Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Children literature: బాలల కథారచనలో ఒకే శీర్షికతో భిన్న కథనాలు

Children literature: బాలల కథారచనలో ఒకే శీర్షికతో భిన్న కథనాలు

బాలల కథలు రాసేందుకు సలహాలు, సూచనలు

ఒకే కథా ‘శీర్షిక’తో అనేక కథలు రాసుకోవచ్చని గతంలో బాలసాహిత్య పరిషత్‌ అధ్యక్షులు, కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ మనకు ఆణి ముత్యాలలాంటి సూచనలందించారు.ఐతే చాలా మంది వర్దమాన రచయితలు, తెలుగు ప్రభ పాఠకులు నాకు ఫోన్‌ చేసి కొంచెం వివరంగా చెప్పమన్నారు. అందరికోసం ఈవారం ‘నమ్మకం’ అనే శీర్షికతో నేను గతంలో రాసిన రెండు భిన్నమైన బాలల కథలను పరిశీలించండి.
కథ పేరు : నమ్మకం
ఆ టి.వి. మెకానిక్‌ షాపును ఐదుగురు వర్క ర్లతో గత రెండు సంవత్సరాలుగా చక్కగా నడుపుతున్నాడు శ్రీనాథ్‌. వర్కర్లు మారుతున్నా కష్టమర్ల రాకమాత్రం ఏనాటికీ తగ్గలేదు. పైగా పెరుగుతూనే వుంది. అక్కడున్న ఐదుగురు వర్కర్లలో ఆరు నెలల క్రితం చేరిన మురళి మంచి ఉత్సాహ వంతుడే కాకుండా తెలివికలవాడు. అతను ఏమాత్రం టి.వి. రిపేరింగ్‌ గురించి అవగాహన లేకుండానే శ్రీనాథ్‌ వద్ద చేరి పని నేర్చుకుంటూ, పనిచేస్తూ మంచి రిపేరర్గా శ్రీనాథ్‌ చేత మెచ్చుకోబడ్డాడు. శ్రీనాథ్‌కు ఎప్పుడూ కుడి భుజంగా ఉండేవాడు మురళి.
ఒకరోజు రామస్వామి అనే వ్యక్తి శ్రీనాథ్‌ షాపుకొచ్చి తన టి.వి రిపేర్‌ చేయాలన్నాడు. శ్రీనాథ్‌ పైపైన పరి శీలించి ‘బాగా చెడిపోయింది. ఇందులో కొన్ని పార్ట్స్‌ మార్చాలి. ఒక రెండొందలు ఖర్చు పెట్టారంటే మీ టి.వి.కి ఇక ఇప్పట్లో రిపేర్‌ రాదు. అడ్వాన్స్‌ వంద యిచ్చి వెళ్ళండి’ అన్నాడు.
‘రెండొందలా! వంద అడ్వాన్సా! నిన్న ఏదో మా చిన్నోడు ఆ స్విచ్చి, ఈ స్విచ్చి నొక్కితే బొమ్మ కనపడట్లేదు. దానికి రెండొందలా! భలేవాడివే’ అంటూ ఒకసారి టి.వి.లు రిపేరు చేస్తున్న ఆ ఐదుగురి వంక చూసాడు. రామస్వామి దష్టి మురళిపై పడింది. చురుకుగా, ఉత్సాహంగా పనిచేస్తున్న మురళిని చూసి ఏదో ఆలోచించి, టి.వి.ని సైకిల్‌ వెనుక పెట్టుకుంటూ ‘అసలు ఈ రిపేర్లందరూ ఇంతే. ఏదో పోతే అది పోయింది, ఇది పోయింది.. అంటూ నాలుగు పేర్లు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతారు’ అని గొణుక్కున్నాడు.
