ఈసాయంత్రం మరోమారు టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారు జామునే వచ్చిన భూకంపంలో ఇప్పటికే 1,400 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం చెబుతుండగా ఇంకా సహాయక చర్యలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈలోగా మరోమారు సాయంత్రం ఇక్కడ భారీ భూకంపం వచ్చింది. మొదటి భూకంపం తీవ్రత 7.8 గా రెక్టర్ స్కేల్ చూపించింది. ఇప్పుడు తాజాగా వచ్చిన భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది. దీంతో సహాయక చర్యలు దాదాపు స్ధంభించిపోయాయి. మరోవైపు చీకటి కూడా పడనున్న నేపథ్యంలో టర్కీలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురుకానున్నాయి. టర్కీలోని ప్రధాన నగరాల్లోని మేడలు, బహుళ అంతస్థుల భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి.
భవన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్నవారు ఆపన్నహస్తం కోసం అర్రులు చాచుతుంటే టర్కీ, సిరియాల్లో చావు కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి.