ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది.
కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేస్ పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే అరెస్ట్ చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది గనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బిజెపి మా శాసనమండలి సభ్యురాలిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే, కవిత అరెస్టు మీద ఇప్పటికే కేంద్ర మంత్రి సహా అనేక మంది బీజేపీ నాయకులు చాలామంది ప్రకటనలు చేశారు. ఈడి అధికారులు లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బిజెపి నాయకులు, బిజెపి కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు పలుమార్లు ప్రకటన చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. రేపు పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిసి ఈరోజు కవిత గారిని అరెస్టు చేయడం అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డి మోరలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. తద్వారా ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి కుట్ర చేసాయి. అరెస్టులు గానీ వేధింపులు గానీ, కుట్రలు గానీ మాకు, బి ఆర్ ఎస్ కు కొత్త కాదు. ఇలాంటివి ఛేదించి తెలంగాణ రాష్ట్రం సాధించాం. 14 ఏళ్లు పోరాటం చేశాం. రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాము. సుప్రీం కోర్టులో అక్రమ అరెస్ట్ మీద కేసు వేసి లీగల్ గా ఫైట్ చేస్తాం.
సుప్రీం కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం అంటే ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర. 19 వ తేదీ కేసు ఉంది కదా ఎందుకు అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి.
మహిళలను ఈడి అరెస్టు చేయొచ్చా, చేయొద్దా అనే అంశం కోర్టులో ఉంది. మమతా బెనర్జీ కుటుంబ సభ్యురాలి పైన, నలిని చిదంబరం పైన, కవిత గారి పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంటే, మూడు రోజుల ముందే అరెస్టు చేయడం అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసే కుట్ర అని అర్థమవుతున్నది.
ఎమర్జెన్సీ నియమించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది దౌర్జన్యంగా కవిత గారిని అరెస్టు చేశారు.
గతంలో బిఆర్ఎస్ మంత్రులను ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ప్రయత్నం కూడా చేశారు.
రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ అప్రజా స్వామీక చర్యలకు నిరసనగా, కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇస్తున్నది. రాజకీయ ప్రేరేపితమైన అరెస్టు ఇది. కాంగ్రెస్ బిజెపిల దుర్మార్గపు చర్య. బిఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. బిజెపి కాంగ్రెస్ లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్నారు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకొని వచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారు. రేపు శనివారం ఎల్లుండి ఆదివారం. ఒక పథకం ప్రకారం చేశారు. ఎవరెన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులు నిర్బంధాలు మా కొత్త కాదు. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం న్యాయపరంగా పోరాటం చేస్తాం.
రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది.”
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్…
కవిత గారి అరెస్టును రాజకీయ కుట్రక్కోణంగానే చూస్తున్నాం. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన కవిత తన విధిగా హాజరయ్యారు విచారణకు సహకరించారు. సిమ్ కార్డులను కూడా సబ్మిట్ చేశారు. నిందితురాలు కాదని చెప్పి పంపినవారు ఏడాది తర్వాత ఈరోజు హడావుడిగా అరెస్టు చేయడం అంటే ఇది కుట్రలో భాగమే. ఇంతకు మించిన దుర్మార్గపు చర్యలేదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇలా చేయడం అప్రజా స్వామికం. బిజెపి ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నది.
వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలపైన తన అధికారాన్ని ప్రయోగిస్తున్నది. లొంగదీసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. ఎదురు నిలబడితే దౌర్జన్యం చేసి ఇలా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నది. ఈ బిజెపి విధానాలకు నిరసనగా రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టారని పార్టీ తరఫున కోరుతున్నాం.