Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Can Rahul prove to be a good leader?: రాహుల్‌ గాంధీ సరైన...

Can Rahul prove to be a good leader?: రాహుల్‌ గాంధీ సరైన సారథి కాగలరా?

ఇంత పెద్ద దేశానికి సారథ్యం వహించే సత్తా ఉందా?

ప్రచారానికి, విజయాలకు బీజేపీ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆధారపడినట్టే, కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీకి విజయావకాశాలు నానాటికీ మెరుగుపడుతున్న వేళ ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్‌ పార్టీకి, ఇటు రాహుల్‌ గాంధీకి అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ఇవి కాంగ్రెస్‌ పార్టీకి అక్ష రాలా చావో రేవో ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రచార ఉధృతిని పెం చాల్సి ఉంది. ఈ ఉధృతి మీదే దాని జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఒకటి రెండు నెలల్లో లోక్‌ సభకు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రాజకీయ సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయిన బీజేపీకి,చీలికలు వాలికలైన, అచేతనంగా ఉన్న ఇండీ కూటమికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఇప్పటికే ప్రజల్లో ఒక అభిప్రాయం పాతకు పోయింది.
ప్రజాస్వామ్యంలో అద్భుతాలు జరగడానికి, పరిస్థి తులు తారుమారు కావడానికి అవకాశముంది. ఏ క్షణం లో అయినా ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావచ్చు. గుర్రం ఎగరావచ్చు. కానీ, ప్రత్యర్థి బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కాంగ్రెస్‌ విషయంలో ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉందా అన్న అనుమానం కూడా కలుగు తోంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీయే అద్భుతాలు సృష్టించ గల అవకాశం ఉన్నా అది ఏ అవకాశాన్నీ సద్వినియో గం చేసుకోవడం లేదనే అభిప్రాయం ఆ పార్టీ నాయ కులకు కూడా కలుగుతోంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రజల మధ్య జరుగు తోంది. ప్రజల సాధక బాధకాలను ప్రత్యక్షంగా తెలుసు కుంటోంది. నిజానికి, ఇది రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో రాజకీయ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. అంతేకాదు, కాంగ్రెస్‌ పార్టీ సరైన సమయంలో సరైన విధంగా రాజకీయ ఆర్థిక విధానాన్ని కూడా ప్రకటిం చింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల ప్రభుత్వోద్యోగాలు కల్సిస్తామని, లక్షమందికి అప్రెంటైస్‌ శిక్షణ ఇప్పిస్తామని, ప్రశ్న పత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేస్తామని, అసంఘటిత కార్మికులకు, వలస కార్మికు లకు సామాజిక భద్రత కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.
ఆలస్యంగా నిర్ణయాలు
ఇటువంటి వాగ్దానాలను చాలా కాలం ముందే చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్‌ మీద కొత్తగా విశ్వసనీయత ఏర్పడే అవకాశం లేదు. అంతేకాదు, ఇటు వంటి వాగ్దానాలు ఆచరణ యోగ్యంగా కూడా కనిపిం చడం లేదు. 2019లో కాంగ్రెస్‌ పార్టీ ఇదే విధంగా ఆఖరు క్షణంలో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అయితే, దీన్ని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయక పోవడంతో ఆ పార్టీ మీద కొత్త తరం వారిలోనూ, మహిళ ల్లోనూ నమ్మకం కలగడం కష్టమైంది. పైగా, బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇది అమలు జరగడం ప్రారంభమైంది. ఏ పార్టీ భవిష్యత్తయినా వాటి అగ్ర నాయకుల అడుగుజాడల మీద ఆధారపడి ఉంటుంది.