ఆ రోజు రాత్రి షాపు నుంచి తిరిగి సైకిలు మీద ఇంటికి పోతున్నాడు మురళి. అతని కోసమే ఎదురు చూస్తున్న రామస్వామి మురళిని ఆపాడు. ‘చూడు బాబూ! నన్ను పొద్దున మీషాపులో చూసే వుంటావు. నా టి.వి.ని రిపేరు చేయడానికి రెండొందలు అడిగాడు శ్రీనాథ్‌. అది మీరు బాగుచేస్తే మీకు పాతిక కూడా ఇవ్వడు. కష్టపడి పనిచేసేది మీరు సంపా దించుకొని కూడబెట్టేది మీ ఓనరు. నువ్వు నా టి.వి బాగుచేస్తే, నీకే యాభై రూపాయలిస్తా. నువ్వు సరేనంటే ఇప్పుడే మీ ఇంటికి తీసుకొస్తా’ అంటూ మురళి కళ్లలోకి చూసాడు రామస్వామి.
‘లేదండి! నేను ఆ పాతిక సంపాదిస్తున్నానంటే అది మా ఓనరుగారి చలువే. ఏమాత్రం అవగాహన లేని నన్ను తను చేరదీసి విద్య నేర్పిస్తూ, పని చూపిస్తూ చేతికి డబ్బులిచ్చారు. ఈనాడు నన్నొక మంచి రిపేరర్‌గా తీర్చి దిద్దారు. మీకు ఆయనగూర్చి సరిగా తెలిసుండకపోవచ్చు. మీ టి.వి నిజంగానే బాగా చెడిపోయింది. ప్రస్తుతానికైతే మీరన్నట్లు దాన్ని రెండు నిమిషాల్లో బాగుచేయవచ్చు. కానీ అది రేపు చెడిపోయినా ఆశ్చర్యపడక్కరలేదు. ఆయన వద్దకు సర్వీసుకొస్తే దాన్ని తిరిగి చెడిపోకుండా చూడాలన్నది ఆయన లక్ష్యం. అందుకే పార్ట్స్‌ మార్చి బాగుచేస్తానన్నారు. ఇకపోతే నేను ఆయన వద్ద పనిచేస్తూ ఆయన్ను అవమానపరచలేను. ఆయన కాదన్నది నేను చేస్తే ఆయనకు నేను విలువ ఇవ్వనట్లే నాకు మీరిచ్చే యాభై రూపాయలకన్నా, ఆయనకు నామీద ఉన్న నమ్మకం విలువ ఎక్కువ’ అంటూ సైకిలుపై ముందుకు పోతుంటే ‘శభాష్‌!’ అంటూ చప్పట్లు కొట్టాడు రామస్వామి.
‘నేను, శ్రీనాథ్‌ పార్టనర్స్‌గా ఒక పెద్ద టి.వి షోరూమ్‌ అండ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ పెట్టబోతున్నాం. శ్రీనాథ్‌కు నీపై నమ్మకముండి నీ పేరు సూచిస్తూ నీకు ఆ షోరూమ్‌ బాధ్యత అప్పగిస్తానన్నా, నాకు నీపై నమ్మకం లేక ఆలోచించి ఈ పథకం వేసాను. వచ్చే వారం పట్నంలో ఓపెన్‌ చేసే మా షోరూమ్‌ నువ్వే చూసుకోవాలి. నీ జీతం కూడా పెంచు తాం’ అంటుంటే మురళి మరోసారి తన గురువువైన శ్రీనాథ్‌కు పట్టరాని సంతోషంతో మనసులోనే కతజ్ఞతలు తెలుపుకున్నాడు.
నేను రాసినపై కథ ‘బాలమిత్ర’ మార్చి-1998 సంచికలో అంటే 26 సంవత్సరాల క్రితం ప్రచు రించబడింది. పై కథకు పూర్తి భిన్నంగా అదే శీర్షికతో రాసిన క్రింది కథను పరిశీలించండి.

