు పూసి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు.

 నల్పమరాది వంటి ఆయుర్వేద తైలంతో రోజూ పాదాలను సున్నితంగా మసాజ్ చేసుకుంటే పాదాలపై ట్యాన్ రాదు. పగుళ్ళు ఏర్పడవు.

 శాండల్ వుడ్ పొడి, తేనె కలిపిన మాస్కును పాదాలకు రాసుకున్నా కూడా ట్యాన్ పోతుంది. ఒక టీస్పూను శాండల్ వుడ్ పౌడర్, ఒక టేబుల్ స్పూను తేనె కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని అరగంట పైగా దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో పాదాలను కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

 బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి అందులో ఒక టీస్పూను తేనె, కొన్ని పాలచుక్కలు లేదా మీగడ కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ట్యాను ఉన్న పాదాలపై రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో మెరుపును సంతరించుకుంటుంది.

 పాదాలపై ఉండే ట్యాన్ కు జాగ్రత్తలు తీసుకుంటూనే అది మరింత పెరగకుండా రోజూ సన్ స్క్రీన్ పాదాలకు రాసుకుంటుండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News