భారతదేశ అభివృద్ధికి సంబంధించిన చరిత్రలో 1990ల నాటి ఆర్థిక సంస్కరణలకు సుస్థిర స్థానం ఉంది. ఆ తర్వాత కేంద్రంలో ఏడుగురు ఆర్ధిక మంత్రులు వచ్చారు. సుమారు 32 బడ్జెట్లు సమర్పించారు. అయితే, పీవీ నరసింహారావు కాలం నాటి ఆర్థిక సంస్క రణలు మాత్రం ఎవరూ చేపట్టలేదు. సార్వ త్రిక ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లలో కూడా ఏమాత్రం పస కనిపించలేదనే చెప్పాల్సి ఉంటుంది. ఈ కేంద్ర మంత్రులో ప్రతివారూ తమకు తోచిన పద్ధతిలో తాము బడ్జెట్లు సమర్పించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇంతకన్నా ఉత్తమోత్తమమైన బడ్జెజ్ మరొకటి లేదన్నట్టుగా తమ బడ్జెట్ ప్రసంగాల్లో ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ మాటల్లో కాక, చేతల్లో తన పనితనాన్ని చూపించడానికి ప్రయత్నిం చారు. ఇక దేశం సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా పి. చిదంబరం, అరుణ్ జైట్లీలు మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. తాము సమర్పించే బడ్జెట్లతో దేశ భవితవ్యమే మారిపోతుందని, ఎటువంటి సంక్షోభం నుంచయినా గట్టెక్కగలుగుతామని వారు బల్లగుద్ది చెప్పారు.
ఇక, యశ్వంత్ సిన్హా, జశ్వంత్ సింగ్ల విషయానికి వస్తే, వారు పేద రైతుల కోసం, పేద ప్రజానీకం కోసం కన్నీరు మున్నీరుగా విలపించారు. తాము సమర్పించే బడ్జెట్లతో పేదవారంతా సంపన్నులైపోవడం ఖాయం అన్నట్టుగా ప్రసంగాలు చేశారు. కాగా, వారి తర్వాత కేంద్ర బడ్జెట్లు సమర్పించిన ప్రణబ్ ముఖర్జీ, నిర్మలా సీతారామన్లు ఆర్థిక సంబంధమైన రాక్షసులతో తీవ్రంగా యుద్ధాలు చేశారు. అటువంటి రాక్షసులు నిజంగా ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు! నిర్మలా సీతారామన్ తన 2019 నాటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు, సంస్కరించు, పనిచేయి, మార్పు తీసుకురా వంటి మాటలను దాదాపు ప్రతి కేంద్ర మంత్రి తన పదవీ కాలంలో మాట్లాడుతూ వచ్చారు. అయితే, ఇందులో ‘పనిచేయి’ అనే మాట మాత్రం ఎక్కడా కనిపించలేదు. సుమారు 130 కోట్ల మంది ప్రజలను తమ గమ్యస్థానం వైపు తీసుకు వెళ్లడానికి సంస్కరణలనేవి చాలా ముఖ్యమైన రహదార్లే కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి రూపంలో ఇందుకు సరైన సారథే కనిపించడం లేదు.
