ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ముమ్మాటికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి పన్నిన రాజకీయ కుట్రనే అని జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల్ల గ్రామంలోని క్రాసింగ్ వద్ద ఎమ్మేల్సి కవిత అరెస్ట్ కు నిరసనగా సిద్దిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి ధర్నా నిర్వహించారు.
అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా కేసీఆర్‌ను, బిఆర్ఎస్ ను ఎదురుకోలేమని తెలిసే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని మోడీ ఈ ప్లాన్ రచించారని, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్ఎస్ నేతలను భయబ్రాంతులకు గురి చేయాలని ఈడీ చూస్తోందని ఫైర్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ నేతలు ఎవరూ భయపడబోమని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయపరంగా కోర్టుల్లో పోరాడతామని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకట్రావు, నేరెళ్ల ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూసపల్లి సరస్వతి, నాయకుడు భాస్కర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.