Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Nation Future: బడ్జెట్లు సరే, భవిష్యత్తు మాటేమిటి?

Nation Future: బడ్జెట్లు సరే, భవిష్యత్తు మాటేమిటి?

వార్షిక బడ్జెట్‌ అంటే ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన ఆర్థిక నివేదిక అనేది అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021 ఫిబ్రవరిలో సమర్పించిన వార్షిక బడ్జెట్‌ కేంద్రంలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆమె పదవికి భంగం కలగబోతోందన్న వదంతులకు ఇది తెరదించింది. అయిదవ వార్షిక బడ్జెట్‌ వరకూ వచ్చేసరికి ఆమె ఒక తిరుగు లేని ఆర్థికమంత్రిగా స్థిరపడిపోయారు. ఈ బడ్జెట్‌లో సంఖ్యలు ఎక్కువ, వాగ్దానాలు తక్కువ. అందువల్ల ఆమె పదవికి ముప్పు లేకుండా పోయింది. తాజా బడ్జెట్‌ను ఆసాంతం పరిశీలించిన వారికి ఎన్నికల సమయంలో కూడా కేంద్రం జనాకర్షణ పథకాలకు పెద్ద పీట వేయలేదని, పైపెచ్చు ప్రాథమిక సదుపాయాల కల్పనకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని అనిపించడం సహజం. నిజానికి ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం కొన్ని జనాకర్షక పథకాలు ఈ బడ్జెట్‌లో చేర్చి ఉండవచ్చు. కానీ, దేశాభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిందే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఈ బడ్జెట్‌ చెప్పకనే చెప్పింది.
అయితే, ఇక్కడొక విషయం గమనించాలి. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులు ఏ రకమైన ఫలితాలను ఇచ్చాయి? ఈ కేటాయింపులు ఎంత వరకూ అమలయ్యాయి? బడ్జెట్‌ లో ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు ఎంత వరకూ అమలయ్యాయి? ఆర్థిక నిపుణులు, ఆడిటర్లు కూర్చుని ఈ అంశాలను అతిజాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇటువంటి అంశాల పరిశీలనకు నిజానికి ఆర్థిక నిపుణులే అక్కర లేదు. ఆ బడ్జెట్లలో జరిగిన కేటాయింపులకు, వాటి అమలుకు మధ్య చాలా తేడా ఉందనే సంగతి ఎవరికైనా తేలికగా అర్థమైపోతుంది. ఆ కేటాయింపులు, అమలు తీరుతెన్నులను బట్టి ప్రభుత్వమే తన తీరు మార్చుకోవచ్చు. బడ్జెట్‌ ఫలితాలు లేదా కేటాయింపుల ఫలితాలు ఆశించిన స్థాయిలో నెరవేరి ఉంటే ఇప్పుడు ఎన్నికల రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరమే ఉండదు. భారతదేశంలో పన్ను చెల్లించనివారు లబ్ధి పొందుతున్నంతగా పన్నులు చెల్లించే వారు లబ్ధి పొందడం లేదన్న పరమ సత్యం కూడా కళ్లకు కడుతుంది.