కేంద్ర మంత్రి గనుక సరైన సంస్కరణలు చేపట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేయగలిగితే, పేద ప్రజల జీవితాలు సమూలంగా మారిపోతాయనడంలో సందేహం లేదు. అయితే, పిల్లి మెడలో గంట కట్టేదెవరు? సంస్కరణల వల్ల ఇబ్బడిముబ్బడిగా నిధులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. దరిమిలా, సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు సమకూరుతాయి. సంస్కరణల వల్ల ప్రభుత్వంలోని అవినీతినే కాక, సమాజంలోని అవినీతిని కూడా నిర్మూలించవచ్చు. నిజానికి, దేశంలో సంక్షేమ పథకాల ప్రాధాన్యం పెరుగుతోంది. వాటి అవసరం పెరుగుతోంది. కానీ, వాటికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా తయారైంది. సంస్కరణలు చేపట్టి వాటి కోసం నిధులను సమీకరించడా నికి ఇది అత్యవసర సమయం. ముఖ్యంగా సంపన్నులు, పేదలకు మధ్య అసమానతలు చాలావరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
అంతా గోల్ మాల్
దేశంలో యువతీ యువకుల పరిస్థితిని చూసి చిదంబరం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారు గాలిలో మేడలు కడుతున్నారు. వారి మేడలకు ప్రభుత్వాలే పునాదులు వేయాలి. ఈ బడ్జెట్ అందుకు ఏర్పాట్లు చేస్తుంది’ అని ఆయన 2006లో బడ్జెట్ సమర్పిస్తూ చెప్పారు. అయితే, ఈ దిశలో ఒక్క అడగు కూడా పడలేదు. అందుకు ఆయన ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవు. యువత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉంది. ఇక 1998లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన బడ్జెట్ సమర్పిస్తూ, రామారీ సింగ్ దినకర్ కవితనొకదానిని ఉటంకించారు. ‘ఓ, వీరుడా లేచి నిలబడు. నీ వీరత్వం ప్రద ర్శించు. అస్త్రశస్త్రాలతో ముందుకు దూసుకుపో, చొచ్చుకుపో. ఎక్కడా ఆగవద్దు. దేశ భవిష్యత్తుకు సంబంధించి కొత్త చరిత్ర సృష్టించు. ఆ బాధ్యత నీ మీదే ఉంది. ఈ భూమంతా నీదే. ఈ ఆకాశమంతా నీదే’ అంటూ ఆయన పార్లమెంట్‌లో చదివిన కవిత హర్షధ్వానాలు చేయించింది ఆ తర్వాత ఏమీ జరగలేదు. జశ్వంత్ సిన్హా 2003లో తన బడ్జెట్ ప్రసంగం చదువుతూ, మన అప్పులన్నిటినీ ఆస్తులుగా మార్చడానికి, మన పౌరుల్లోని మేధాశక్తిని, సృజనా త్మకతను, వ్యవస్థాపక సామర్థ్యాన్ని పారిశ్రామిక, వాణిజ్య రంగాల వైపు మళ్లించాల్సి ఉంది. ఈ ప్రయత్నం ద్వారానే ఆర్థికాభివృద్ధిని సాధించగలం. అందుకు ఈ బడ్జెట్ ఎంతగానో దోహదం చేస్తుంది’ అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. అయితే, ఏ కారణంగానో ఆ మాటలేవీ ఆచరణకు నోచుకోలేదు.
భారతదేశం నిజంగా వంద కోట్ల మంది కోటీశ్వరులతో నిండిపోవాలంటే, స్థానిక వ్యాపారాల మీదా, స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాల మీదా ఉన్న ఆంక్షలు తొలగిపోవాలి. అవి అభివృద్ధి చెందకుండా సంకెళ్లు వేసిన మార్కెట్ శక్తులను సంస్కరించాలి. ఈ రంగాలలో కొత్త వారు ప్రవేశించడానికి మార్గాలను సుగమం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి అవకాశం ఇవ్వాలి. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలి. యువతీ యువకుల ఆశయాలను అర్ధం చేసుకుని అవి సాకారమయ్యేలా చూడాలి. అయితే, అవన్నీ బడ్జెట్ ప్రసంగాల్లో తప్ప చేతల్లో, ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. బ్రిటిష్ రాజ్‌ను వదల్చుకున్నట్టుగానే లైసెన్స్ రాజ్ను కూడా వదల్చుకోవాలని 1998 బడ్జెట్‌లో యశ్వంత్ సిన్హా కూడా అభిప్రాయ పడ్డారు. ఇక 2016లో బడ్జెట్ సమర్పిస్తూ జశ్వంత్ సిన్హా కూడా రైతుల ఆదాయం రెట్టింపు కావాలని, వారికి దిగు బడి భద్రత కల్పించాలని భావించారు.
