జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం ఓ రాజకీయ పార్టీ నేత డాన్స్ చేసిన ఘటనలో పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా ఉండి, విధి నిర్వహణలో అలసత్వం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాఎస్పీ కిరణ్ ఖరే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ను మహదేవపూర్ పోలీస్ స్టేషన్ నుంచి (వెకెన్సీ రిజర్వు) కు బదిలీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహించొద్దని అన్నారు. ప్రజల్లో పోలీసు శాఖపై ప్రతిష్ఠ పెంచే విధంగా పనితీరు ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.
యోగా,వ్యాయామం ఆరోగ్య జాగ్రత్తల కోసమే వివరించా… గుడాల శ్రీనివాస్
రాజకీయాలతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారు చాలా మంది కూడా ఒత్తిళ్లకు గురువుతున్నారని రిలాక్స్ అయ్యేందుకు యోగాతో పాటు కొన్ని పద్దతుల ద్వారా ఉల్లాసాన్ని పొందవచ్చని కొంతమంది సలహా ఇచ్చారన్నారు. ప్రజలతో మనశ్శాంతిగా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పడంతో… ఒత్తిడి నుండి ఉపశమనం గురించి తాను అందరికి వివరిస్తూ వెల్తున్న క్రమంలో సోమవారం మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్ చేశానన్నారు. స్టేషన్ అధికారి ఒకరు అక్కడ ఉండడం వల్ల అతనికి ఉల్లసంగా ఉండడమేలా అని వివరించేందుకు వ్యాయామం చేయాలంటే, డ్యాన్స్ ద్వారా కూడా చేయవచ్చని వివరించానని అన్నారు. దీనివల్ల ఆరోగ్యం బావుండడంతో మానసికోల్లాసం ఉంటుందని చెప్పి వారిలో అవగాహన కల్పించేందుకే డ్యాన్స్ చేశానని గుడాల శ్రీనివాస్ వెల్లడించారు. ఈ వీడియో కూడా తానే తీయించి నలుగురికి తెలియాలని వైరల్ చేశానని, కొంతమంది దుష్ప్రచారం చేశారన్నారు. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోగ్యమే మహాభాగ్యం అన్న భావనతోనే తానీ వీడియో తీశానని తెలిపారు.