Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్MP elections in Telangana: తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పదా?

MP elections in Telangana: తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పదా?

జంపింగ్ జాక్ లతో మారుతున్న సీన్

తెలంగాణలో పదేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌)కు రాజకీయంగా గ్రహణం పట్టినట్టు కనిపిస్తోంది. అసలే ఓటమి భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ పార్టీ భారీ వలసలతో కుంగి కృశించిపోతోంది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా భీకర పోరాటం తప్పదని ఆశించిన ప్రజలను ఈ ఎన్నికలు నిరాశపరిచే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 39 శాతం ఓట్లు సంపాదించుకోగా, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బి.ఆర్‌.ఎస్‌ పార్టీ 37 శాతం ఓట్లతో ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ తన ఓటు శాతాన్ని ఏకంగా 14 శాతం పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సంపాదించుకున్న బి.ఆర్‌.ఎస్‌ పార్టీ సుమారు 10 శాతం ఓట్లు కోల్పోయింది. అయితే, బి.ఆర్‌.ఎస్‌ పార్టీకి రావలసిన ఓట్లలో అత్యధిక భాగం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు వెళ్లిపోయినట్టు అర్థమవుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో చాలా భాగం ఓట్లను బీజేపీ చేజిక్కించుకోగా, ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగాన్ని కాంగ్రెస్‌ పార్టీ సంపాదించుకోగలిగింది.
రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రభుత్వం పట్ల, పాలన పట్ల ప్రజల దృక్పథంలో మార్పు రావడం ప్రారంభించింది. దళిత నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క 2016లో అప్పటి కె. చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం నిర్మించిన ముఖ్యమంత్రి నివాసాన్ని తన అధికార నివాసం చేసుకున్నారు. పైగా, ఈ భవనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీనికి మహాత్మా జ్యోతీరావు ఫూలే ప్రజా భవన్‌ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్‌ రావు ఉన్న సమయంలో ఈ ప్రగతి భవన్‌ సాధారణ ప్రజానీకానికి ఏమాత్రం అందుబాటులో ఉండేది కాదు. మొదటిసారి కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగానూ, ఆరోగ్యశాఖ మంత్రి గానూ వ్యవహరించిన టి. రాజయ్య అనే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి మొదటి ఏడాదే బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కూడా దాదాపు అదే రీతిలో అవమానించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వాగ్దానం ఎన్నికల నియమావళి కారణంగా ఇంతవరకూ అమలు కానప్పటికీ, రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరగడం లేదు. ప్రభుత్వ పరిమితులను అర్థం చేసుకుని వారు కొంత కాలం పాటు నిరీక్షించే అవకాశం ఉంది.
కాగా, కె.సి.ఆర్‌ కు అత్యంత సన్నిహితులు, సలహాదార్లుగా పేరున్న కడియం శ్రీహరి, కె. కేశవరావు వంటి ఉద్దండ నాయకులు ఇటీవల బి.ఆర్‌.ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో సహజంగానే ఆ పార్టీ మరింతగా కుంగి కృశించిపోయి నట్టయింది. ఏడు దశలుగా జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో 9 సీట్లను, 42 శాతం ఓట్ల వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్న బి.ఆర్‌.ఎస్‌ లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్పిన మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. 2018 ఎన్నికల్లో 7 శాతం ఓటు వాటా సంపాదించిన బీజేపీ గత శాసనసభ ఎన్నికల్లో 14 శాతం ఓట్లను కూడగట్టుకోగలగడాన్ని తీసిపారేయకూడదు. అంటే, ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బి.ఆర్‌.ఎస్‌ పార్టీలకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో లోక్‌ సభ ఎన్ని కల్లో త్రిముఖ పోటీ ఏర్పడబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లమీన్‌ ఇప్పటికీ ప్రభావశీలమైన పార్టీయే కానీ, ఈ పార్టీ ఇంతవరకూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం గమనించాల్సిన విషయం. ఒవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మినహా రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో ఆయన మద్దతుదార్లు ఎవరికి ఓటు వేస్తారన్నది వేచి చూడాల్సిన విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News