Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Telangana: సామరస్యం అవసరం

Telangana: సామరస్యం అవసరం

నిజానికి ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు మధ్య వివాదాలు, విభేదాలు పరిష్కారం అయి, సామరస్యం నెలకొనాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగానైనా వీరి మధ్య సయోధ్య ఏర్పడాలని భావిస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత గవర్నర్‌ సంయుక్త సమావేశాల నుద్దేశించి మాట్లాడబోతున్నారు. సమావేశాలకు రావడానికి ఆమె రావడం ఒక మంచి పరిణామం. ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఇక్కడితో ఆగకుండా మరింత ముందుకు పోవాల్సి ఉంది. భవిష్యత్తులో కొత్త సమస్య లేవీ తలెత్తబోవనే భావించడం జరుగుతోంది. ప్రస్తుతానికి ఇద్దరికీ మధ్య సామరస్యం ఏర్పడడం, భవిష్యత్తులో సమస్యలు ఉండకపోవచ్చనే అభిప్రాయం ఏర్పడడం వంటివి సరిపోతాయనుకోలేం. ఇప్పటికైనా ఈ ఇద్దరూ కూర్చుని చర్చలతో సమస్యను, అభిప్రాయభేదాలను శాశ్వతంగా పరిష్కరించుకోవడం మంచిదనిపిస్తోంది.
కొద్ది కాలంగా గవర్నర్‌, ముఖ్యమంత్రి ఎడమొగం పెడమొగంగా ఉండడం అందరూ గమనిస్తున్న విషయమే. కొన్ని బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండిపోవడం ఈ వైమనస్యానికి కారణంగా కనిపిస్తోంది. శాసనసభ ఆమోదించిన తర్వాత కూడా గవర్నర్‌ వాటి మీద సంతకం చేయకుండా తొక్కి పెట్టి ఉంచడం సహజంగానే ముఖ్యమంత్రికి ఆగ్రహం కలిగిస్తోంది. ఈ బిల్లుల మీద అభ్యంతరాలేమైనా ఉంటే తెలియజేయడానికి గవర్నర్‌కు అవకాశం ఉంది. కానీ, గవర్నర్‌ ఏ కారణమూ లేకుండా, ఏ కారణమమూ చెప్పకుండా వీటిని పెండింగ్‌లో ఉంచడం ముఖ్యమంత్రికి నచ్చకపోవడమన్నది సాధారణంగా జరిగేదే. అయితే, ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ పాటించడం లేదనే భావనలో గవర్నర్‌ ఉన్నారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే మీమాంస ఇక్కడ ప్రధానం కాదు. కానీ, ఈ వివాదంలో కొందరు గవర్నరు, కొందరు ముఖ్యమంత్రిని బాహాటంగానే సమర్థించడం వివాదాన్ని పెంచిపోషిస్తోంది. అంతేకాదు, ఈ ఇద్దరి వ్యవహార శైలీ ఇందుకు కారణమని వాదించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ వివాదంలో రాజ్యాంగ పవిత్రత బలిపశువు అవుతోందనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాదను ఇస్తూనే ఉండాలి. ఆయన రాజ్యాంగపరమైన అధినేత అన్న వాస్తవాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. రాష్ట్ర గవర్నర్‌తో వ్యవహరించాల్సిన తీరును, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడింది. ఇక గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంటే తన ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం ఏ విధంగా చూసినా సమంజసం కాదు. సమర్థనీయం కాదు. శాసనసభ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చివరికి పరిస్థితి ఎంత అధ్వాన స్థితికి చేరిందంటే, బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే ఆర్థిక బిల్లు మీద గవర్నర్‌ సంతకం చేసేలా చూడాలంటే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ వేయడం కూడా జరిగింది.
కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361(1) ప్రకారం, తన విధి నిర్వహణకు సంబంధించినంత వరకు గవర్నర్‌ను న్యాయస్థానాలు ప్రశ్నించడం కానీ, నిల దీయడం కానీ చేయడం సాధ్యంకాదు. ఆమెకు ఉన్న అధికారాలను కోర్టులు ఏ విధంగానూ ప్రశ్నించలేవు. దరిమిలా, హైకోర్టు వెంటనే ఈ పిటిషన్‌ను తోసిపారేయడం జరిగింది. హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య సయోధ్య కుదిరింది. గవర్నర్‌ తప్పనిసరిగా సంయుక్త సమావేశాల్లో పాల్గొనాలని, బిల్లులపై సంతకాలు చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. వాస్తవానికి, హైకోర్టు వరకూ వెళ్లకుండానే వీరిద్దరూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుని ఉంటే హుందాగా ఉండేది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. రాష్ట్రాధినేత, ప్రభుత్వాధినేత తమ వివాదాలను బాహాటం చేసే ముందు రాజ్యాంగ పవిత్రతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎంతో పరిణతి చెందిన ముఖ్యమంత్రి, గవర్నర్‌ తమ విభేదాలకు ఇంతటితో స్వస్తి చెప్పారనే ఆశించాలి.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News