టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ధాటికి 4,300 మందికి పైగా మరణించారు. నిన్న 24 గంటల్లో మూడుసార్లు భారీ భూకంపం సంభవించటంతోపాటు..పదేపదే భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం అతిపెద్ద సవాలుగా మారింది. ఇంకా భవనాల శిథిలాల్లో ప్రాణాలతో ఉన్నవారి సంఖ్య చాలానే ఉంటుందని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.
టర్కీ-సిరియా సరహద్దుల్లో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాలు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తిన్నాయి. కాగా ప్రపంచ దేశాలన్నీ తక్షణ సాయం అందచేసి, ఆపన్నహస్తం అందించేందుకు కదులుతున్నాయి. రెండు దేశాల్లోని పలు నగరాల్లో 5,600కుపైగా భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మృతుల సంఖ్య 20,000 దాటేలా ఇక్కడి పరిస్థితులున్నాయి. గాయపడ్డ వారి సంఖ్య 11,000 మందికి పైగా ఉండచ్చని అంచనా వేస్తున్నా ఈ లెక్క ఇప్పట్లో తేలేలా పరిస్థితులు కనిపించటం లేదు.