చదరంగంలో మొదటి ఎత్తు ఎంత ముఖ్యమో, కథకి ఎత్తుగడ కూడా అంతే ముఖ్యం. కథపై పాఠకుడు ఓ అంచనాకొచ్చేది, మిగతా కథంతా చదవాలో వద్దో నిర్ణయించుకునేది దాని ‘ఎత్తుగడ’ నిర్ణయిస్తుంది. నేడు ఈనాడు ‘హాయ్ బుజ్జీ’, సాక్షి ‘ ఫన్ డే’, ప్రజాశక్తి ‘ స్నేహ ‘ మరికొన్ని పత్రికలు బాలలకోసం కథలు ప్రచురించటమే కాకుండా రచయితలకు ఇంకా పారితోషికాలు యిచ్చే సాంప్రదాయం కొనసాగిస్తున్నాయి. ఇందులో కొన్ని వారానికి ఒక కథ, రెండు కథలు ప్రచురించే పత్రికలైతే, మరికొన్ని ప్రతిరోజూ బాలల కథలు ప్రచురించే పత్రికలు కూడా ఉన్నాయి. సంపాదకుల డెస్క్ కు ప్రతిరోజూ పదుల సంఖ్యలో కథలు వచ్చి చేరుతుంటాయి. సంపాదకులు ఆకథలన్నీ ఓపిగ్గా చదటం ఒక్కటే పనికాదు.. ఊపిరాడని అనేక బాధ్యతలు ఉంటాయి. కథ అనేది కేవలం ఆ పిల్లల పేజీకి ఒక శీర్షిక మాత్రమే. ఇంకా ఆ పేజీలో ఫజిల్స్, జతపర్చడం, బాలల గీసిన చిత్రాలు, తేడాలు గుర్తించడం, సామెతలు, వింతలు, విశేషాలు, జోక్స్ ఇలా రకరకాల శీర్షికలతో, వాటికి తగ్గ బొమ్మలతో బాలలను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా ముస్తాబు చేయాలి. ఇక సమయం దొరికితే కథలు చదివి మెయిల్స్ కు రిప్లయ్ చేయాలి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఇక్కడ మన రచనలకు మొదటి పాఠకుడు సంపాదకుడే ! కుప్పలు తెప్పలుగా వచ్చి చేరే మెయిల్స్ లోంచి సంపాదకుడికి మన కథను ఓపెన్ చేసి చదివేటప్పుడు మొదటి రెండు పేరాల్లోనే ఆ కథ సాదా కథనో, మంచి కథనో తెలిసి పోతుంది. మనం రాసే కథ సంపాదకుడిని కట్టిపడేయాలి.
ఆసక్తిగా చదివించాలి. ముందు ఏం జరగనున్నదో అనే ఉత్సుకత కలిగించాలి. అప్పుడే సంపాదకుడు మనం రాసిన కథ పత్రికలో ప్రచురణకు ఎన్నకైనట్టు మెయిల్ ద్వారా తెలియ చేస్తాడు. ఇదంతా జరగాలంటే మన కథలో ‘ఎత్తుగడ’ అంటే మొదటి పేరాలోని వాక్యాలు అక్షరాల వెంట పరిగెత్తించేలా రాసుకోవాలి. లేకుంటే మన కథ సెలక్ట్ కాకపోవచ్చు. సంపాదకులకు మన మెయిల్ ఓపెన్ చేసి చదివి సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టముండక పోవచ్చు. ఐతే కథలో ఒక్కోసారి విషయం అంతగా లేకున్నా ఎత్తుగడ బాగుంటే కథను ప్రచురణకూ ఎన్నుకోవచ్చు. బాలలకోసం కథ రాసుకునేటప్పుడు కథకు మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే. ఐతే కథా ప్రారంభానికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది.
పూర్వ ఖమ్మం జిల్లా వాజేడు మండలం, లక్ష్మీపురంకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు అభిప్రాయం ప్రకారం
1) ఎత్తుగడ కథకి గల ప్రధాన లక్షణాలు ( భాగాలు) లో ఒకటి. 2) సాధారణంగా చెప్పాలంటే ఎత్తుగడను ‘ ప్రారంభం ‘ అని చెప్పవచ్చు. 3) ప్రారంభం .. ప్రకృతి వర్ణనతో గాని సంభాషణతో కానీ మరే విధంగానైనా పాఠకుడికి ఆసక్తి కలిగేటట్టుగా ఉండాలి. 4) ప్రారంభంలో చెప్పిన దానికి భిన్నంగా ‘ముగింపు’ ఉండాలి. అదే కథకు ప్రాణం. 5) పిల్లల కథలకు ఎత్తుగడ అంత ప్రాధాన్యత ఉండదు.సాధారణంగానే ఉంటుంది. 6) సందర్భాన్ని బట్టి ఎత్తుగడ ఉంటే కథలో ఆసక్తి ఉంటుంది. 7) ఎత్తుగడ కధకు రచయితను బట్టి మారుతూ ఉంటుంది 8) ఎత్తుగడ ఇలాగే ఉండాలనే నిబంధన అంటూ ఏమీ లేదు. 9) నా కథల విషయానికొస్తే నా కథల ప్రారంభమంతా సాదాసీదాగా ఉంటుంది. 10) ఐదో తరగతి పిల్లవాడికి, డిగ్రీ స్థాయిలో పాఠం చెప్పాల్సిన అవసరం లేదన్నదే నా భావన. డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు బాలల కోసం కథను రాసుకునేటప్పుడు పెద్దల సాంఘిక కథల ఎత్తుగడను అనుసరించకుండా కూడా చెప్పి మెప్పించవచ్చంటారు.
