అమెరికా తీరంలో తిరుగుతున్న చైనా నిఘా బెలూన్లను అమెరికా కూల్చే యడం ఈ రెండు దేశాల సంబంధాలను మరింత దెబ్బ తీశాయి. చైనా తన ఆగ్రహావేశాలను ఒకటి రెండు మాటలకు పరిమితం చేసి ఉండవచ్చు. కానీ, చైనా అంత తేలికగా మరచిపోయే దేశం కాదు. మరో దారిలో ఇది చైనా మీద విరుచుకు పడే అవకాశం ఉంది. చైనా ఈ విధంగా నిఘా బెలూన్లను ప్రయోగించడం ఇదే మొదటి సారి కాదు. కానీ, ఇంత అధునాతనమైన బెలూన్‌ను ప్రయోగించడం మాత్రం ఇదే మొదటిసారి. సెంట్రల్ అమెరికాలోనూ, దక్షిణ అమెరికాలోనూ మరికొన్ని చైనా నిఘా బెలూన్లు తిరుగుతున్నట్టు ఇప్పటికే సమాచారం అందింది. చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న భారత్ కూడా చైనా నిఘా బెలూన్ల విషయంలో అత్యంత అప్రమ త్తంగా ఉండాల్సిన అవసరం ఉందని దీనిని బట్టి అర్థం అవుతోంది. భారత్ అంటే ఏమాత్రం గిట్టని, భారత్ తనకంటే అభివృద్ధి చెందడం ఏమాత్రం సహించని చైనా తన నిఘా బెలూన్లను భారత్ గగన తలంలోకి ప్రయోగించకుండా ఊరుకుంటుందని ఆశించలేం.
ఇరుగు పొరుగు దేశాలపై నిఘా పెట్టడం వంటి విషయాల్లో చైనా ఎప్పటికప్పుడు అత్యంత ఆధునిక టెక్నాలజీలను అనుసరిస్తుంటుంది. గత ఏడాది పరిశోధన నౌక అనే మిషతో చైనా శ్రీలంకలోని హంబన్ టోటా రేవుకు ఇదే విధంగా ఒక నిఘా నౌకను పంపించింది. చైనా నిఘా సామర్థ్యం ఆయేటికాయేడు శ్రుతి మించుతున్న విషయం ఆ సమయంలోనే వెలుగులోకి వచ్చింది. ఈసారి కూడా చైనా ఈ నిఘా బెలూన్ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిందని, అది పొరపాటున దారి తప్పి అమెరికా తీరంలోకి ప్రవేశించిందని బుకాయించింది. నిజానికి ఈ నిఘా బెలూన్లలు అతి పటిష్ఠమైన అమెరికా సైనిక ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ఈ బెలూన్లను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేసిన వార్త తెలిసినప్పుడు చైనా స్పందించిన తీరును బట్టి అవి వాతావరణాన్ని అధ్యయనం చేసే బెలూన్లు కావని అర్థమై పోయింది.
జిన్పింగ్ సారథ్యంలోని నియంతృత్వ పాలనలో చైనాలో ప్రభుత్వ ఆస్తులకు, పౌర ఆస్తులకు మధ్య తేడా లేకుండా పోయింది. పౌరులకు, సైన్యానికి, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సన్నటి రేఖ ఏనాడో తుడిచిపెట్టుకుపోయింది. పౌరులు తమ సొంత ప్రయోజనాల కోసం తయారుచేసుకున్న వస్తువులు, లేదా కొనుక్కున్న వస్తువులను కూడా అక్కడి ప్రభుత్వ అధికారులు తమకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంటే, చైనా ప్రభుత్వానికి మరే దేశంలోనూ లేనన్ని నిఘా అవకాశాలు చేతికి అంది వస్తున్నాయన్న మాట. నిఘాలకు, సమాచార సేకరణకు, రహస్యాలను వినడానికి చైనా ప్రభుత్వం ముందు అనేకానేక మార్గాలున్నాయి. ఇతర దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి ఇరుగు పొరుగు దేశాలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మొత్తానికి, ఇతర దేశాల మీద నిఘా పెట్టడానికి చైనా తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. 2020లో షెంఘన్‌లోని ఒక టెక్నాలజీ సం బంధిత సంస్థ భారతదేశంలో సుమారు పది వేల మంది ప్రముఖులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఇది దర్యాప్తులో వెల్లడైంది. తాము తమ నిఘా వ్యవస్థలను ఆధునికం చేయాల్సిన, పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని భారత్ ఆనాడే గుర్తించింది. చైనా నిఘా చర్యలను తిప్పి కొట్టగలిగిన నిఘా వ్యవస్థను సమకూర్చుకోవడానికి భారత్ అప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి చైనా ఇతర దేశాల మీద నిఘాకు బెలూన్లను ఉపయోగిస్తుందనే సంగతిని భారత్ ఏమాత్రం ఊహించలేకపోయింది. ఈ విధమైన బెలూన్ల వల్ల వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు, త్యంత పటిష్ఠంగా నిఘా చర్యలు కూడా చేపట్టవచ్చు. చైనా పథకాలను, వ్యూహాలను తిప్పికొట్టడానికి అమెరికా సహాయంతో భారత్ వెంటనే పోటీ నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది.
– జి. రాజశుక