అవే ప్రశ్నలు, అవే జవాబులు
కొత్త బడ్జెట్‌ విషయానికి వస్తే, ఇది ఎవరికీ హాని కలిగించని బడ్జెట్‌గా ఆర్థిక విశ్లేషకుల గుర్తింపు పొందింది ఇందులో కొద్దిగా ‘ఆత్మనిర్భర్‌ జి.డి.పి’కి ఉపయోగపడే అంశాలున్నాయి. అంతేకాదు, దేశీయ వినియోగానికి కూడా ఎక్కువగానే అవకాశం ఇచ్చింది. మున్ముందు ద్రవ్య లోటు గణనీయంగా తగ్గిపోతుందని బడ్జెట్‌లో వాగ్దానం చేయడం జరిగింది. నిజానికి, ద్రవ్య లోటు ఆందోళనకర స్థాయిలోనే ఉంది. ద్రవ్యలోటును దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌ నుంచి పెద్దఎత్తున రుణ సేకరణ జరుగుతోంది. దీనిని గణాంక వివరాలతో చెప్పాలంటే, రోజుకు అక్షరాలా 4,227 కోట్ల రూపాయల రుణ సేకరణ జరుగుతుండగా, దాని మీద రోజుకు 2,958 కోట్ల రూపాయల మేరకు వడ్డీ చెల్లించడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరంగా అనిశ్చిత పరిస్థితులున్నా, రష్యా-ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతున్నా దేశంలో మాత్రం అభివృద్ధి నిలకడగా కొనసాగుతుందని, ఆర్థిక స్థితిగతులకేమీ భంగం కలగదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే, ద్రవ్యలోటు ఒకపక్క, రుణ సేకరణ మరొకపక్క తీవ్రంగా ఆందోళన కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
బడ్జెట్‌లో కేవలం గణాంకాలు మాత్రమే కాదు, విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇం కా అనేకం ఉంటాయి. ఈ నిర్ణయాలకు, కార్యక్రమాలను వ్యక్తులు, సంస్థల నుంచి ఏవిధమైన స్పందన లభిస్తోందో కూడా గమనించాలని ఆర్థిక శాస్త్రం చెబుతోంది. బడ్జెట్‌ అంటే కేవలం కేంద్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. రాష్ట్రాలకు కూడా ఇందులో ప్రమేయం ఉంటుంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అయినందువల్ల రాష్ట్రాల సహాయ సహకారాలు కూడా కేంద్రానికి చాలా అవసరం. రాష్ట్రాలు సహాయపడితే జీడీపీ పెరగడమో, స్థిరంగా ఉండ డమో జరుగుతుంది. రాష్ట్రాల నుంచి ఆశించిన సహాయం అందని పక్షంలో జీడీపీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. అంటే, కేంద్రం చేసే కేటాయింపుల వల్ల రాష్ట్రాల్లోనే విధానాలు, నిర్ణయాలు అమలు జరగాల్సి ఉంటుంది. అందువల్ల, కేంద్రం సమర్పించే ప్రతి బడ్జెట్‌ తప్పనిసరిగా భవిష్యత్తు మీదే దృష్టి పెట్టాలి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలకు కాలయాపన పెద్ద ముప్పుగా మారుతుంది. దేశ భవితవ్యానికి, దేశ అభివృద్ధికి సంబం ధించిన ఆలోచనలను వెనువెంటనే అమలు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం కాలయాపన జరిగినా, పెండింగ్‌లో ఉంచినా విజయావకాశాలు అడుగంటిపోవడం ఖాయం.
ఏ కొద్ది స్వార్థ ప్రయోజనాలతో లేదా ఎన్నికల ప్రయో జనాలతో వ్యవహరించినా దేశ ప్రయోజనాలు స్తంభించిపోతాయి. గత కాలపు అనుభవాల నుంచి పాఠాలు నేర్చు కోవడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఇందులో ఒకటి అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా కార్యక్రమాలను కొనసాగిస్తూ పోవడం. రెండవది, వాటికి సంబంధించిన స్పందనను తెలుసుకుంటూనే ఉండడం. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని కేటాయింపులు ఏమయ్యాయి అనే ఆలోచన కలగక మానదు. ఆ కేటాయింపులు ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి? వీటివల్ల ఎంత మంది, ఎన్ని రంగాలు లబ్ధి పొందాయి? ప్రతి ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమేనా లేక వాటి ఫలితాలను బేరీజు వేసే ఆలోచన ఏదైనా ఉందా?
