Friday, November 22, 2024
HomeదైవంIllanthakunta: భక్త జనసంద్రంగా ఇల్లందకుంట రాములోరి ఆలయం

Illanthakunta: భక్త జనసంద్రంగా ఇల్లందకుంట రాములోరి ఆలయం

కమనీయం రమణీయం శ్రీ సీతారాముల కల్యాణం

సుగంధ పరిమళ పుష్పాలంకృతులైన శ్రీ సీతారాములను కళ్యాణ వేదికపై కొలువు తీరగా, అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వేద పండితుల వేద మంత్రాలతో శ్రీ సీతారాముల కల్యాణం కనుల పండుగగా జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, వేద పండితులు సీతారామాచార్యుల అధ్వర్యంలో శ్రీ సీతారాముల ఎదురుకోళ్ల వేడుకను వైభవంగా నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదిక వద్దకు రామనామ స్మరణతో తీసుకువచ్చారు.

- Advertisement -

కల్యాణ ప్రాంగణమంతా శ్రీరామనామ అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది. సుమారు 80 వేల మంది భక్తులు కల్యాణ వేడుకకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సుమారు రెండు గంటలపాటు కల్యాణ వేడుకను నిర్వహించగా భక్తులు ఆసక్తిగా తిలకించారు.

సీతారాముల కళ్యాణానికి ముందు సీతారాములను ఆలయంలో రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణానికి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డిఓ రమేష్ బాబు, స్థానిక తహసిల్దార్ రాణి, ఆలయ ఈవో కందుల సుధాకర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు హాజరై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.


✳️ అన్నదానం, మజ్జిగ పంపిణీకి విశేష స్పందన…
శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా జమ్మికుంట రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం, దాతల చేయూతతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాలకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది.

✳️నిత్య అన్నదానం మంచి కార్యక్రమం…జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
ఇల్లందకుంటలో అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తులకు, పలు కార్యక్రమాలకు హాజరయ్యే వారికి నిత్య అన్నదానం చేయడం చాలా మంచిదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం స్వామివారి కళ్యాణానికి హాజరై నిత్య అన్నదాన సత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నదాన కార్యక్రమంపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, నిత్య అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షుడు ఎలుగూరి రమేష్, అధ్యక్షుడు కాసం నగేష్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News