భారత్‌కు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థే చాలా వరకు ఆదర్శం. ఈ వ్యవస్థ నుంచే భారత దేశం ఎన్నో అంశాలను పుణికిపుచ్చుకుందనడంలో సందేహం లేదు. అయితే, తనకు సౌకర్యంగా, అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే అక్కడి నుంచి స్వీకరించినట్టు కనిపిస్తోంది. బ్రిటిష్ పౌరులకు తమ పార్లమెంట్ కు పిటిషన్ పెట్టుకునే అధికారం ఉంది. ఏదైనా ప్రజా సమస్య మీద పార్లమెంట్‌కు 10 వేల మంది కనుక తమ సంత కాలతో పిటిషన్ లేదా అభ్యర్థన పెట్టుకుంటే ప్రభుత్వం సమాధానం ఇచ్చి తీరాలి. లక్షమంది సంతకాలు చేసి పార్లమెంటు పిటిషన్ సమర్పిస్తే వారు సూచించిన ప్రజా ప్రయోజన అంశం మీద తప్పనిసరిగా చర్చించడం, నిర్ణయం తీసుకోవడం జరగాలి. భారతదేశ పార్లమెంట్‌లో ఈ అవకాశం లేదు. బ్రిటన్ పార్లమెంట్‌కు సంబంధించినంత వరకు ఇది అక్కడి పౌరుల ప్రాథమిక హక్కు. పార్లమెంట్ సభ్యుల ఎన్నిక పూర్తి అయిన తర్వాత కూడా అక్కడి పార్లమెంట్‌కు పౌరులకు సంబంధం ఉంటుంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత నుంచి పౌరులకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత పార్లమెంట్ వ్యవస్థకు అటువంటి అవకాశం లేదు. పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన తర్వాత వారితో పౌరులకు సంబంధం ఉండదు. పార్లమెంట్ సమావేశాలతో కూడా సంబంధం ఉండదు. జవాబుదారీ తనం అసలే ఉండదు.
అయితే, రెండు మూడు రోజుల క్రితం ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. ప్రజా ప్రయోజనం కలిగిన అంశాలు లేదా సమస్యల మీద పార్లమెంట్ చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వీలుగా పౌరులకు పార్లమెంట్‌కు పిటిషన్ పెట్టుకునే ప్రాథమిక హక్కును కల్పించాలని ఆ పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు కె.ఎం. జోసెఫ్, బి.వి. నాగరత్నలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ను స్వీకరించడమే కాకుండా, ఈ పిటిషన్‌కు ప్రభుత్వం నుంచి స్పందన కూడా కోరింది. రెండు వారాల తర్వాత ఈ పిటిషన్ మీద విచారణ ప్రారంభం అవుతుంది. కరణ్ గార్గ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేయడం జరిగింది. పార్లమెంట్లో ప్రజల సమస్యల మీద చర్చించడం అనేది రాను రానూ తగ్గిపోతోందని, పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలకు ప్రాతినిధ్యం వహించడం కూడా జరగడం లేదని పిటిషనర్ తన పిటిషన్‌లో వాపోయారు.
అత్యధిక సంఖ్యాక ప్రజాస్వామ్యవాదులు ఈ పిటిషన్ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన అంశాలు చాలా ముఖ్యవైనప్పటికీ వాటి మీద కూడా పార్లమెంట్ చర్చజరపడం లేదు. ఇది ప్రభుత్వ వ్యయం నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో నిధులు ఖర్చుపెడుతున్నాయి? పన్ను చెల్లింపుదారుల డబ్బుతో ఏ స్థాయిలో సంక్షేమం అమలు జరుగుతోంది? సంక్షేమంపై జరుగుతున్న ఖర్చుకు ప్రతిఫలంగా దక్కుతున్న ఫలితం ఏమిటి? నిజానికి, సంక్షేమానికి సంబం ధించి ఎన్ని పథకాలు అమలు జరుగుతున్నాయో, ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారో, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయో మదింపు చేయడం చాలా కష్టమైన పని. ప్రభుత్వాలకు ఇదొక పెద్ద సవాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వెబ్‌సైట్‌లో కూడా ఈ వివరాలు అందుబాటులో ఉండవు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కూడా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే.