ఫలితాలు, ప్రభావాలపై సర్వే
అయిదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అనేక కేటా యింపులతో పాటు ఎన్నో వాగ్దానాలు జరిగింది. ఆశ పరిస్థితి, చేయడం కూడా వాగ్దానాలన్నీ నెరవేరి ఉంటే, కనీసం అందులో సగం వాగ్దానాలైనా ఆచరణకు వచ్చి ఉంటే దే దేశ ‘భవిష్యత్తు ఇంతకన్నా ఉత్తమంగా ఉండాలి కదా? అలా ఎందుకు జరగలేదు? జరగకపోవడానికి కారణాలేమిటి? ఏవైనా లోపాలు చోటు చేసుకుని ఉంటే వాటిని సరిదిద్దడం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటు న్నారు? కోట్లాది రూపాయల మేరకు పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని ఖర్చు చేయడం జరుగుతోంది కదా? ఆ డబ్బు ఏమైనట్టు? ఎటువంటి ఫలితాలను ఇచ్చాయి? 2017 బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని అద్భుతమైన ఆలోచన లను, నిర్ణయాలను వెల్లడించింది. రాష్ట్రాలతో కలిసి ఒప్పంద వ్యవసాయాన్నిప్రవేశపెట్టబోతున్నట్టు ఆ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ఒక ఆధునిక చట్టాన్ని తీసుకు వస్తామని కూడా వెల్లడించింది. దేశంలోని 50 వేల పేద పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అంత్యోదయ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా ప్రభుత్వం ఆ బడ్జెట్లో ప్రకటించింది. ఇక, కార్మిక చట్టాలను పటిష్ఠం చేయబోతున్నట్టు కూడా వెల్లడించింది. ఇవన్నీ ఏమయ్యాయి? ఇంతవరకూ వాటి అతీగతీ లేదు.
విచిత్రమేమిటంటే, కొన్ని పథకాలు, కార్యక్రమాలు కొత్త కొత్త పేర్లతో మళ్లీ మళ్లీ దర్శనం ఇస్తుంటాయి. సమస్య ఒక్కటే. కానీ, పథకాలు మాత్రం మారుతుంటాయి. రాష్ట్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి ఉద్దేశించిన ఉదయ్‌ అనే పథకం ప్రతి ఏటా ఇదే విధంగా కొత్త రూపం సంతరించుకుంటూ వస్తోంది. ఉచితాలు, చౌర్యాలు, లీకేజీల వల్ల విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపో తున్నాయి. వీటిని ఉద్ధరించే కార్యక్రమం ప్రతి ఏటా వెనుకబడిపోతోంది. బడ్జెట్‌ ప్రసంగాలలో చేసే వాగ్దానాలకు, వాటి ఆచరణకు మధ్య ఉన్న అంతరం రానురానూ పెరిగిపోతోంది. ఫలి తంగా బడ్జెట్‌ వాగ్దానాల మీద ఒకపక్క ఆశలు పెరుగుతున్నా మరోపక్క సందేహాలు కూడా ఆవహిస్తున్నాయి. మరొక విచిత్రనమేమిటంటే, కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలనెన్నిటినో ప్రవేశపెడుతూనే ఉంటుంది. కానీ, సంస్కరణలకు మాత్రం అవకాశం ఇవ్వదు. సంస్కరణలు లేని ఆర్థిక వ్యవస్థలో సామర్థ్యం పెరిగే అవకాశం ఉండదు.
జాతీయ లక్ష్యాలకు సరైన సంస్కరణలు తోడైతే, రాష్ట్రాలు అతి వేగంగా పురోగతి చెందడానికి, కేంద్రం విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. పాలకులు ఎందుకు దేని మీద ఎంత వరకు శ్రద్ధ పెడతారన్నది అంతుబట్టని విషయం. దేని మీద శ్రద్ధ పెడతారో, దేని మీద శ్రద్ధ పెట్టరో ఒక పట్టాన ఇతమిత్థంగా ఊహించలేం. కేంద్ర బడ్జెట్ల గురించి పుంఖానుపుంఖాలుగా విశ్లేషించే ఆర్థిక నిపుణులు, రాష్ట్ర బడ్జెట్ల విషయానికి వచ్చే సరికి ఒక్క మాట కూడా మాట్లాడరు.
వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రాలు, వాటి ఆర్థిక వనరులు, విధానాలు కూడా ప్రాధాన్యం వహిస్తాయన్న ఆలోచన ఉండకపోవడం నిజంగా విచిత్రం. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచిపోయినా వార్షిక బడ్జెట్ల మీద దేశ ప్రజలు ఇంకా ఆశలు పెట్టుకోవడం ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News