- Advertisement -

కథ పేరు : నమ్మకం
శివాలయానికి ఇరుప్రక్కల శివయ్య, శంకరయ్య అనే ఇద్దరు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఈ పెట్టుకొని చిన్నపాటి వ్యాపారాన్ని సాగిస్తూ వుండేవారు. శివాలయం ఎల్లప్పుడూ భక్తులతో నిండి వుండేది కాబట్టి కొబ్బరి కాయలు చాలా బాగా అమ్ముడుపోతూ వుండేవి.
శివయ్య శివపూజకు కావలసిన సామగ్రి భక్తులకు అమ్మేవాడే కానీ ఏనాడు శివాలయానికి వెళ్ళలేదు. అందుకు కారణం ఎవరైనా అడిగితే తనకు భగవంతుని మీద నమ్మకం లేదని చెబుతాడు. శంకరయ్య మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే శివాల యంలో శివుని దర్శించుకున్నాకే ఏ పనైనా మొదలు పెట్టేవాడు.
కాని వ్యాపారంలో ఇద్దరూ ఒకే విధంగా సంపాదిం చారు. దాంతో శంకరయ్యలో కాస్త విచారం చోటు చేసు కుంది. తను ప్రతిరోజూ ఉదయాన్నే శివాలయంలో శివుని దర్శించుకుని తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగేలా చూడమని ప్రార్దించుకుంటూ, శివయ్య కన్నా ఎక్కువ సంపాదించేలా చూడమని గాఢంగా కోరు కునే వాడు శంకరయ్య.
కానీ శివయ్య ఏనాడూ శివాలయంలోకి ప్రవేశించ కున్నా కూడా అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతూనే వుండేది. అది చూసి ఓర్వలేక పోయేవాడు శంకరయ్య. తను ఇంతగా ప్రార్దిస్తున్నా కూడా శివుడు తన కోరిక తీర్చలేదని బాధపడేవాడు.
ఒకరోజు శివాలయానికి కాశీ నుంచి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన మూడు రోజులు ఆ శివాలయంలో భజనలు కొనసాగిస్తూ భక్తులకు నీతి వాక్యాలు, సూక్తులు చెబుతున్నాడు. భక్తులు తమ తమ బాధలను స్వామీజీకి వెళ్ళడించుకొని వాటి నుంచి విముక్తి పొందే మార్గాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
శంకరయ్య కూడా స్వామీజీని దర్శించుకొని తన మనోవ్యధను ఆయన ముందు యిలా వెళ్ల గ్రక్కుకున్నాడు.
‘స్వామీ! నేను శివభక్తుడను. నాతోపాటు కొబ్బరి కాయల వ్యాపారం చేసే శివయ్య ఏనాడూ శివాలయాన్ని దర్శించిన పాపాన పోలేదు. కానీ ఇద్దరి వ్యాపారం ఒకేలా సాగుతోంది. భగవంతుడు నన్ను చాలా చిన్నచూపు చూస్తున్నాడనిపిస్తోంది’
అందుకు సమాధానంగా స్వామీజీ చిన్నగా నవ్వి ‘నాయనా! నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే రేపు నన్ను కలువు’ అంటూ శంకరయ్యని దీవించి పంపారు.
మరుసటిరోజు ఉదయాన్నే శివుని దర్శించుకొని, అటు పిమ్మట స్వామీజీ దర్శనం చేసుకొని ‘స్వామీ! నా ప్రశ్నకు సమాధానం దొరికిందా?’ అని అడిగాడు శంకరయ్య.
ఆ మాటకు స్వామీజీ చిన్నగా నవ్వి
‘నాయనా! నిన్న సాయంత్రం కోనేరుకు వెళుతూ శివయ్యను, నిన్నూ కూడా బాగా పరిశీలించాను. శివయ్యకు శివునిపై భక్తిలేని మాట ముమ్మాటికీ వాస్తవమే. అతనికి భగవంతునిపై నమ్మకం లేదు. కానీ తను చేస్తున్న వ్యాపారంపై పూర్తి నమ్మకముంది. తను చేస్తున్న వ్యాపారాన్నే నమ్మకంగా భావించి తెలివితేటలతో, శ్రద్ధగా శ్రమపడుతూ న్యాయంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ‘కష్టే ఫలే’ అన్న సామెతను నమ్మాడు. కానీ నీవు వ్యాపారంపైకన్నా భగవంతునిపై శ్రద్ధ ఎక్కువ చూపుతున్నావు. నిన్ను ఆ భగవంతుడు రక్షిస్తే, శివయ్యను వ్యాపారం రక్షిస్తోంది’ అంటూ శంకరయ్య కళ్ళలోకి సూటిగా చూశారు స్వామీజీ. స్వామీజీ ఉపదేశంతో అసలు విషయం గ్రహించిన శంకరయ్య స్వామీజీ పాదాలకు భక్తితో నమస్కరించాడు.
తన తప్పుని దయతో క్షమించమని శివుడ్ని కోరు కున్నాడు. పై కధ బాలమిత్ర జులై -1997 సంచికలో అంటే 27 సంవత్సరాల క్రితం ప్రచురితమైంది.
పై రెండు కథలూ ఒకే శీర్షికతో ఉన్న రెండు పూర్తి భిన్న కథనాలు.ఇలా మీరు కూడా ఎన్ని కోణాలలో ఆలోచిస్తే అన్ని కొత్త కథల్ని సులువుగా రాసుకోవచ్చు.
(వచ్చే వారం బాలల కథారచనకు చెందిన మరి కొన్ని కిటుకులు తెలుసుకుందాం.)

-పైడిమర్రి రామకృష్ణ
కోశాధికారి – బాలసాహిత్య పరిషత్‌
92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News