ఎవరికీ పట్టని పథకాలు
కేంద్రంలోని సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తుంటుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య పనివారు, వికలాంగుల కోసం వందలాది పథకాలను రూపొందించి అమలు చేస్తుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీటి మీద ఖర్చ వుతుంటాయి. ఇక గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రకరకాల పేర్లతో రకరకాల పథకాలను ఏటా ప్రవేశ పెడుతుంటుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీటి మీద వ్యయం అవుతుంటాయి. ఇక సీనియర్ సిటిజెన్ల సంక్షేమం కోసం 28 పథకాలు అమలు జరుగుతున్నట్టుగా ‘పెన్షనర్ల పోర్టల్’ ఒక జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది. ఇవన్నీ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలకు లెక్కే లేదు. ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి పూర్తి వివరాలతో సహా తెలియడానికి ‘డి.బి.టి పోర్టల్’లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ అనే విభాగం చూస్తే కొద్దిగా అంచనాకు రావచ్చు. ఈ పోర్టల్లో మంత్రిత్వ శాఖల వారీగా, విభాగాల వారీగా పథకాలు, వాటి వివరాలు లభ్యమవుతాయి.
మొత్తానికి ఈ పోర్టల్ను బట్టి తేలుతున్నదేమిటంటే, కేంద్ర ప్రభుత్వంలో 53 శాఖలు 310 పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని కోడ్లను బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏయే పథకానికి ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నదీ ఇందులో ఉంటుంది. ఈ పథకాల వల్ల ఎవరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నదీ కూడా ఇందులో ఉంటుంది. ఇవి కాకుండా లబ్దిదారులకు నేరుగా చెల్లింపులు జరిపే పథకాలు కూడా ఉన్నాయి. ఆ పథకాల వివరాలు ఈ పోర్టల్లో కనిపించవు. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఎన్ని పథకాలు అమలు జరుపుతున్నాయి? ఇందుకు ఓ వెసులుబాటు ఉంది. లబ్ధిదారుల్లో ఎంత మంది విధంగా ఏ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారో తెలిపే పోర్టల్నొకదానిని అనికేత్ దేవ్గర్ అనే ఒక ఐటీ నిపుణుడు కొంత కాలం క్రితం మొదలుపెట్టారు. ఆయన ఎన్నో వివరాలను హల్దర్శక్ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను బట్టి ఇందులో 20,000 పథకాలున్నాయని తేలింది.
అందుబాటులో వివరాలు
ఇంతకూ ఈ పథకాల మీద ప్రభుత్వాలన్నీ కలిపి ఏ స్థాయిలో నిధులు ఖర్చుపెడుతున్నాయి? 2022 – 23 సంవత్సర బడ్జెట్ పత్రాల ప్రకారం ప్రభుత్వాలు 50 సంక్షేమ పథకాల మీద రూ. 4.45 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల మీద ఖర్చు చేసే నిధుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. సంక్షేమ పథకాల వివరాలు, అవసరాల గురించి చర్చించనవసరం లేదు. మధ్యతరగతి వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే సమస్య గురించి కూడా ఇక్కడ చర్చించడం లేదు. సుమారు 80 కోట్ల మందికి రేషన్ కార్డులున్నాయని ప్రభు త్వ లెక్కలు చెబుతున్నాయి. సుమారు 50 కోట్ల మందికి ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం వర్తిస్తోందని కూడా చెబుతున్నాయి. ఇక 15 కోట్ల మంది ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్నట్టు కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పథకాలు అమలు జరుగుతున్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పేద ప్రజల జీవనశైలిలో, జీవన ప్రమాణాలలో మార్పు రాకపోవడమేమిటన్నదే ఇక్కడ ప్రశ్న.
అసలు ఇన్ని పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందా? వీటిని ఒకే తాటి మీదకు తీసుకు రాలేమా? లబ్ధిదారులకు ఈ పథకాలన్నీ చేరుతున్నాయా లేదా అన్నది పరిశీలించడానికి, పథకాలన్నిటినీ ఒకే విభాగంలో చేర్చడానికి కృషి జరగాల్సి ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివేక్ దేవ్రాయ్ ఈ మధ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. ఇంతకూ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా, వీటన్నిటి గురించి చర్చ జరగాల్సి ఉంది. సాధారణంగా బడ్జెట్ అనేసరికి ఇందులో కొద్దిగా రాజకీయ కోణం కూడా ఉంటుంది. 2024లో ఎన్నికలు జరగబోతున్నందు వల్ల రాజకీయ కోణానికే ప్రాధాన్యం ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఈ పథకాల మీద ఖర్చు చేస్తున్నందువల్ల ఈ అంశం గురించి ఏదో విధంగా చర్చ జరగాల్సి ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు ఉన్న భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ తప్పనిసరిగా జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంట్‌కు పిటిషన్ పెట్టుకునే అధికారాన్ని పౌరులకు అప్పగించాల్సిన అవసరం ఉంది.