నాగర్ కర్నూలు బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటించారు గులాబీ అధినేత కేసీఆర్. నాగర్‌కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీచేయనుంది. ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఆర్ఎస్పీ గెలుపు కోసం కలసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుంద మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
వంద రోజుల కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దామని పిలుపునిచ్చిన నిరంజన్ రెడ్డి, రుణమాఫీ అటకెక్కింది .. రైతుభరోసా ఆగిపోయిందంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదు .. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతున్నదంటూ నిరంజన్ రెడ్డి భగ్గుమన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు మళ్లీ భీడు భూములతో దర్శనమిస్తుందని, కరెంటు కోతలతో రైతులు తల్లడిల్లుతున్నారు .. అర్దరాత్రి కరంటు కోసం రైతులు నిద్దుర కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకువచ్చిందన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన ఈ మార్పులను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.