Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Youth votes: యువ ఓటర్లు ఎటువైపో

Youth votes: యువ ఓటర్లు ఎటువైపో

నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుని ఓటేయాలి

మన దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగినది. ఈ ఎన్నికలలో సుమారుగా 97 కోట్ల మంది ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్‌ కేంద్రాలు, 55 లక్షల ఈవీఎంలు, కోటిన్నర మంది సిబ్బంది ఈ ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొనాల్సి ఉంది. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో జరిగే ఈ మహా క్రతువు (ప్రక్రియ) లో రాజకీయ పక్షాలు, ఎన్నికల సంఘం, ప్రజా మీడియా, ఎలక్షన్‌ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అందరికంటే ఎక్కువగా ‘ఓటర్లు‘ నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సందర్భం ఇది. పరస్పర దూషణలు, తిరస్కారాలే నయా ఎన్నికల ప్రచార సరళిగా మారిన వేళ తమ ప్రాధాన్యాల ప్రాతిపదికన ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించు కోవలసి ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌ పథకాలను రూపొందిస్తూ మేనిఫెస్టోలను వండి వార్చుచున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ‘గ్యారంటీ‘ల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నాయి. మన దేశంలోని యువ ఓటర్లు, మహిళా ఓటర్లకు గాలం వేసి ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్రంలో అధికార పీఠం దక్కించుకోవడానికి దేశంలోని రాజకీయ పార్టీలు రెండు కూటములుగా ఏర్పడినాయి. ఎన్డీఏ కూటమికి బిజెపి, ఇండియా కూటమికి కాంగ్రెస్‌ పార్టీలు నాయకత్వం వహిస్తున్నాయి. ఎన్నికలు చేరువవుతున్న వేళ శాయశక్తులా తమ తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. ఎన్డీఏ కూటమి సబ్సిడీలు, పథకాలకు మోదీ గ్యారంటీ అంటూ, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ పార్టీ యువతకు ఐదు గ్యారంటీల హామీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటు న్నాయి. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ. 8,500 స్టైఫండ్‌తో సంవత్సరం పాటు అప్రంటీస్‌ షిప్‌ అందిస్తామంటుంది. నియామక ప్రక్రియలో పారదర్శకత, సామా జిక భద్రత కల్పిస్తాం అంటున్నాయి. ఐదువేల కోట్ల రూపాయలతో యువరోప్నీ పేరిట జాతీయ నిధిని ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలో స్టార్టప్ల ఏర్పాటు, సైనిక దళాలలో నియామకాల కోసం మూడు సంవత్సరాల కాంట్రాక్ట్‌ పద్ధతిని ‘అగ్ని వీర్‌’ పథకాన్ని రద్దు చేస్తాం అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగ నిర్మూలనపై ప్రధాన దృష్టి సారించినట్లు ఈ హామీలను బట్టి అర్థమవుతుంది. ఉపాధి, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత విదేశాలకు వలస వెళ్ళడం నివారించబడాలనే ఉద్దేశం కనిపిస్తుంది. బతుకుదెరువు కోసం ప్రాణాలకు తెగించి వివిధ దేశాలలో యుద్ధ సమయాల్లో యుద్ధ భూమికి వెళ్లేందుకు సైతం యువత సిద్ధమవుతుండడం చూస్తుంటే దేశంలో నిరుద్యోగం తీవ్రత ఎంతగా పెచ్చరిల్లిందో తెలియజేస్తుంది. ప్రభుత్వానికి ఇదొక ప్రమాద హెచ్చరిక లాంటిది.