జవహర్‌ లాల్‌ నెహ్రూ దేశా నికి ఆర్థికంగా, రాజకీయంగా దిశానిర్దేశం చేశారు. సోష లిజ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ పేద రిక నిర్మూలన మీద దృష్టి పెట్టారు. లౌకికవాద సిద్ధాం తాలను ప్రవచించారు. రాజీవ్‌ గాంధీ టెక్నాలజీని ప్రవేశ పెట్టారు. ఆధునిక భారతదేశం గురించి కలలు కన్నారు. నరేంద్ర మోదీ బ్రాండ్‌ ఇండియా ఇమేజ్‌ ను తీసుకు వచ్చారు. జాతీయవాదాన్ని పెంపొందించారు. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టారు. టెక్నాలజీని కొత్త పుంతులు తొక్కిస్తున్నారు.
రాహుల్‌ గాంధీలో అటువంటి విజన్‌, దార్శనికత ఏదీ కనిపించడం లేదు. రాజకీయంగా, సామాజి కంగా ప్రజలకు దూరమవుతూ వచ్చింది. సాంస్కృతిక, సైద్ధాం తిక ఆశయాలకు దూర మైంది. సరళీకరణకు ఆద్యురా లుగా గుర్తింపు ఉన్నప్పటికీ ఆర్థిక సంస్కరణలకు తిలోద కాలు ఇచ్చింది. పైగా అవినీతిగా బాగా దగ్గరైందనే మాట కూడా వచ్చింది. అనేక మిత్ర పక్షాలు, భాగ స్వామ్య పక్షాలు గుడ్‌ బై చెప్పేశాయి. చివరికి ఇండీ కూటమిని నెలకొల్పడానికి కృషి చేసినవారు కూడా ఒక్కరొక్కరే కూటమి నుంచి నిష్క్రమించడమే కాకుండా, ఇం దుకు కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యురాలన్న అభిప్రాయాన్ని కూడా సృష్టించడం జరిగింది. బీజేపీలో అంతా ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. బీజేపీ ఏ చర్య తీసు కున్నా తనకు ప్రతిఫలం ఉండేటట్టు చూసుకుంటోంది. పార్టీ లను కలుపుకుంటున్నా, పార్టీలను విడదీస్తున్నా, ప్రభు త్వాలను ఏర్పాటు చేస్తున్నా, ప్రభుత్వాలను కూలగొడు తున్నా, చివరికి కేంద్ర సంస్థలను ప్రతిపక్షాల మీదకు ప్రయోగిస్తున్నా తన పట్టు పలుకుబడికి భంగం లేకుం డా, తమకు అవకాశాలు పెరిగేలా చూసుకుంటోంది.
వరుసగా తప్పటడుగులు
తమకు దూరమైన ప్రతి వర్గాన్నీ జాతీయ పురస్కా రాలతో తమ వైపునకు తిప్పుకుంటోంది. నితీశ్‌ కుమార్‌ పార్టీనే కాదు, చంద్రబాబు నాయుడు పార్టీని కూడా కలుపుకోగలిగింది. శివసేన, ఎన్‌.సి.పిలను చీల్చగలి గింది. వలస నాయకులను స్థానాలతో సత్కరిస్తోంది. ఇదివరకు కాంగ్రెస్‌ నాయకులు ఎవరు పార్టీ నుంచి నిష్క్రమించినా సొంత కుంపట్టు పెట్టుకునేవారు. ఇప్పుడు పాలకపక్షాల్లో చేరిపోతున్నారు. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకులు సైతం పాలక పక్షాలకు మద్దతు ప్రకటి స్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రాను రానూ జాతీయత తగ్గుతోంది. ప్రాంతీయ స్థాయికి వెళ్లిపోతోంది. గత పదే ళ్లుగా కాంగ్రెస్‌ బలం 100ను దాటడం లేదు. దేశ వ్యా ప్తంగా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌ సభలో 290 స్థానాలకు మించిన బలంతో కొనసాగు తోంది. 2019 నాటి మోదీ కన్నా 2024 నాటి మోదీ మరింత మెరుగ్గా ఉంటారనే అభిప్రాయం సర్వవ్యాపితం అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే మోదీ కూడా ఓడి పోయేవారంటూ సంజయ్‌ నిరుపమ్‌ అనే కాంగ్రెస్‌ ఎంపీ కూడా వ్యాఖ్యానించారంటే ఆ పార్టీ అంతర్గత పరిస్థితి కూడా ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రతి సర్వే, ప్రతి అభిప్రాయ సేకరణ, ప్రతి అధ్యయనం కాంగ్రెస్‌ పార్టీని అధ్వాన స్థితిలో చూపెడుతు న్నాయి. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందా, ఊడుతుందా అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ కాం గ్రెస్‌ నాయకత్వం తీరు ఊరందరిదీ ఒక దారి, ఉలిపికట్టెది ఒక దారి అన్న చందంగానే ఉంటోంది. – ప్రొఫెసర్‌ ఎస్‌. విష్ణువర్ధన్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News