Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Jadcherla: పాలమూరులో బిజెపి గెలుపు ఖాయం

Jadcherla: పాలమూరులో బిజెపి గెలుపు ఖాయం

29న మక్తల్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం

అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ను పాలమూరు ప్రజలు నెరవేరుస్తారని, పాలమూరు అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ కోరారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా జడ్చర్ల పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని అన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని, వంద రోజుల్లో ఇచ్చిన ఆరు హామీలు అమలు చేస్తామని, ఇప్పుడు 17 పార్లమెంటు సీట్లు గెలిస్తే అమలు చేస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీకే ఓటు వేస్తామని ప్రజలే స్వతహాగా చెబుతున్నారని, పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానని డీకే అరుణ పేర్కొన్నారు. ఉద్యోగులకు పిఆర్సి, కానిస్టేబుల్ లకు టిఏ హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది అన్న సాకుతో తప్పించుకోవాలని చూస్తుందన్నారు.

- Advertisement -

రైతుబంధు ఏమైంది ఎప్పటిలోగా ఇస్తారు ఎంతమందికి ఇస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈనెల 29 నుంచి మక్తల్ నియోజకవర్గ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుందని, ఎవరిని కదిలించిన ఈసారి మోడీకే మా ఓటు అని ప్రజలు స్వయంగా చెప్తున్నారని అన్నారు. ఇంట్లో పెద్ద మనిషిని చూసి పిల్లను ఇచ్చినట్టే ప్రధాని నరేంద్ర మోడీని చూసే ఈ దేశ ప్రజలు మా అభ్యర్థులకు, మాకు ఓట్లు వేస్తారని, పాలమూరు అభివృద్ధికై తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, సామల నాగరాజు, బుక్క నవీన్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాహితీ రెడ్డి, సీతారాం జవార్, ఎడ్ల బాలవర్ధన్ గౌడ్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News