ఇలా దేశంలో నిరుద్యోగం నానాటికి పెరిగిపోవ డంపై ప్రపంచ నివేదికలు సైతం ఆందోళన కలిగిస్తు న్నాయి. ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం 2022లో భారత్‌ లోని యువతలో నిరుద్యోగం 23.22శాతంగా ఉంది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్ల కంటే అది ఎక్కువ. 2022లో దేశంలోని యువతలో నిరుద్యోగ రేటు 45.4%గా ఉందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ అంచనా వేసింది. దేశంలో నిరుద్యోగ రేటు (7.5%) కంటే ఇది ఆరు రెట్లు అధికం. ప్రభుత్వ నివేదిక కూడా నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతుంది. పట్టణ ప్రాంతాలలో 15-29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగ రేటు 17.3% గా ఉన్నదని పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (2023 జూలై- సెప్టెంబర్‌) తెలిపింది. అధికారిక నిరుద్యోగ రేటు 6.6% కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. అలాగే గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన లోకనీతి సి ఎస్‌ డి ఎస్‌ సర్వే ప్రకారం 15-34 సంవత్సరాల వయస్సు భారతీయుల్లో 36% మంది తమను వేధిస్తున్న ప్రధాన సమస్య నిరుద్యోగమే అని తెలిపారు. నిరక్షరాస్యుల్లో 27% నిరు ద్యోగం ఉంటే, పట్టభద్రులు ఆ పై విద్యను అభ్యసించిన వారిలో అది 40 శాతంగా ఉంది.
ఈ సంవత్సరం కొత్తగా ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకొని తొలిసారి ఓటు వేస్తున్న యువతపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. పశ్చిమబెంగాల్‌ లో 1.13 మిలియన్లు, ఒడిస్సాలో 0.75 మిలియన్లు, మహా రాష్ట్రలో 1.02 మిలియన్లు, కేరళలో 0.17 మిలియన్లు, బీహార్‌లో 0.78 మిలియన్లు, ఆంధ్రప్రదేశ్‌ లో 0.53 మిలియన్లు, కర్ణాటకలో 1.03 మిలియన్లు, తమిళనాడు లో 0.53 మిలియన్ల మంది ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకో బోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరు కూటములు తమ ప్రచారంలో యువతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీక రించి, వారిపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగ సమస్యతో విసిగి వేసారిన యువత దేశంలో అనేక చోట్ల, అనేక సార్లు, అనేక రూపాల్లో నిరసన కార్యక్ర మాలు చేపట్టాయి. పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. వీటి ఫలితంగా నిరుద్యోగ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఏకంగా నిరుద్యోగులు పార్లమెంటు ముందే ప్రభుత్వం దృష్టికి వచ్చేలా అనేక నిరసనలు, ఆందోళనలకు దిగినారు. ఇలా దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా మారి యువత జీవితాలు ‘రెంటికి చెడ్డ రేవడిలా’ మారుతున్నాయి. ఒకవైపు దేశంలో అధిక ధరలు, ఇంధన ధరలతో బతుకు గడవడమే కష్టంగా మారుతున్నది. దేశంలో పేదరికం, అసమానతలు, నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని అనేక సర్వేలు హెచ్చరిస్తున్నాయి. పాతికేళ్ల లోపు పట్టభద్రులు 42% నిరుద్యోగులేనని అజీమ్‌ ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయం నివేదించింది. ఈ ఆర్థిక అసమానతల్లో ఇండియా అమెరికానే మించిపోయిందన్న విశ్లేషణలు ఉన్నాయి. నిత్యవ సరాల ధరల దెబ్బకు సగటు జీవితాల ఇంటి బడ్జెట్‌ తలకిందులౌతున్నది. ఈ పరిస్థితుల్లో రైతులు, మహిళలు, యువత, నిరుపేదల ఓట్లే లక్ష్యంగా రెండు కూటములు గ్యారెంటీల పేర్లతో ముందుకు వస్తున్నాయి. సమాజంలోని భిన్న వర్గాలకు న్యాయం చేస్తామంటూ ముందుకు వస్తున్నాయి. ఇలా ఓట్లు పొందుటకు ప్రచార ఆర్భాటాలు, హామీలు, తాయిలాలతో వస్తున్న పార్టీల గతం, వర్తమానం బేరీజు వేసుకొని ఓటర్లు విచక్షణతో స్పందించాల్సిన తరుణమిది. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాధ మిక హక్కుల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. భారతీయ యువత, పౌర సమాజం ఓటింగ్‌ యంత్రాల్లో నిశ్శబ్ద విప్లవం సృష్టించాలి. చీకట్లను చెండాడి ప్రగతి వేకువకు తూర్పు దిక్కు సూర్యోదయంలా.. భారత ప్రజానీకం గెలవాలి.

  • మేకిరి దామోదర్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News