రోజురోజుకూ ఎండ తీవ్రవత పెరిగిపోతోంది. ఎండ తీవ్రవతను లెక్కచేయకుండా తిరగటం వలన త్వరగా అలసటకు గురి అవుతాం. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ‘వడదెబ్బ’కు గురయ్యే ప్రమాదం ఉంది. దీని వలన ప్రాణాపాయ స్థితి సైతం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధిగమించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ఎం . గంగాధర్ మాటల్లో…
ప్రశ్న: వడదెబ్బ అంటే ఏమిటి.. దీనికి గురైయ్యే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది.
జవాబు : శరీరంలో వేడిని నియంత్రించే విధానము విఫలమైన సమయంలో తీవ్రమైన అలసట, నిరసానికి గురి కావడంతోపాటు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే వైద్య భాషలో వడదెబ్బ అంటారు. పిల్లలు, వృద్దులు(65 సంవత్సరాలు పైబడిన వారు), శారీరిక శ్రమ చేసేవారు, ఎక్కువ సమయంలో ఎండలో తిరిగేవారు. పనిచేసేవారు ఈ గురై య్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు త్వరగా ఈ వడ దెబ్బకు గురౌ తారు.
ప్రశ్న: వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..ఈ సమయంలో శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి.. ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
జవాబు: శరీర కండరాలు తిమ్మిరెక్కినట్లు ఉన్న.. భారీగా చెమట పోసినా.. విపరీతమైన అలసట అనిపించినా..తలనొప్పి, వాంతులు, గుండె ఎక్కువగా కొట్టుకోవడం , చర్మం పాలిపోవడం, ముదురు రంగులో మూత్రం రావడం ప్రధానమైన లక్షణాలుగా చెప్పవచ్చు.సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే అధిక ఉష్ణోగ్రతకు గురి కావడం వల్ల అలసటకు దారితీస్తుంది. ఈ సమయంలో శరీరం వేడిని నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 41 సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ చేరుకుంటే సమస్య తీవ్రమైనట్లుగా భావించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చల్లటి ప్రాంతానికి చేరుకోవాలి. వీలైతే చల్లని షవర్ కిందకు చేర్చాలి. అందుబాటులో లేకపోతే చల్లని నీటిలో ఉంచిన స్పెంజ్ తో, ఐస్ ప్యాక్ తో నుదురు మెడ శరీరాన్ని తుడవాలి.
ప్రశ్న: ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు చిట్కాలు ఏమైనా ఉన్నాయా..?
జవాబు : వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ వేసవిలో కొన్ని చిట్కాలు ఆచరణ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు . లూజు, లూజుగా ఉండే దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులు ధరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆల్కహాల్ సేవించకుండా ఉండటం మంచిది. ఆల్కహాల్ సేవించడం వల్ల డి హైడ్రోజన్ కు గురికావాల్సి వస్తుంది. చల్లటి నీరును ఎక్కువగా తీసుకోవాలి. దోసకాయ, పుచ్చకాయ, దానిమ్మ, అరటి వంటి పండ్లను తినడం ఎంతో శ్రేయస్కారము. ఏరోబిక్ వ్యాయామాలకు దూరముగా ఉండాలి. వీలైనంత తేలికపాటి వ్యాయామం చేయడంతో పాటు ఈత కొట్టడం మంచిది.పూర్తిగా శరీరాన్ని కప్పి ఉండేలా దుస్తులు ధరించకుండా వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి. బయట తిరిగేవారు టోపీ, సన్ గ్లాసులు వాడటం మంచిది. ఒకవేళ మీకు వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి, దగ్గరలో తక్షణ వైద్య సేవలు పొందండి.