చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందకపోతే పొడారినట్టు అవుతుంది. వయసు మీద పడ్డం వల్ల, తరచూ స్నానం చేయడం వల్ల, గాఢమైన సబ్బులను వాడడం వల్ల కూడా చర్మం పొడారిపోతుంటుంది. చలికాలంలో చలిగాలులకు చర్మం నునుపుదనం కోల్పోయి పగిలినట్టు అవుతుంది. అందుకే పొడి చర్మం ఉన్నవాళ్లు చర్మ సంరక్షణకు కింద టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవి:
చర్మం మాయిశ్చరైజింగ్ ని కోల్పోకుండా చూసుకోవాలి. మాయిశ్చరైజర్లు చర్మం పై పొరలో ఉండే కణాలను రిహైడ్రేట్ చేస్తాయి కాబట్టి మాయిశ్చరైజర్లు ఎంత చిక్కగా, గ్రీజీగా ఉంటే అంత శక్తివంతంగా పొడిచర్మంపై పనిచేస్తాయి. పెట్రోలియం జెల్లీ అలాంటిదే. అలాగే మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ అంటే మినరల్ ఆయిల్స్ కూడా పొడిచర్మంపై బాగా పనిచేస్తాయి. కారణం వీటిల్లో నీరు అస్సలు ఉండదు. కానీ మిగతా మాయిశ్చరైజర్స్ వేరు. వాటిల్లో నీరు, ఆయిల్ రకరకాల ప్రమాణాల్లో కలుపుతారు. దీంతో ఈ మాయిశ్చరైజర్లు పెట్రోలియం జెల్లీలా గ్రీజీగా ఉండకుండా కాస్మొటిక్ స్వభావాన్ని మాత్రమే అధికంగా కలిగి ఉంటాయి.
శీతాకాలంలో హ్యుమిడిఫైయర్లను వాడాలి.
స్నానాన్ని ఐదు లేదా పది నిమిషాలు మించకుండా పూర్తిచేసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ సమయం స్నానం చేస్తే చర్మంపై ఉండే ఆయిలీ పొర పోతుంది. దీంతో చర్మం మాయిశ్చరైజింగ్ గుణాన్ని కోల్పోతుంది. అంతేకాదు చాలామంది వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్స్ పూర్తిగా పోతాయి. అందుకే గోరువెచ్చటి నీటితోనే స్నానం చేయాలి.
చర్మం మెరిసేలా ఉండాలని కొందరు రోజులో ఎక్కువసార్లు ముఖం కడుగుతుంటారు. అలా చేయకుండా మాయిశ్చరైజింగ్ గుణాలున్న డోవ్, ఓలే సబ్బులతో ముఖాన్ని కడుక్కుంటే మంచిది. అలాకాకపోతే సబ్బులకు బదులు సిటాఫిల్, ఆయిలేటమ్ ఎడి, యాక్వానిల్ వంటి క్లీన్సర్లను వాడడం పొడి చర్మానికి మంచిది. డియొడెరంట్ సోప్స్, పెర్ఫూమ్డ్ సోప్స్, ఆల్కహాల్ ఉత్పత్తులతో కొందరు ఒంటిని రుద్దుకుంటుంటారు. వీటివల్ల చర్మంపై ఉండే నేచురల్ ఆయిల్స్ పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.
చాలామంది బాత్ స్పాంజిలు, స్క్రబ్ బ్రషస్, వాష్ క్లోత్స్ తో శరీరాన్ని రుద్దుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం టెక్స్చెర్ దెబ్బతింటుంది. కాబట్టి ఒంటిని రుద్దుకోవడానికి వీటిని వాడకుండా ఉండడం ఉత్తమం.
స్నానం చేసిన తర్వాత, చేతులు కడుక్కున్నప్పుడు మాయిశ్చరైజర్ ని తప్పకుండా రాసుకోవాలి.
చర్మం దురద పెడుతుంటే చాలామంది గోకుతుంటారు. అలా చేయొద్దు. దానికి బదులు స్కిన్ పై మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం పొడారిపోయే గుణం పోయి మ్రుదువుగా తయారవుతుంది.
సువాసనలు లేని లాండ్రీ డిటర్జంటులను వాడాలి. అలాగే ఫాబ్రిక్ సాఫ్టనర్స్ జోలికి పోకుండా ఉంటే మంచిది.
చర్మాన్ని ఇరిటేట్ చేసే ఊల్, ఇతర ఫ్యాబ్రిక్ లను ధరించొద్దు.
కొబ్బరినూనె వంటికి రాసుకుంటే చర్మం నున్నగా తయారవుతుంది.
ఇరిటేటెడ్ చర్మం ఉన్నవారికి ఓట్మీల్ బాత్ బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లతో పాటు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం ఇరిటేట్ అవకుండా సంరక్షిస్తాయి. ఓట్మీల్ బాత్ ను ఇంట్లో కూడా చేయొచ్చు. ఓట్మీల్ ను మెత్తటి పొడిలా చేసి దాన్ని గోరువెచ్చటి నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఓట్ మీల్ బాత్ కమర్షియల్ ప్రాడక్టులు కూడా మార్కెట్ లో చాలా ఉన్నాయి. వాటితోనైనా ఓట్మీల్ బాత్ చేయొచ్చు.
యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న బ్లూబెర్రీలు, టొమాటోలు, క్యారెట్స్, బీన్స్, పచ్చిబఠానీలు, పప్పుగింజలు బాగా తింటే శరీరంలోని టాక్సినుల బయటకుపోయి చర్మం దెబ్బతినదు. అంతేకాదు ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.
ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు బాగా ఉన్న సాల్మన్ చేప లాంటి ఆహారపదార్థాలు తినడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.