రెండవ హరిత విప్లవం ద్వారా మాత్రమే రైతులు అభి వృద్ధి చెందగలరని 2003లో జశ్వంత్ సిన్హా అన్నారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, దీనివల్ల వ్యవసాయ రంగం తీరు తెన్నులు మారిపోతా యని, రైతుల ఆదాయానికి తిరుగుండదని 2002లో యశ్వంత్ సిన్హా అన్నారు. తోటల పెంపకంలో ఒక విప్లవాన్నే తీసుకువస్తామని 2004లో చిదంబరం వాగ్దానం చేశారు. స్వయం ఉపాధి పథకాల గురించి, ఉపాధి హామీ పథకాల గురించి దాదాపు ప్రతి కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇవన్నీ జరగాలంటే, దేశంలో ‘కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు సమాధి కట్టా’లని జైట్లీ 2015 నాటి తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. ఇది అనేక దశాబ్దాలుగా దేశ ప్రజల్లో ఉన్న కోరిక. అందుకు తగ్గట్టు గానే ప్రతి ఆర్థిక మంత్రి నల్లధనాన్ని వెలికి తీయడానికి రకరకాల పరిష్కార మార్గాలను సూచిస్తూనే ఉంటారు. 1991లో మన్మోహన్ సింగ్ దొంగ రవాణాను అరికట్టడానికి బంగారం దిగుమతులను చట్టబద్ధం చేశారు. యశ్వంత్ సిన్హా కూడా బంగారం నిల్వలను ఆస్తులుగా మార్చేందుకు 1999లో గోల్డ్ డి పాజిట్ స్కీమును ప్రవేశపెట్టారు. ఇక 2005లో చిదంబరం బ్యాంకుల నుంచి డబ్బు విత్రా చేసుకోవడం మీద పన్ను విధించడం ప్రారంభించారు. ఇక బినామీ ఆస్తులను, డబ్బు అక్రమ తరలింపును అరికట్టడానికి ఎన్నో చట్టాలు కూడా రూపుదిద్దుకున్నాయి.
పన్నులకు దూరం
విచిత్రమేమిటంటే, భారతీయులు పన్నులు చెల్లించ డానికి ఇష్టపడరని, పన్నులు ఎగ్గొట్టడానికి మార్గాలు వెతుకుతుంటారని చాలా కాలం తర్వాత ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం ప్రారంభించాయి. మొత్తం భారతీయుల్లో 40 శాతం మంది కూడా పనులు చెల్లించడం లేదని, ఫలితంగా ఆర్థిక వనరులకు తీవ్రంగా లోటు ఏర్పడుతోందని వారు గ్రహించారు. పన్నుల వ్యవస్థలో ఎన్ని రకాలుగా మార్పులు చేర్పులు చేసినా పన్నుల వసూళ్లలో మాత్రం పెద్దగా మార్పు ఉండడం లేదు. చివరికి పన్నులన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి జి.ఎస్.టిని రూపొందించి అమలు చేస్తున్నారు. పేదరికాన్ని ఏ మాత్రం తగ్గించాలన్నా పన్నుల వ్యవస్థను విస్తరించి, వసూళ్లను పెంచాల్సి ఉంటుంది. దేశంలో కొన్ని రకాల దుస్థితులను నివారించడానికి సంక్షేమ కార్యక్రమాలు తప్పనిసరి అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా గ్రామాలో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు. అటు వంటి వారి కోసం ఈ బడ్జెట్‌ను రూపొందించడం జరిగింది అని ఒకప్పుడు యశ్వంత్ సిన్హా అన్నారు. పేదల కడుపు నింపడమే తన బడ్జెట్ పరమావధి అని జశ్వంత్ సింగ్ అన్నారు. అయితే, ఇవన్నీ మాటల స్థాయికే పరిమితమయ్యాయి.
విచిత్రమేమిటంటే, సంక్షేమ పథకాలకు నిధులను పెంచుతున్న కొద్దీ, సబ్సిడీలు ప్రకటిస్తున్న కొద్దీ పేదల పరిస్థితిలో మార్పు రాకపోగా, కుంభకోణాల సంఖ్య పేట్రేగిపోతోంది. చివరికి సంస్కరణలు కూడా ఏ కొద్దిమందికో పరిమితం అవుతున్నాయి. ఇవి చర్చలకు పరిమితం కావడమో, కొందరికి లేదా కొన్ని వర్గాలకు మాత్రమే వర్తిం చడమో జరుగుతోంది అని 2003లో జశ్వంత్ సింగ్ అంగీకరించారు. సంస్కరణలు మాత్రమే కాదు, బడ్జెట్ ప్రకటించిన పథకాలు, కార్యక్రమాలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.