Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Bhupalapalli: పెద్దపల్లి బరిలో కాకా మనువడు వంశీకృష్ణ పొలిటికల్ ఆరంగేట్రం

Bhupalapalli: పెద్దపల్లి బరిలో కాకా మనువడు వంశీకృష్ణ పొలిటికల్ ఆరంగేట్రం

పంతం నెగ్గించుకున్న వివేక్

రాజకీయ దురంధరుడు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి కుటుంబం తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వెంకటస్వామి తనయులిద్దరూ బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్, చెన్నూరు నుండి గడ్డం వివేక్ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి జయకేతనం ఎగరవేశారు. ఇరువురు సోదరులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, మూడవ అవకాశం ఆ కుటుంబానికి దక్కదని అంతా భావించారు. అందుకు భిన్నంగా మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించడం చర్చనీయంగా మారింది.

- Advertisement -

అందరినీ కాదని..

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మెజారిటీ శాసనసభ్యులు వంశీకృష్ణ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా లేనప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనకే టికెట్ కేటాయించడం విశేషం. పెద్దపల్లి పార్లమెంట్ బరిలో సిట్టింగ్ ఎంపీ బి. వెంకటేష్ నేత ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనకే టికెట్ ఖరారు అవుతుందని అందరూ భావించారు. ఆయన కాని పక్షంలో మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి పేరు సైతం తెరపైకి వచ్చింది. ఈ రెండు పేర్లను కాదని అధిష్టానం వంశీకృష్ణ అభ్యర్థిత్వం ఖరారు చేయడం విశేషం.

మూడవ తరం నేతగా..

కాంగ్రెస్ పార్టీలో ఉత్తంకుమార్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ఇద్దరు చొప్పున ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నప్పటికీ, ఒకే కుటుంబం నుండి ఇప్పటివరకు ముగ్గురికి అవకాశం లభించడం అరుదనే చెప్పవచ్చు. నల్గొండ జిల్లా నుండి మాజీ మంత్రి జానారెడ్డి కుమార్ రెడ్డికి సైతం టికెట్ కేటాయించి జానారెడ్డిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి పార్లమెంటు టికెట్ ఆశించినప్పటికీ ఒకే కుటుంబం నుండి ముగ్గురికి అవకాశం లేదని అధిష్టానం తెగేసి ఇటీవలనే చెప్పింది. అలాంటిది వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురికి ఒకే దఫాలో అవకాశం లభించడం అరుదైన రికార్డుగా చెప్పుకుంటున్నారు.

స్వర్గీయ గడ్డం వెంకటస్వామి ( కాకా) సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత ఆయన అనేక పర్యాయాలు పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆయన కుటుంబం నుండి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి గతంలో ప్రాతినిధ్యం వహించారు. పెద్దపల్లి బరిలో వంశీకృష్ణ విజయం సాధిస్తే వారి కుటుంబం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైతం ప్రతినిధ్యం వహించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News