బాలల కోసం వీరు ప్రచురించిన ‘రసగుల్లలు’, ‘ పూతరేకులు’, ‘చంద్రవంకలు’ బాలల కథల సంపుటాలలోని కథలు పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులు, కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ ‘ ఎత్తుగడ’ మీద స్పందిస్తూ.. తనపై ‘ప్రపంచ కథక చక్రవర్తి’ ఓ. హెన్రీ ప్రభావం చాలా ఉందంటారు. ఓ. హెన్రీ చెప్పిన సూత్రం గమనిద్దాం.. ‘కథ ముగింపును ముందే ఆలోచించుకో. ఆ తర్వాత కథని ఎక్కడ నుంచి అయినా మొదలు పెట్టి ఆ ముగింపుని చేరుకో. మంచి కథ అవుతుంది ! ” మనం చొక్కాపు వెంకటరమణ కథలు పరిశీలిస్తే ఈ టెక్నిక్ ని పాటించి రాసినవిగా గమనించవచ్చు. అందుకే వీరి కథల ముగింపులో ఓ మెరుపు ఉంటుంది. కథాంశాన్ని బట్టి, ముగింపుని బట్టి కథ రాసే ఎత్తుగడ ఉంటుందంటారు. ఉదాహరణకి చొక్కాపు రాసుకున్న క్రింది కథలో ఎత్తుగడ గమనిద్దాం. కథ పేరు ‘బాతు బంగారు గుడ్డు’
1. అనగా అనగా ఒక పేదవాడు ఒక బాతుని పెంచుతున్నాడు. 2. మనిషి ఆశకు దాసుడు అయితే చాలా నష్ట పోతాడు. అలాంటి ఆశపోతు పేదవాడి అత్యాశ కథ ఇది. 3. తెల్లవారింది. బుట్ట కింద ఉన్న బాతుని చూసి పేదవాడు అదిరి పడ్డాడు. అది బంగారు గుడ్డు పెట్టింది. 4. ‘మీకే తిండికి గతి లేదు. గంతకు తగ్గ బొంత అన్నట్లు గుడ్లు పెట్టని బాతు ఒకటి. దాన్ని కోసుకుని తినేయండి అన్నాడు పొరుగింటి పోతురాజు. నిజమే అనిపించింది. బుట్ట కింద నుంచి బాతుని తీయ బోయాడు. బంగారు గుడ్డు ఉంది. పేదవాడు ఆశ్చర్య పోయాడు.
పై కథలో ఉత్సుకత కలిగించే ఎత్తుగడ గమనించారు కదా !. ఐతే ముఖ్యంగా ఈ క్రింది 4 సూత్రాలు పాటించి పాత కథలను కూడా కొత్తగా రాయొచ్చంటారు చొక్కాపు వెంకటరమణ. 1) మన కథ ‘ఎత్తుగడ’ పాఠకుల్లో ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. 2) ముందు ఏం జరగనున్నదో అనే ఉత్సుకత కలగాలి. 3) కథ రాసే పద్ధతిలో పాత సంప్రదాయం నుంచి కొంచెం బయటికి వస్తే కథ పాతదైనా కొత్తగా ఉంటుంది. 4) రాసే పద్దతి మీ సొంతదై ఉండాలి. మనం కథకు ప్రారంభం ఎంత ముఖ్యమో, ముగింపూ అంతే ముఖ్యమని చెప్పుకున్నాం.
చొక్కాపు వెంకట రమణ ఒక కథను ఎలా ముగించుకోవాలో నిర్ణయించుకుంటారు. కథను మొదలు అక్కడినుంచి మొదలు పెట్టి వెనక్కి వస్తూ కథా వస్తువునుబట్టి ప్రారంభాన్ని రాసుకుంటారు. అదే ఎత్తుగడ. కథకు ఎత్తుగడే ప్రాణం. అందుకే చొక్కాపు వెంకటరమణ ఎక్కువగా ఈ పద్దతిలోనే రచనలు చేయటం విశేషం. కాబట్టి కొత్తగా రాసే వారు కథలోని ‘ఎత్తుగడ’ ను ఉత్సుకత కలిగించేలా రాసి పత్రికలకు పంపితే సంపాదకులు ప్రచురణకు తీసికుని ప్రోత్సహిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు.
* (వచ్చే వారం బాలల కథారచనకు చెందిన మరికొన్ని రహస్యాలు తెలుసుకుందాం.)
– పైడిమర్రి రామకృష్ణ ( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.